VIVO ED News: చైనా మొబైల్ తయారీ సంస్థ వివో ఆర్థిక అక్రమాల డొంక కదులుతోంది. వివో మొబైల్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, 23 దాని అనుబంధ కంపెనీలపై ఈ నెల 5న దాడులు నిర్వహించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కీలక విషయాలను గుర్తించింది. భారత్‌లో పన్ను ఎగవేసేందుకు వివో తమ టర్నోవర్‌లో సుమారు 50శాతం మొత్తాన్ని చైనాకు తరలించినట్లు ఈడీ తెలిపింది. ఈ మొత్తం 62వేల 476కోట్లు అని వెల్లడించింది. 119 బ్యాంకు ఖాతాల్లో ఉన్న 465 కోట్ల రూపాయల వివో నిధులను స్తంభింపజేసినట్లు వివరించింది. మరో 73 లక్షల నగదు, 2 కిలోల బంగారు కడ్డీలను కూడా సీజ్ చేసినట్లు ఈడీ తెలిపింది.
వివో మాజీ డైరెక్టర్ బిన్ లౌ అనేక కంపెనీలను విలీనం చేసిన తర్వాత 2018లో భారత్ విడిచి వెళ్లినట్లు ఈడీ వెల్లడించింది. ఆ కంపెనీలన్నీ తమ దర్యాప్తు పరిధిలో ఉన్నట్లు వివరించింది. వివోకు చెందిన ఇద్దరు డైరెక్టర్లు జెంగ్‌షెన్ ఔ, చాంగ్ చియా ఈనెల 5న సోదాలు జరిగిన తర్వాత చైనా పారిపోయినట్లు ప్రచారం జరిగినా.. 2021లోనే వెళ్లిపోయినట్లు ఈడీ అధికారి ఒకరు చెప్పారు. ఇదే ఆరోపణలపై సీబీఐ అధికారులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. సోదాల సందర్భంగా పలువురు చైనా దేశస్థులు సహా వివో ఉద్యోగులు తమకు సహకరించలేదని ఈడీ ఆరోపించింది. దర్యాప్తు బృందాలు గుర్తించిన డిజిటల్ సామగ్రిని దాచడం, అందులోని సమాచారాన్ని తొలగించడం వంటివి చేశారని విమర్శించింది. కొందరు పారిపోయేందుకు ప్రయత్నించినట్లు తెలిపింది.