ఆర్థిక మాంద్యం భయాలతో ప్రముఖ టెక్ సంస్థలన్నీ తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఉద్యోగాల తొలగింపు తర్వాత కూడా ఖర్చులు తగ్గించుకునేందుకు మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే 12వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపిన ప్రముఖ సెర్చింజన్ గూగుల్... పొదుపు చర్యల్లో భాగంగా మరో చర్యకు ఉపక్రమించింది. ప్రస్తుతం ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాల్లో కోత విధించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్.. ఈ-మెయిల్ ద్వారా ఉద్యోగులకు విషయాన్ని తెలియజేశారు.
గూగుల్ మరో కీలక నిర్ణయం.. ఉద్యోగుల వేతనాల్లో కోత.. వారికి మెయిల్ చేసిన పిచాయ్ - గూగుల్ ఉద్యోగులు లేటెస్ట్ న్యూస్
ఇటీవల భారీగా ఉద్యోగాల కోత విధించిన టెక్ దిగ్గజం గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా ప్రస్తుతం సంస్థలో ఉన్న ఉద్యోగుల వేతనాలకు కోత పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఉద్యోగులకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ-మెయిల్స్ పంపారు.
సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయి పైన ఉన్న వారికి ఈ వేతన కోతలు అధికంగా ఉండనున్నట్లు సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. సీనియర్ హోదాల్లో ఉన్న వారికి కంపెనీ పనితీరుపై ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సంస్థలో పనిచేస్తున్న 6 శాతం అంటే దాదాపు 12 వేలమందిని తొలగిస్తూ గత శుక్రవారం.. సుందర్ పిచాయ్ ఈ-మెయిల్స్ పంపారు. ఈ పరిస్థితులకు పూర్తిగా తానే బాధ్యత వహిస్తున్నట్లు తెలిపారు. గూగుల్ వ్యవస్థాపకులు, డైరెక్టర్లతో సంప్రదించిన తర్వాతే ఉద్యోగ కోతలపై నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. తొలగింపుల తర్వాత సోమవారం సంస్థ అంతర్గత సమావేశంలో ఉద్యోగులతో మాట్లాడారు. ఎవరెవరిని ఉద్యోగాల నుంచి తొలగించాలన్న దానిపై సుందర్ పిచాయ్‌తోపాటు 750 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొన్నట్లు గూగుల్ వర్గాలు తెలిపాయి.