Warren Buffett Bitcoin: ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలకు ఓవైపు ఆదరణ పెరుగుతోంది. మరోవైపు అదే స్థాయిలో దీనిపై విమర్శలూ వస్తున్నాయి. ఇప్పుడు అతిపెద్ద క్రిపోగా ఉన్న బిట్‌కాయిన్‌కు ఎంత ఆదరణ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం (సోమవారం సాయంత్రం 4:56 గంటలు) బిట్‌కాయిన్ విలువ 38,712.75 డాలర్ల వద్ద చలిస్తోంది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ 73.6 వేల కోట్ల డాలర్లుగా (సుమారు రూ.56.30 లక్షల కోట్లు) ఉంది.
తొలి నుంచి బిట్‌కాయిన్ సహా క్రిప్టోకరెన్సీపై పెదవి విరుస్తున్న వారిలో ప్రపంచ ప్రముఖ మదుపరి వారెన్ బఫెట్ ముఖ్యులు. తాజాగా మరోసారి బిట్‌కాయిన్‌పై ఉన్న ఆయన అనాసక్తిని వ్యక్తపరిచారు. ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రపంచంలో ఉన్న బిట్‌కాయిన్‌లన్నింటినీ తాను కనీసం 25 డాలర్లకు కూడా కొనబోనని స్పష్టం చేశారు. అంటే 73.6 వేల కోట్ల డాలర్లు విలువ చేసే బిట్‌కాయిన్‌ల కోసం ఆయన కనీసం 25 డాలర్లు కూడా వెచ్చించనని తెలిపారు. బిట్‌కాయిన్‌ల వల్ల ప్రయోజనమేమీ ఉండదని.. ఒకవేళ కొన్నా తిరిగి వాటిని ఎవరికో ఒకరికి అమ్మాల్సి ఉంటుందన్నారు.