Twitter engineer video: 'ట్విట్టర్ భావప్రకటన స్వేచ్ఛను నమ్మదు.. ఆ సంస్థలో కొనసాగాలంటే ఉద్యోగులు తమ సిద్ధాంతాలను పక్కన పెట్టి ట్విట్టర్ అనుసరించే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలనే నమ్మాలి.. ట్విట్టర్‌ను మస్క్ కొనుగోలు చేయడం ఉద్యోగులకు నచ్చలేదు'.. ఈ మాటలు ఎవరో నెటిజన్ చేసిన కామెంట్ కాదు.. స్వయంగా ఆ సంస్థలో పనిచేసే ఓ ఉద్యోగి అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికాకు చెందిన ప్రాజెక్ట్ వెరిటాస్ అనే గ్రూప్ షేర్ చేసిన ఈ వీడియో ట్విట్టర్‌ను కొత్త చిక్కుల్లో పడేసింది. సిరు మురుగేశన్గా పేర్కొంటున్న ఆ వ్యక్తి మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రాజెక్ట్ వెరిటాస్.
ప్రాజెక్ట్ వెరిటాస్ ప్రకారం.. ట్విట్టర్లో సీనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సిరు మురుగేశన్.. సంస్థ వైఖరిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లు పెట్టి సంస్థను కొనుగోలు చేసే డీల్‌పై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారని మురుగేసన్ తెలిపారు. సంస్థ పూర్తిగా వామపక్షవాది అని.. మతతత్వవాదులను అసలు సహించదని పేర్కొన్నారు.
"ట్విట్టర్ సంస్థలో అంతా పూర్తి కమ్యూనిస్టు వాతావరణం ఉంటుంది. అందుకే మస్క్ సంస్థను కొనుగోలు చేసే ప్రతిపాదనను నా సహోద్యోగులు అసలు సహించలేకపోయారు. మస్క్ సంస్థను కొంటానని ప్రతిపాదించిన రోజు నా తోటి ఉద్యోగులంతా 'ఇది నిజమైతే కంపెనీలో ఇదే నా ఆఖరి రోజు' అన్నట్టు స్పందించారు. టిట్టర్ సిద్ధాంతాలకు విరుద్ధంగా మస్క్ సంస్థలు నడవడమే అందుకు కారణం. ఆయన క్యాపిటలిస్ట్.. కానీ మా సంస్థ మాత్రం క్యాపిటలిస్ట్ సిద్ధాంతంలో లేదు. నిజానికి మేమంతా కమ్యూనిస్టులం."
-సిరు మురుగేశన్, సీనియర్ ఇంజినీర్ - ట్విట్టర్