TCS Q3 Results 2024 :దిగ్గజ ఐటీ సంస్థ, దేశీయ అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్- టీసీఎస్ మూడో(Q3) త్రైమాసిక ఫలితాలను గురువారం ప్రకటించింది. అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికానికి గానూ కంపెనీ నికర లాభం 8.2 శాతం వృద్ధితో రూ. 11,058 కోట్లుగా నమోదు అయింది. ఇక ఆదాయం విషయానికి వస్తే 4 శాతం మేర పెరిగి రూ. 60,583 కోట్లుగా ఉంది. ఇంధనం, వనరులు, తయారీ, లైఫ్ సైన్సెస్ & హెల్త్‌కేర్ విభాగాలు టీసీఎస్ వృద్ధికి కారణమయ్యాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆపరేటింగ్ మార్జిన్ అర శాతం పెరిగి 25శాతానికి చేరుకుందని పేర్కొంది. నికర మార్జిన్ 19.4 శాతంగా ఉందని వెల్లడించింది.
గతేడాది త్రైమాసికంతో పోలిస్తే లాభాలు
TCS Quarterly Results :టీసీఎస్ మూడో త్రైమాసిక నికర లాభం కిందటేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 2 శాతం మాత్రమే పెరిగింది. ఇక అంతకుముందు, అంటే జులై- సెప్టెంబర్ త్రైమాసికం(Q2)తో పోలిస్తే లాభం 2.4 శాతం పడిపోయింది. సెప్టెంబర్ క్వార్టర్‌లో నికర లాభం రూ. 11,380 కోట్లుగా నమోదైంది.