Withdraw Loan From Ppf : దేశంలో చిన్న పొదుపులను పెట్టుబడి రూపంలో సమీకరించే లక్ష్యంతో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) 1968లో ఏర్పాటైంది. దీనిని సేవింగ్స్-కమ్-టాక్స్ సేవింగ్స్ ఇన్వెస్ట్‌మెంట్ అని కూడా పిలుస్తారు. ఇది వార్షిక పన్నులను ఆదా చేస్తూ పదవీ విరమణ నిధిని నిర్మించడానికి వీలు కల్పిస్తుంది. పన్నులను ఆదా చేయడానికి, హామీతో కూడిన రాబడిని సంపాదించడానికి సురక్షితమైన పెట్టుబడి ఎంపిక కోసం చూస్తున్న ఎవరైనా పీపీఎఫ్ ఖాతాను తెరవొచ్చు.
PPF ఖాతా ఎలా తెరవాలి?
18 సంవత్సరాలు నిండిన భారత పౌరులు ఎవరైనా పోస్టాఫీసు, ఎస్‌బీఐ లేదా ఏదైనా జాతీయ బ్యాంకులో ఈ ఖాతాను తెరవొచ్చు. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకు వంటి కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా ఖాతాను తెరవొచ్చు. ఒక వ్యక్తి ఒక ఖాతానే తెరవాలి. ఉమ్మడి ఖాతా సౌకర్యం లేదు. కానీ మైనర్ పేరు మీద ఒక ఖాతాను తెరిచే అవకాశం ఉంది. పీపీఎఫ్ ఖాతాను తెరిచేటప్పుడు ఖాతాదారుని పాన్, ఆధార్, ఓటర్ ఐడీ, లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజు ఫోటో, పూర్తి చేసిన దరఖాస్తు అవసరం ఉంటుంది.
మైనర్ దరఖాస్తు అయితే పై పత్రాలే కాకుండా, జనన ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రుల కేవైసీ వివరాలు మొదలైనవి కావాలి. నామినీ డిక్లరేషన్ ఫారం కూడా ఇవ్వాలి. రూ.100తో ఖాతాను తెరవొచ్చు. ప్రతి ఆర్థిక సంవత్సరానికి కనిష్ఠ డిపాజిట్‌గా రూ.500, గరిష్ఠ డిపాజిట్‌గా రూ.1.50 లక్షల వరకు చేయొచ్చు. పెట్టుబడిని ఒకేసారి లేదా గరిష్ఠంగా 12 వాయిదాలలో చెల్లించొచ్చు. డిపాజిట్‌ను నగదు, చెక్కు, డీడీ లేదా ఆన్‌లైన్ ఫండ్ బదిలీ ద్వారా చేయొచ్చు. ఈ ఖాతా మెచ్యూరిటీ కాలవ్యవధి 15 ఏళ్లు. ప్రస్తుతం ఏడాదికి 7.10% వడ్డీ లభిస్తుంది.
మధ్యలో డబ్బులు అవసరమైతే?
ఈ ఖాతాలో ఉన్న డబ్బును 15 ఏళ్ల లోపు ఉపసంహరించుకోవాలనుకుంటే ఖాతా 5 ఏళ్లు పూర్తయిన తర్వాత.. విద్య, అత్యవసర వైద్య ఖర్చుల కోసం ఖాతా నిల్వలో 50% ఉపసంహరించుకోవచ్చు. ఖాతా 6 ఏళ్లు పూర్తయిన తర్వాత.. 7వ సంవత్సరం నుంచి కూడా నిల్వ మొత్తంలో పాక్షికంగా తీసుకోవచ్చు. ఈ ఉపసంహరణ మొత్తం మీ పీపీఎఫ్ ఖాతాలో 4వ సంవత్సరం చివరిలో ఉన్న నగదు నిల్వలో 50% లేదా అంతకు ముందు సంవత్సరం చివరిలో 50% నగదు నిల్వలో (ఏది తక్కువైతే అది) మాత్రమే ఉపసంహరించుకోవచ్చు. ఏడాదికోసారి మాత్రమే ఉపసంహరణకు వీలుంటుంది.