Reliance Family Day :ప్రపంచంలోని టాప్ 10 వ్యాపార దిగ్గజ సంస్థల్లో ఒకటిగా రిలయన్స్ ఇండస్ట్రీస్- ఆర్‌ఐఎల్ నిలవాలన్నది తమ లక్ష్యమని సంస్థ ఛైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. ఆ కల నెరవేరేదాకా కంపెనీ గానీ తాను గానీ ఏ దశలోనూ సంతృప్తి చెందమని చెప్పారు. ఈ మేరకు గురువారం రిలయన్స్ ఫ్యామిలీ డే (ధీరూభాయ్ అంబానీ జయంతి) కార్యక్రమంలో గ్రూప్ ఉద్యోగులను ఉద్దేశించి ముకేశ్ అంబానీ ప్రసంగించారు.
"రిలయన్స్ ఇండస్ట్రీస్- ఆర్‌ఐఎల్, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు రిఫైనింగ్ కాంప్లెక్స్‌తో పాటు దేశంలోనే అతిపెద్ద మొబైల్ నెట్‌వర్క్ జియోను కలిగి ఉంది. అయితే ఆర్‌ఐఎల్ గానీ వ్యక్తిగతంగా నేను కానీ ఏ దశలోనూ సంతృప్తి చెంది ఉదాసీనతతో వ్యవహరించే ప్రసక్తే లేదు. ప్రపంచంలోని అగ్రగామి 10 దిగ్గజ వ్యాపార సంస్థల్లో ఒకటిగా ఆర్‌ఐఎల్ నిలవాలన్నది తమ లక్ష్యం. డిజిటల్ డేటా ప్లాట్‌ఫామ్స్, ఏఐ (కృత్రిమ మేధ) వంటి విభాగాల్లో ఇంటర్నేషనల్ కంపెనీల సరసన చేరే ఉద్దేశంతో రిలయన్స్ ఉంది. దేశీయంగా, అంతర్జాతీయంగా వ్యాపార వాతావరణం చాలా వేగంగా మారుతున్న క్రమంలో ఏ దశలోనూ మనం సంతృప్తి చెందకూడదు. వినూత్న ప్రయత్నాలతో మార్కెట్లలో విప్లవాన్ని తీసుకురావడం రిలయన్స్ సంస్థకు అలవాటే"
--ముకేశ్ అంబానీ, ఆర్‌ఐఎల్ ఛైర్మన్
జౌళి తయారీకి నెలకొల్పిన చిన్న ప్లాంటు నుంచి పెట్రోరసాయనాల్లోకి అడుగుపెట్టి, దేశంలోనే అతిపెద్ద తయారీదారుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మారిందని ముకేశ్ అంబానీ తెలిపారు. ఆ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద చమురు రిఫైనింగ్ కాంప్లెక్స్‌గా మారిందన్నారు. ఇక 2005లో రిటైల్ రంగంలో ప్రవేశించి ఇప్పుడు దేశంలోనే అగ్రస్థాయిలో ఉన్నామని ఉద్యోగులనుద్దేశించి అన్నారు.
"2016లో టెలికాం నెట్‌వర్క్ 'జియో'ను ప్రారంభించాం. ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా ఉన్నాం. ఇప్పుడు విద్యుత్ వాహన బ్యాటరీల కోసం గిగా ఫ్యాక్టరీలను నిర్మించే స్థాయికి చేరుకున్నాం. అంతే కాకుండా ఆర్థిక సేవలనూ ప్రారంభించాం. ఎప్పటికప్పుడు సంస్థ ప్రమాణాలను పెంచుకుంటూపోయాం. సరికొత్త రికార్డులను సృష్టించాం"
--ముకేశ్ అంబానీ, ఆర్‌ఐఎల్ ఛైర్మన్