Things To Do After Got Salary: సంపాదన ప్రారంభం కాగానే.. పొదుపు, పెట్టుబడి మీ మొదటి ప్రాధాన్యంగా మారాలి. చేతికి వచ్చిన మొత్తంలో 20 శాతం మదుపు వైపు మళ్లించాలి. మీరు ఎంత త్వరగా పెట్టుబడి ప్రారంభిస్తే.. దీర్ఘకాలంలో అంత లాభం అని మర్చిపోవద్దు.
ఈక్విటీలతో ప్రారంభం..
మీ సంపాదన ప్రారంభమైన వెంటనే పెట్టుబడులూ ఆరంభించాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) ఇందుకోసం మంచి మార్గం. ఒక్కసారి 'సిప్' ప్రారంభించాక.. నెలనెలా నిర్ణీత మొత్తం ఫండ్లలోకి వెళ్తుంది. దీర్ఘకాలంలో మ్యూచువల్ ఫండ్ల ద్వారా సంపదను సృష్టించే ఈ మార్గాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. రాబడులకు హామీ లేకపోయినా.. ఈక్విటీ మార్కెట్లు గడిచిన 20 ఏళ్లలో సగటున 12 శాతం వార్షిక రాబడిని అందించడం చూశాం.
సురక్షితంగానూ..
ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్) మీ పెట్టుబడుల జాబితాలో స్థానం సంపాదించాలి. బ్యాంకులు లేదా పోస్టాఫీసులో పీపీఎఫ్ ఖాతాను ప్రారంభించొచ్చు. ప్రభుత్వ హామీతో ఉండే సురక్షిత పథకమిది. ప్రస్తుతం 7.1శాతం వడ్డీ వస్తోంది. మధ్యలో వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. 15 ఏళ్ల పూర్తి వ్యవధి కొనసాగించేందుకే మొగ్గు చూపాలి. కచ్చితమైన రాబడితో దీర్ఘకాలిక అవసరాలకు ఇది సహాయపడుతుంది. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు కోసమూ ఉపయోగపడుతుంది. ఏడాదికి కనీసం రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.1,50,000 వరకూ మదుపు చేసుకోవచ్చు.
ధీమాగా ఉండాలి..
ఊహించని అనారోగ్యాలు.. మన చేతిలో ఉన్న డబ్బును హరిస్తాయి. ఇలాంటి సంక్షోభాల నుంచి రక్షించుకోవాలంటే.. ఆరోగ్య బీమా తీసుకోవాల్సిందే. వైద్యపరమైన విపత్కర పరిస్థితుల్లో ఇది మీకు ఆర్థికంగా అండగా ఉంటుంది. ఆరోగ్య బీమా కోసం చెల్లించిన ప్రీమియం ఆర్థిక ప్రణాళికలో ఒక ముఖ్యమైన పెట్టుబడి. దీంతోపాటు.. చిన్న వయసులోనే జీవిత బీమా పాలసీని తీసుకోవాలి. టర్మ్ పాలసీని ఎంచుకోవడం వల్ల తక్కువ ప్రీమియంతో.. అధిక రక్షణ సొంతం చేసుకోవచ్చు.