Things To know Before Applying Car Loan : చాలా మందికి ఓ మంచి కారు కొనాలనే కల ఉంటుంది. అందుకోసం బ్యాంకు లోన్ తీసుకోవాలని అనుకుంటుంటారు. అయితే కారు కొనేందుకు.. సరైన ప్రణాళిక అవసరమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. మరి ఆ ప్రణాళిక ఏ విధంగా ఉంటే మంచిది? వాహన రుణం తీసుకోవడానికి ముందు ఏయే విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి అనే వివరాలు మీ కోసం.
సిబిల్ స్కోరు ఉందా?
లోన్ కోసం అప్లై చేసే సమయంలో బ్యాంకులు ముందుగా రుణ గ్రహీతసిబిల్ స్కోరును(క్రెడిట్‌స్కోరు) విశ్లేషిస్తాయి. తక్కువ క్రెడిట్ స్కోరున్న వారికి రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావు. ముఖ్యంగా వెహికల్ లోన్ల విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉంటాయి. కనుక, కారు కొనాలని అనుకున్న వెంటనే సిబిల్ స్కోరును గమనించాలి. అందులో ఏమైనా వ్యత్యాసాలను మీరు గమనించినట్లయితే వెంటనే సంబంధిత బ్యాంకు, క్రెడిట్బ్యూరోల దృష్టికి తీసుకెళ్లాలి. స్కోరు 750కి మించి ఉన్నప్పడే అనుకున్న లోన్ అందుకునేందుకు వీలవుతుంది.
వివిధ బ్యాంకుల వడ్డీరేట్లను పోల్చిచూడండి
ముందుగా వివిధ బ్యాంకులు అందిస్తున్న రుణాలను, వాటి వడ్డీ రేట్లను సరిపోల్చుకోండి.బ్యాంకుల అధికారిక వెబ్‌సైట్ల ద్వారా, ఈ వివరాలు సులభంగానే తెలుసుకోవచ్చు. కారు లోన్ సాధారణంగా ఏడేళ్లపాటు ఉంటుంది. కనుక, రుణదాత విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉండాలి. వాయిదా గడువు తేదీ దాటితే విధించే జరిమానాలతో పాటు, అన్ని రుసుముల గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత వరకూ లోన్ ఇస్తున్నారో చూసుకోండి. కొన్ని బ్యాంకులు ఆన్‌రోడ్ ప్రైస్‌పై 100 శాతం రుణాలు ఇస్తున్నాయి. మీ అర్హతకు అనుగుణంగా, ఇలాంటివీ చూడొచ్చు. వీలైనంత వరకూ తక్కువ లోన్ తీసుకోవడమే ఎల్లప్పుడూ మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోండి.