VIVO Directors Flee: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విస్తృత దర్యాప్తు నేపథ్యంలో వివో మొబైల్స్ తయారీ సంస్థ డైరెక్టర్లు జెంగ్‌షెన్ ఔ, చాంగ్ చియా చైనాకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్ ఆరోపణలపై చాలా రోజులుగా వివోపై ఈడీ దృష్టిపెట్టింది. వివోకు చెందిన 44 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసిన తర్వాత ఆ సంస్థ డైరెక్టర్లు పారిపోయినట్లు ప్రచారం జరిగింది. అయితే.. వివో మొబైల్స్ డైరెక్టర్లు ఇద్దరు గతేడాదే చైనాకు వెళ్లిపోయినట్లు ఈడీ అధికారి ఒకరు చెప్పారు. ఇదే ఆరోపణలపై సీబీఐ అధికారులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. ఐటీ విభాగం, కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ సైతం వివో సంస్థ వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్నాయి. ఇతర చైనా సంస్థల ఆర్థిక అవకతవకలపై విచారణలో భాగంగానే వివోపైనా దర్యాప్తు చేస్తున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. వివో మొబైల్స్‌కు సంబంధించి ఈడీ దర్యాప్తు అంశాన్ని నిశితంగా గమనిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ తెలిపింది. భారత దర్యాప్తు సంస్థలు చట్టాలకు లోబడి చైనా సంస్థలపై పారదర్శకంగా దర్యాప్తు చేస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడించింది.
VIVO ED Raids: వివోకు చెందిన కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించడంపై డ్రాగన్ దేశం స్పందించింది. చైనాకు చెందిన కంపెనీలనే లక్ష్యంగా చేసుకొని ఇలాంటి దాడులు నిర్వహించడం వల్ల భారత్‌పై పెట్టుబడిదారుల్లో విశ్వాసం దెబ్బతింటుందని పేర్కొంది. చైనా, విదేశాలకు చెందిన కంపెనీలు భారత్‌లో పెట్టుబడి పెట్టడానికి ఆలోచిస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు భారత్‌లోని ఆ దేశ రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి వాంగ్ జియాజియాన్ దీనిపై స్పందించారు.
జియాన్ తాజాగా స్పందిస్తూ.. వివో కార్యాలయాలపై ఈడీ సోదాల విషయాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించేటప్పుడు స్థానిక చట్టాలకు కట్టుబడి ఉండాలని చైనా ఎప్పుడూ తమ దేశ కంపెనీలకు సూచిస్తుందని తెలిపారు. అదే సమయంలో భారత్ మాత్రం చైనా కంపెనీలే లక్ష్యంగా వరుస దాడులు నిర్వహిస్తోందని అన్నారు. ఇవి ఆయా సంస్థల కార్యకలాపాలను, ప్రతిష్ఠను దెబ్బతీస్తుందన్నారు. ఈ పరిణామాలతో.. భారత్‌లో పెట్టుబడులకు ప్రతికూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు.