Ways To Increase Credit Score: వడ్డీ రేట్లు పెరగడం ప్రారంభించాయి. వచ్చే కొన్ని నెలల్లో ఇవి మరో ఒక శాతం వరకూ పెరిగే అంచనాలూ ఉన్నాయి. బ్యాంకులు రుణగ్రహీతల గత చరిత్ర ఆధారంగా వడ్డీ రేట్లను నిర్ణయించడం ప్రారంభించాయి. మంచి చెల్లింపుల చరిత్ర, క్రెడిట్ స్కోరున్న వారికి 0.25శాతం నుంచి 0.50శాతం వరకూ వడ్డీ రేట్లలో రాయితీనిస్తున్నాయి. మరి, ఈ క్రెడిట్ స్కోరు తగ్గితే ఏమవుతుంది. వడ్డీ భారం మోయాల్సిందేనా? దీన్ని పెంచుకునేందుకు ఉన్న మార్గాలేమిటి?
క్రెడిట్ స్కోరును 300 నుంచి 900 పాయింట్ల వరకూ లెక్కిస్తారు. 750 పాయింట్లకు మించి ఉంటే.. మంచి క్రెడిట్ స్కోరుగా పరిగణిస్తారు. మీరు ఆర్థికంగా స్థిరంగా ఉన్నట్లు, రుణాలకు వాయిదాలు, క్రెడిట్ కార్డుల బిల్లులు సకాలంలో చెల్లిస్తున్నట్లు లెక్క అన్నమాట. బ్యాంకులు ఆశించిన స్కోరున్న వారికి రుణాలు లభించడమూ సులువే. తక్కువ పాయింట్లు ఉన్న వారిని బ్యాంకులు అంతగా పట్టించుకోవు. వడ్డీ రేట్లు పెరుగుతున్న సమయంలో రుణ సంస్థలు ఇలాంటి విషయాలను మరీ ఎక్కువగా పట్టించుకుంటాయి.
మరీ తక్కువగా ఉంటే..
క్రెడిట్ స్కోరు 300-550 పాయింట్ల మధ్య ఉంటే.. దాన్ని 'పూర్' స్కోరుగా భావిస్తారు. ఇలాంటి స్థితిలో ఉన్నవారు.. వెంటనే జాగ్రత్త పడక తప్పదు. దశల వారీగా స్కోరు పెంచుకునేందుకు ఉన్న మార్గాలను అన్వేషించాలి. ఇది ఒక్క రోజులో అయ్యే పని కాదు. ఆర్థిక క్రమశిక్షణతో కొన్నేళ్లపాటు దీనిని సాధించాల్సి ఉంటుంది.
కారణాలేమిటి?
తగ్గిన స్కోరును పెంచుకోవాలని అనుకున్నప్పుడు ముందుగా అది తగ్గడానికి కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. క్రెడిట్ బ్యూరో లేదా ఆన్‌లైన్ బ్యాంకింగ్ అగ్రిగేటర్ల నుంచి ఈ నివేదికను పొందేందుకు వీలుంది. ఈ నివేదికను నిశితంగా పరిశీలించాలి. అప్పుడు ఎక్కడ లోపం ఉందో కనిపెట్టవచ్చు. కొన్నిసార్లు ఒకటికి మించిన కారణాలతో స్కోరు తగ్గుతూ ఉండొచ్చు. ముందుగా వాటిని గుర్తించండి. చాలా సందర్భాల్లో క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో తీర్చలేకపోవడం, రుణ వాయిదాలు చెల్లించలేనప్పుడు స్కోరు వేగంగా పడిపోతుంది. అధిక రుణ వినియోగ నిష్పత్తి, హామీ లేని రుణాల కోసం తరచూ బ్యాంకుల్లో విచారించడం, రుణదాత క్రెడిట్ బ్యూరోలకు తప్పుడు సమాచారం ఇవ్వడం, మీరు ఇతరులకు హామీగా ఉన్నప్పుడు.. వారు సరిగా రుణ వాయిదాలు చెల్లించకపోవడంలాంటి కారణాలతో స్కోరు తగ్గేందుకు అవకాశాలున్నాయి.
ప్రభావం ఏమిటి?
క్రెడిట్ స్కోరు తక్కువగా ఉండటం వల్ల మీ ఆర్థిక ప్రణాళికలపై ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపించే ప్రమాదం ఉంది. కొత్త రుణాలు తీసుకొని, ఏదైనా కొనాలంటే కష్టం కావచ్చు. ఇంటి కోసం లేదా కారు గురించి అప్పు తీసుకోవాలని అనుకున్నప్పుడు బ్యాంకు/ఆర్థిక సంస్థ వడ్డీని పెంచి రుణం ఇస్తామని చెప్పొచ్చు. రుణం కొనసాగుతున్న కాలంలోనూ స్కోరు తగ్గితే.. బ్యాంకు వడ్డీ రేటును పెంచొచ్చు.