తెలంగాణ

telangana

ETV Bharat / business

రూ.5వేలతో బిజినెస్ షురూ.. ఇప్పుడు టర్నోవర్ రూ.12వేల కోట్లు.. 'సుగుణ చికెన్' కథ ఇదీ.. - suguna poultry farm coimbatore

Suguna Foods Owner : చికెన్ కొనుగోలు చేసే ప్రతిఒక్కరికీ 'సుగుణ' పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి పట్టణంలో సుగుణ పేరుతో చికెన్ షాపులు కనిపిస్తాయి. రూ.5 వేల​తో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుత టర్నోవర్ ఎంతో తెలుసా? ఈ సంస్థ యజమానులు గురించి ఎప్పుడైనా విన్నారా?

suguna chicken owner
suguna chicken owner

By

Published : Aug 3, 2023, 2:54 PM IST

Richest Poultry Farmers In India : ఏ రంగంలోనైనా కష్టపడి పనిచేసే వారికి తిరుగుండదు. వారు అనుకున్న లక్ష్యాన్ని సులభంగా చేరుకుంటారు. ఇబ్బందులు వస్తున్నాయని నిరాశ పడి వెనక్కి తగ్గకుండా లక్ష్యం దిశగా అడుగులు వేస్తే ఏదో ఒకరోజు విజయం సాధిస్తారు. అందుకు ఉదాహరణే బి. సౌందర​రాజన్​, జి.బి. సుందర​రాజన్ అనే అన్నదమ్ములు. ఒకప్పుడు కేవలం రూ.5వేల పెట్టుబడితో పౌల్ట్రీ వ్యాపార ప్రయాణం మొదలుపెట్టి.. ప్రస్తుతం ఏడాదికి రూ.12 వేల కోట్ల టర్నోవర్‌తో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం దేశంలో అతి పెద్ద పాల్ట్రీ వ్యాపారులుగా నిలిచారు. మరి ఈ పౌల్ట్రీ కింగ్స్ ఎవరో తెలుసుకుందామా మరి.

Suguna Chicken Owner Net Worth : సుగుణ ఫుడ్స్ పేరు మనం వినే ఉంటాం. ఇండియాలోని పాల్ట్రీ పరిశ్రమల్లో అగ్రగామి సంస్థగా పేరు పొందింది. 1984లో బి. సౌందరరాజన్, జి.బి. సుందరరాజన్ అనే సోదరులు ఈ సంస్థను ప్రారంభించారు. తొలుత కేవలం రూ.5 వేల పెట్టుబడితో తమిళనాడు.. కోయంబత్తూరు సమీపంలోని ఉడముమలైపేట్టైలో ఈ పరిశ్రమను నెలకొల్పారు. దాదాపు 39 ఏళ్ల తర్వాత రూ.12 వేల కోట్ల వార్షిక టర్నోవర్‌తో భారతదేశంలోనే అతిపెద్ద పాల్ట్రీ వ్యాపారులుగా పేరు తెచ్చుకున్నారు.

40 వేల మంది రైతుల భాగస్వామ్యం
Suguna Chicken Owner Family : ప్రస్తుతం సుగుణ సంస్థ 18 రాష్ట్రాల్లో 40 వేల మంది రైతులతో కలిసి పని చేస్తోంది. బ్రాయిలర్ చికెన్, కోడిగుడ్ల ఉత్పత్తిలో ఈ కంపెనీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం సుగుణ సంస్థకు ఛైర్మన్‌గా సౌందరరాజన్ ఉండగా.. ఆయన కుమారుడు విఘ్నేష్ శివన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

బి. సౌందర్​రాజన్ విజయ ప్రస్థానం..
Soundararajan Suguna Owner : సౌందరరాజన్ తన పాఠశాల విద్య పూర్తి చేసుకున్న తర్వాత వ్యవసాయం వైపు మొగ్గు చూపారు. తన పొలంలో కూరగాయలను పండించారు. అయితే వ్యవసాయంలో పెద్దగా లాభాలు రాకపోవడం వల్ల అది వదిలేసి హైదరాబాద్‌లోని ఓ వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల కంపెనీలో పనిచేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఉద్యోగం మానేసి తన సోదరుడు జీబీ సుందర​రాజన్​తో కలిసి పౌల్ట్రీ వ్యాపారాన్ని ప్రారంభించారు.

కోళ్ల దాణాతో మొదలైన ప్రయాణం
Suguna Poultry Farm Coimbatore : తొలుత కోళ్ల దాణాను రైతులకు విక్రయించే వ్యాపారాన్ని సౌందర​రాజన్​ సోదరులు మొదలుపెట్టారు. ఈ వ్యాపారం వల్ల కోళ్ల పెంపకంలో రైతులకు ఎదురయ్యే సమస్యలపై వీరికి బాగా అవగాహన వచ్చింది. ఆ తర్వాత 1990లో ముగ్గురు రైతుల భాగస్వామ్యంతో తమ కంపెనీని విస్తరించారు. రైతులు కోళ్లను పెంచడానికి అవసరమైన దాణా, ఇతర వసతులన్నీ సమకూర్చేవారు. రైతుల నుంచి డబ్బులకు బదులు పెరిగిన కోళ్లను తీసుకునేవారు.

7 కోట్లకు పెరిగిన టర్నోవర్
సుగుణ సంస్థ ప్రారంభించిన 7 ఏళ్లలోనే 40 మంది రైతులు.. కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో సుగుణ సంస్థ టర్నోవర్ రూ.7 కోట్లకు పెరగడం సహా తమిళనాడులో ఈ కంపెనీ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆరోగ్యకరమైన రీతిలో కోళ్లను పెంచడానికి అవసరమైన నైపుణ్యాన్ని రైతులను సుగుణ సంస్థ అందించింది. కోళ్ల మాంసం, గుడ్లతో పాటు పశుగ్రాసాలను కూడా ఈ సంస్థ ఉత్పత్తి చేస్తుంది. ఎలాంటి విద్యార్హత లేనప్పటికీ తమకు ఎదురైన అనుభవాలు, ఇబ్బందులను ఎదుర్కొని పౌల్ట్రీ పరిశ్రమలో అంచెలంచెలుగా ఎదిగారు సౌందరరాజన్ సోదరులు.

2021లో రూ.358 కోట్ల లాభం
2020వ ఆర్థిక సంవత్సరంలో సుగుణ సంస్థ టర్నోవర్ రూ.8,739 కోట్లు ఉండగా.. 2021కి రూ.9,155 కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సుగుణ సంస్థ టర్నోవర్​ దాదాపు రూ.12 వేల కోట్లుగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details