Retirement F.I.R.E. Method: రిటైర్మెంట్కు వయసుతో పనిలేదు. ఏ వయసులోనైనా సరే.. మిగతా జీవిత అవసరాలకు కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చి పెట్టుకోగలిగితే చాలు. ఎంచక్కా ఉద్యోగం లేదా వ్యాపారం నుంచి విరమణ పొందొచ్చు. ఆ వనరుల నుంచి వచ్చే ఆదాయంతో ఆనందంగా గడిపేయొచ్చు. ఈ క్రమంలో పుట్టుకొచ్చిందే ఫైర్ (F.I.R.E) ఉద్యమం. ఫైర్ అంటే 'ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఎర్లీ'. అంటే త్వరగా ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధిస్తే త్వరగా రిటైర్ అవ్వొచ్చన్నదే దీని ప్రధానోద్దేశం. ఈ వ్యూహాన్ని పక్కాగా అమలు చేయగలిగితే 40 ఏళ్ల వయసొచ్చే సరికి రిటైర్మెంట్ తీసుకోవచ్చు.
ఫైర్‌లోని కీలకాంశాలు..
- మీ ఆదాయంలో 50-70% పొదుపు చేయాలి
- మితంగా ఖర్చు చేస్తూ కఠినమైన ఆర్థిక క్రమశిక్షణను పాటించాలి
- మీ పొదుపును తెలివిగా మదుపు చేయాలి
ఈ మూడే ఫైర్కి ఆధారం. ఎక్కువ పొదుపు చేసి, తక్కువ ఖర్చుపెట్టి, తెలివిగా మదుపు చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. అసలు దీని వెనకున్న గణితమేంటో ఓసారి చూద్దాం..
ఫైర్ వెనకున్న లెక్కలివే..
ఫైర్ (F.I.R.E) వెనకున్న లెక్కల్ని అర్థం చేసుకోవాలంటే.. రెండు ప్రధాన ప్రశ్నలకు సమాధానం కావాల్సి ఉంటుంది. ఒకటి.. రిటైర్ అయిన తర్వాత జీవితాన్ని గడపడానికి మీకు ఎంత మొత్తం కావాలి? రెండోది.. మీరు ఎంత త్వరగా రిటైర్ కావాలనుకుంటున్నారు? రెండో ప్రశ్నకు సమాధానం చాలా సులువు. ముందు మొదటి దానిపై దృష్టి సారిద్దాం..
రిటైర్ అయిన తర్వాత జీవితాన్ని గడపడానికి ఎంత డబ్బు కావాలనేది నెలకు మీరు ఎంత ఖర్చు చేస్తారనేదానిపై ఆధారపడి ఉంటుంది. దీన్ని 4% రూల్ ద్వారా త్వరగా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మీరు రూ.5 కోట్లతో రిటైరయ్యారనుకుందాం! అంటే మీరు ఏడాదికి రూ.20 లక్షల వరకు ఉపయోగించుకోవచ్చు. లేదా 4% అంటే 25 రెట్లని అర్థం. అంటే మీరు ఏటా ఖర్చు చేసే మొత్తానికి 25 రెట్ల ఆదాయంతో రిటైర్ కావాలి. అయితే, మన ఖర్చుల్ని ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేస్తే అది మరింత పెరుగుతంది. అలాగే ఈ సొమ్మును ఏటా 7 శాతం ఆదాయం వచ్చే పెట్టుబడిమార్గాల్లో మదుపు చేయాలి. అప్పుడే మీరు అనుకున్న ఫైర్ (F.I.R.E) ఫలితాలిస్తుంది. మరి ఫైర్‌లోని మూడు అంశాలను ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం..
50-70 శాతం పొదుపు..ప్రతినెలా మీ ఆదాయంలో 50-70% పొదుపు చేయాలి. మనం సాధారణంగా చేసే 15-20 శాతంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అద్దె, ఆహారం, పిల్లల చదువుల ఖర్చు, గృహరుణం.. వంటి కచ్చితమైన ఖర్చులుండేవారికి ఇంతమొత్తం పొదుపు చేయడం కష్టమే. కానీ, కనీసం దీని దరిదాపుల్లోకైనా వస్తే మంచిది. లేదంటే మీ ఆదాయాన్నైనా పెంచుకోవాలి. అందుకోసం సాధారణం కంటే ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. పార్ట్‌టైం జాబ్, మంచి వేతనం కోసం తరచూ కంపెనీలు మారడం, ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాల్ని పుణికిపుచ్చుకొని ఉద్యోగంలో ఉన్నతస్థాయికి వెళ్లడం వంటి అంశాలపై దృష్టి సారించాలి.