Tata Motors New Electric Car : విద్యుత్ వాహనాల విషయంలో టాటా మోటార్స్ దూకుడు పెంచింది. ఇప్పటికే నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ పేరిట వ్యక్తిగత వాహనాలను లాంచ్ చేసిన ఆ కంపెనీ.. త్వరలో మరో విద్యుత్ కారును తీసుకొస్తోంది. తన ఎంట్రీ లెవెల్ మోడల్ టియాగో విద్యుత్ వాహనాన్ని ఈ నెల తర్వాత తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ ఈవీ దినోత్సవం సందర్భంగా టాటా మోటార్స్ ఈ ప్రకటన చేసింది. పర్యావరణ హితమైన వాహనాలను వినియోగదారులకు అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా దీన్ని తీసుకొస్తున్నట్లు ఆ కంపెనీ పేర్కొంది. త్వరలో టియాగోకు సంబంధించిన ధర, స్పెసిఫికేషన్ వివరాలను కంపెనీ వెల్లడించే అవకాశం ఉంది.
రాబోయే ఐదేళ్లలో 10 ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తామని ఇప్పటికే టాటా మోటార్స్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఈవీ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తూ టియాగో ఈవీని తీసుకొస్తున్నట్లు ఆ కంపెనీ ప్యాసింజర్ వెహికల్స్ ఎండీ శైలేష్ చంద్ర ప్రకటించారు. భారత్‌ను ప్రపంచ ఈవీ హబ్‌గా మార్చాలన్న విజన్‌కు టాటా మోటార్స్ కట్టుబడి ఉందని చెప్పారు. 2030 నాటికి 30 శాతం వాహనాలు ఎలక్ట్రికల్‌వే ఉండాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రస్తుతం 40 వేల టాటా ఈవీలు రోడ్లపై పరుగులు పెడుతున్నాయని కంపెనీ పేర్కొంది.
ఐఫోన్ తయారీలోకి టాటా గ్రూప్..? : ఆటోమొబైల్, ఐటీ, స్టీల్.. ఇలా వివిధ రంగాల్లో వ్యాపారాలు సాగిస్తున్న టాటా గ్రూప్ స్మార్ట్‌ఫోన్ తయారీలోనూ అడుగుపెట్టనుందా? యాపిల్‌కు చెందిన ఐఫోన్ల తయారీని భారత్‌లో చేపట్టనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. భారత్‌లో ఐఫోన్ అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు తైవాన్‌కు చెందిన విస్ట్రన్ కార్పొరేషన్‌తో ఆ గ్రూప్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. విస్ట్రన్‌తో కలిసి ఎలక్ట్రానిక్ జాయింట్ వెంచర్‌ను భారత్‌లో ఏర్పాటు చేయాలని ఆ గ్రూప్ భావిస్తోందని సమాచారం. ఫోన్ల ఉత్పత్తి, సప్లయ్ చైన్, అసెంబ్లింగ్‌లో విస్ట్రన్ కార్పొరేషన్ నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని టాటా గ్రూప్ భావిస్తోందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తి వెల్లడించినట్లు 'బ్లూమ్‌బెర్గ్' తెలిపింది. ఒకవేళ ఈ డీల్ ఓకే అయితే ఐఫోన్లను తయారు చేసే తొలి భారతీయ కంపెనీగా టాటా గ్రూప్ అవతరించనుంది.