తెలంగాణ

telangana

ETV Bharat / business

Twitter Logo : పిట్టకు మస్క్​ గుడ్​బై.. కొత్త లోగో అదే.. - ట్విట్టర్ లోగో ఎలాన్​ మస్క్​ నిర్ణయం

Twitter Logo : ట్విట్టర్​ లోగోకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు ఎలాన్​ మస్క్​. ప్రస్తుతం ఉన్న పక్షి లోగోను మార్చేందుకు శ్రీకారం చుట్టారు. అలాగే ట్విట్టర్​లోని అన్‌ వెరిఫైడ్‌ ఖాతాల నుంచి ప్రత్యక్ష సందేశాలు పంపడాన్ని పరిమితం చేస్తున్నట్లు శనివారం మస్క్‌ ప్రకటించారు.

Twitter Logo Change
ట్విట్టర్​లో కీలక మార్పు.. పిట్ట స్థానంలో 'X' లోగో.. ఎలాన్​ మస్క్​ నిర్ణయం..

By

Published : Jul 23, 2023, 12:41 PM IST

Updated : Jul 23, 2023, 1:08 PM IST

Twitter Logo Change : ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్విట్టర్​ లోగోకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నారు టెస్లా అధినేత, ట్విట్టర్​ సీఈఓ ఎలాన్​ మస్క్. కొన్నేళ్లుగా కొనసాగుతున్న పక్షిలోగోను మారుస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఆదివారం ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు. పక్షి స్థానంలో 'X' అక్షరంతో లోగోను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కాగా, ట్విట్టర్​ను సరికొత్తగా ఏర్పాటు చేసిన 'ఎక్స్‌ కార్ప్‌' అనే కంపెనీలో విలీనం చేస్తున్నట్లు కొన్నేళ్ల క్రితమే మస్క్‌ ప్రకటించారు. "ట్విట్టర్‌ బ్రాండ్‌ సహా క్రమంగా అన్ని పక్షులకు త్వరలోనే మేం వీడ్కోలు పలకనున్నాం. ఈ రాత్రి పోస్టు చేసిన 'X' లోగో బాగుంటే.. రేపటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి రానుంది" అని మస్క్​ ట్వీట్​ చేశారు.

మిశ్రమ స్పందన..
Twitter Logo New : గతేడాది ట్విట్టర్​ను ఎలాన్​ మస్క్​ కొనుగోలు చేసిన తర్వాత ఆయన తీసుకున్న పలు కీలక నిర్ణయాల్లో ఇదే అతిపెద్ద మార్పుగా నిలవనుంది. అయితే ట్విట్టర్​కు సంబంధించి ఆయన తీసుకునే ఏ నిర్ణయానికైనా మిశ్రమ స్పందనలు వస్తుంటాయి. ఈసారి కూడా కొందరు నెటిజన్లు రానున్న కొత్త మార్పును స్వాగతిస్తుంటే మరికొందరేమో లోగో మార్పు సరైంది కాదని తప్పుబడుతున్నారు.

ట్వీట్​ చేస్తే 'మనీ కట్'​..
Twitter Subscription Fee On Unverified Account : ఇకనుంచి బ్లూటిక్​ లేని(అన్‌వెరిఫైడ్‌ అకౌంట్​) ట్విట్టర్​ ఖాతా నుంచి గనుక ట్వీట్​ చేస్తే ఛార్జీలు విధించనున్నట్లు తెలిపింది ట్విట్టర్​. స్నేహితులతో పాటు ఫాలోవర్లకు డైరెక్ట్​ మెసేజ్​లు పంపినందుకు కొంత మొత్తం డబ్బును వసూలు చేయనున్నట్లు చెప్పింది. తమ సబ్‌స్క్రిప్షన్ సేవల్లో భాగమైన ట్విట్టర్​ బ్లూ టిక్​ సైన్​ అప్​ కోసం మరింతమంది వినియోగదారులను ఆకర్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

దీంతో పాటు నేరుగా పంపే స్పామ్​ సందేశాలను అరికట్టేందుకు కూడా ఈ నిర్ణయం దోహదం చేస్తుందని పేర్కొంది. అయితే ధ్రువీకరించని ఖాతాలు(అన్‌వెరిఫైడ్‌ అకౌంట్​) నుంచి పంపే రోజూవారీ సందేశాలపై ఈ పరిమితులను విధించనున్నారు. అంటే ఇకనుంచి అన్​వెరిఫైడ్​ అకౌంట్స్​ నుంచి మీరు నేరుగా పరిమిత స్థాయిలో మాత్రమే సందేశాలు(డైరెక్ట్‌ మెసేజ్‌లు) పంపగలరు. ఎక్కువ సంఖ్యలో మెసేజ్​లు పంపాలంటే మాత్రం సబ్​స్క్రిప్షన్​ను తప్పనిసరి చేయనుంది. అయితే ఈ మార్పు ఈనెల 22 నుంచి అమల్లోకి వస్తుందని ట్విట్టర్​ ప్రకటించినా సంస్థ నుంచి ఇంకా నిర్దిష్టమైన మార్గదర్శకాలు మాత్రం విడుదల కాలేదు.

"డైరెక్ట్‌ మెసేజ్‌ల స్పామ్‌ను తగ్గించేందుకు మేం ప్రయత్నాలు చేస్తున్నాం. అన్‌వెరిఫైడ్‌ ఖతాల నుంచి భవిష్యత్తులో పరిమిత సంఖ్యలోనే డీఎం (డైరెక్ట్‌ మెసేజ్‌)లు చేయగలరు. నేడే సబస్క్రైబ్‌ చేసుకొని ఎక్కువ మెసేజ్‌లు పంపండి".

- ఎలాన్​ మస్క్​, ట్విట్టర్​ సీఈఓ.

Last Updated : Jul 23, 2023, 1:08 PM IST

ABOUT THE AUTHOR

...view details