Assurance Precautions: అప్పు తీసుకునే వ్యక్తికి హామీ ఉంటున్నారంటే.. ఆ రుణానికి మీరూ బాధ్యత వహించాల్సిందే. రుణగ్రహీత ఆ అప్పు తీర్చని సందర్భంలో హామీగా ఉన్న వ్యక్తి దాన్ని చెల్లించాల్సి ఉంటుంది. హామీ పత్రం మీద సంతకం చేసేటప్పుడు ఈ విషయాన్ని ముందుగా అర్థం చేసుకోవాలి.
తిరిగి చెల్లించగలరా?:రుణ గ్రహీత అప్పును తిరిగి చెల్లించడంలో ఇబ్బంది ఎదుర్కోవచ్చు అనే అంచనాతోనే రుణదాత హామీ సంతకాన్ని అడుగుతుంటారు. కాబట్టి, హామీ సంతకం చేసేవారు.. ముందుగా అప్పు తీసుకుంటున్న వ్యక్తి గురించి ఆరా తీయాలి. అతను ఎంత దగ్గరి వ్యక్తి అయినా.. ఉన్న ఆస్తులు, ఇతర పెట్టుబడుల గురించి అడిగి తెలుసుకోవాలి. రుణం చెల్లించలేని సందర్భంలో పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం, ఆస్తులను విక్రయించి రుణం తీర్చేయడానికి ఏమైనా ఇబ్బందులున్నాయా తెలుసుకోవాలి. రుణగ్రహీత క్రెడిట్ స్కోరు నివేదికను చూడాలి. దీనివల్ల ఇప్పటికే ఉన్న రుణాలు, వాటిని చెల్లించిన తీరు గురించి మీకు ఒక అవగాహన వస్తుంది. క్రెడిట్ నివేదిక సరిగా లేకపోతే.. మీరు హామీ సంతకం చేయకుండా నిరాకరించండి. ఇక్కడ ఎలాంటి మొహమాటాలకూ పోవద్దు. అతను/ఆమె రుణం తీర్చకపోతే ఆ భారం మీపై పడుతుందని మర్చిపోవద్దు.
మీరే రుణం తీసుకుంటున్నారా?:ఇంటి, వాహన, వ్యక్తిగత రుణాల్లో ఏదో ఒకటి తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నారా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ హామీగా ఉండొద్దు. దీనివల్ల మీ రుణ అర్హతపై ప్రభావం పడుతుంది. 750కి పైగా క్రెడిట్ స్కోరు ఉన్నవారికి బ్యాంకులు ఇప్పుడు ప్రత్యేక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. మీరు హామీగా ఉన్న వ్యక్తి రుణ వాయిదాలు సరిగ్గా చెల్లించకపోతే ఆ ప్రభావం మీ స్కోరుపైనా ఉంటుంది. మీ స్కోరు తగ్గడం వల్ల వడ్డీ రేట్ల తగ్గింపు ప్రయోజనం కోల్పోతారు. అన్ని క్రెడిట్ బ్యూరో సంస్థలూ బ్యాంకులు/ఆర్థిక సంస్థలకు హామీగా ఉన్న వారి వివరాలను అందిస్తాయి.