తెలంగాణ

telangana

ETV Bharat / business

స్విస్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంపు.. రూపాయి భారీగా పతనం.. రెండింటికీ లింకేంటి?

Swiss bank interest rate 2022 : స్విస్ నేషనల్ బ్యాంక్​ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం అంతకంతకూ ఎగబాకుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్లను భారీగా పెంచింది. మరోవైపు.. వేర్వేరు దేశాల కేంద్ర బ్యాంకులు ఇదే తరహాలో వడ్డీ రేట్లు పెంచుతున్న తరుణంలో.. రూపాయి విలువ జీవితకాల కనిష్ఠానికి పతనమైంది.

swiss bank interest rate hike
స్విస్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంపు.. రూపాయి భారీగా పతనం.. రెండింటికీ లింకేంటి?

By

Published : Sep 22, 2022, 2:14 PM IST

Swiss bank interest rate hike : చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో వడ్డీ రేట్లు పెంచింది స్విస్ నేషనల్ బ్యాంక్. ఇప్పటివరకు -0.25శాతంగా ఉన్న వడ్డీ రేటును.. ఏకంగా 0.5శాతంగా మార్చింది. ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది స్విస్ నేషనల్ బ్యాంక్.

అంతకుముందు.. అమెరికన్ ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్లను మరో 75 పాయింట్లు పెంచుతున్నట్లు ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ బుధవారం ప్రకటించారు. దీంతో అక్కడ వడ్డీరేట్లు 3.25 శాతానికి చేరాయి. ఈ సందర్భంగా పావెల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి మున్ముందు రేట్ల పెంపు విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఫలితంగా ఆర్థికమాంద్యం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.

రూపాయిపై ప్రభావం..
Rupee fall today : వేర్వేరు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతున్న నేపథ్యంలో రూపాయి విలువ గురువారం జీవితకాల కనిష్ఠానికి పతనమైంది. స్టాక్‌ మార్కెట్‌ ఒడుదొడుకులు రూపాయిపై ఒత్తిడిని మరింత తీవ్రం చేస్తున్నాయి. ఈరోజు ఓ దశలో దాదాపు 0.95 శాతం మేర నష్టపోయి డాలరుతో పోలిస్తే మారకం విలువ 80.67 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. బుధవారం రూపాయి 22 పైసలు కుంగి 79.96 వద్ద స్థిరపడింది.

Rupee falling reasons : అమెరికాలో వడ్డీరేట్లు పెంపుతో డాలర్‌ బలపడడం, ఈక్విటీ మార్కెట్లలో బలహీనతలు, చమురు ధరలు స్తబ్ధుగా ఉండడం.. రూపాయిపై ప్రభావం చూపుతున్నాయని ఫారెక్స్‌ ట్రేడర్లు చెబుతున్నారు.
సాధారణంగా యూఎస్‌లో వడ్డీరేట్లు పెరిగితే.. దేశీయ మార్కెట్ల నుంచి మదుపర్లు తమ పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటారు. అధిక రాబడి కోసం వాటిని అమెరికాకు తరలిస్తారు. ఫలితంగా డాలర్‌కు డిమాండ్‌ పెరిగి బలపడుతుంది. ఇది రూపాయిపై ఒత్తిడికి దారి తీస్తుంది.

రూపాయి క్షీణత వల్ల లాభనష్టాలు..
రూపాయి క్షీణత వల్ల సామాన్యుడి బతుకు భారమవుతుంది. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. వస్తు సేవలకు అధికంగా చెల్లించాల్సి వస్తుంది. విదేశాల నుంచి దిగుమతయ్యే వంటనూనె, పప్పుదినుసులకూ అధిక ధరలు చెల్లించాలి. అంతర్జాతీయ వ్యాపారం డాలర్లలోనే జరుగుతుంది కాబట్టి, సరఫరా చేసిన దేశానికి వాటిల్లోనే చెల్లించాలి. రూపాయి విలువ క్షీణిస్తే డాలర్ల కోసం ఎక్కువ వెచ్చించాల్సి వస్తుంది. ముడి సరకుల్లో అత్యధిక భాగం దిగుమతి చేసుకునే పరిశ్రమలు కరెన్సీ విలువ క్షీణత వల్ల దెబ్బతింటాయి. ఇతర దేశాలకు విహారయాత్రలకు వెళ్లాలంటే అధికంగా ఖర్చవుతుంది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులపై కూడా భారం పెరుగుతుంది.

తమ వస్తువులను, సేవలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే రంగాలు కరెన్సీ విలువ క్షీణత వల్ల లబ్ధి పొందుతాయి. ముఖ్యంగా భారత ఐటీ, ఫార్మా రంగాలకు ఈ పరిస్థితి వల్ల ప్రయోజనం చేకూరుతుంది. డాలరుకు ఎక్కువ రూపాయలు అందుతాయి కాబట్టి రూపాయి క్షీణత వల్ల ప్రవాస భారతీయ కుటుంబాలు లాభపడతాయి.

ABOUT THE AUTHOR

...view details