అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా ఒకప్పుడు సమావేశాలు, పర్యటనలు, ప్రసంగాలతో తీరికలేకుండా గడిపేవారు. నిత్యం ఏదో ఒక అప్‌డేట్‌తో వార్తల్లో నిలిచేవారు. కానీ, గత కొంతకాలంగా పూర్తిగా కనుమరుగైపోయారు. ఎక్కడా ఆయన గురించి చిన్న వార్త కూడా బయటకు రావడం లేదు. టెక్ వ్యాపారాలు, వాటి యజమానులపై చైనా విరుచుకుపడడం ప్రారంభించినప్పటి నుంచి జాక్ మా జాడ లేకుండా పోయింది. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉంటున్నారనేది చాలా మందికి ఓ అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది. దీని గురించే విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఫైనాన్షియల్ టైమ్స్ ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.
జాక్ మా ఆయన కుటుంబంతో కలిసి గత ఆరు నెలలుగా జపాన్ రాజధాని టోక్యోలో ఉంటున్నారు. ఈ విషయాన్ని ఆయన వ్యవహారాలను చక్కబెడుతున్న ఇద్దరు కీలక వ్యక్తులు తెలిపినట్లు ఎఫ్‌టీ పేర్కొంది. ఆయన తరచూ అమెరికా, ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారట. వ్యక్తిగత వంట మనిషి, భద్రతా సిబ్బంది మాత్రమే ఆయన వెంట ఉంటున్నారని సమాచారం. టోక్యోలో అసలు ఎలాంటి హడావుడి లేకుండా చాలా సాధారణ జీవితం గడుపుతున్నారని తెలుస్తోంది. వీలైనంత వరకు ప్రజాకార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. టోక్యో నడిబొడ్డున ఉన్న గింజా డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని ప్రైవేటు వ్యక్తుల క్లబ్బులు, ఇంపీరియల్ ప్యాలెస్‌కు ఎదురుగా ఉన్న మరునౌచీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న మరో క్లబ్.. ఇక్కడే ఆయన ఎక్కువగా సేదతీరుతున్నారని సమాచారం.