తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐపీఓలో షేర్లు అలాట్‌ కావడం లేదా?.. ఇలా చేస్తే చాలు.. అంతా సెట్! - ఐపీఓ షేర్​ మార్కెటింగ్​

భారత్​లో క్రమక్రమంగా ఐపీఓలకు ఆదరణ పెరుగుతోంది. స్టాక్​ మార్కెట్ల వైపు ఆసక్తి చూపుతున్న మదుపర్లు డీమ్యాట్​ ఖాతాలు తెరుస్తున్నారు. కానీ ఐపీఓలో బిడ్లు దాఖలు చేసిన ప్రతిఒక్కరికీ షేర్లను కేటాయించకపోవడం వల్ల వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీనికి కారణం ఏంటంటే...

reasons for the non allotment of ipo shares
reasons for the non allotment of ipo shares

By

Published : Oct 26, 2022, 12:56 PM IST

భారత్‌లో ఐపీఓలకు ఆదరణ పెరుగుతోంది. స్టాక్‌ మార్కెట్‌పై అవగాహన పెరుగుతున్న కొద్దీ పబ్లిక్‌ ఇష్యూల్లో చిన్న మదుపర్ల భాగస్వామ్యం ఎక్కువవుతోంది. చాలా మంది ఐపీఓలో పాల్గొనేందుకే డీమ్యాట్‌ ఖాతాలు తెరుస్తున్నారు. అయితే, ఐపీఓలో బిడ్లు దాఖలు చేసిన ప్రతిఒక్కరికీ షేర్లను కేటాయించరు. ఇది చాలామందిలో నిరాశను మిగులుస్తుంది. ప్రతిసారీ ఇలాగే జరుగుతున్నట్లయితే.. కచ్చితంగా దానికి కారణం ఏంటో తెలుసుకోవాల్సిందే.

ఐపీఓలో ఎందుకు మదుపు చేస్తారు?
కంపెనీతో సంబంధం లేనివారి నుంచి నిధులు సమీకరించేందుకే సంస్థలకున్న మార్గాల్లో ఐపీఓ ఒకటి. దీంట్లో సామాన్య మదుపర్ల నుంచి సంస్థాగత పెట్టుబడిదారుల వరకు ఎవరైనా పాల్గొనవచ్చు. దీంతో అప్పటి వరకు ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న కంపెనీ పబ్లిక్‌ లిస్టెడ్‌ సంస్థగా మారుతంది. వ్యాపార విస్తరణ, కార్యకలాపాల నిర్వహణకు ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను వినియోగిస్తుంటారు. అందుకే అభివృద్ధి చెందుతున్న కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ఐపీఓ ఓ మార్గం.

షేర్లు కేటాయించకపోవడానికి కారణాలు..

ఓవర్‌ సబ్‌స్క్రిప్షన్‌...
ఓ కంపెనీ ఐపీఓకి వస్తే షేర్ల ధర, ఎన్ని షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు? వంటి వివరాలను వెల్లడిస్తాయి. అర్హతగల సంస్థాగత మదుపర్లు, సంస్థాగతేతర మదుపర్లు, చిన్న మదుపర్లు.. ఇలా మూడు కేటగిరీలకు వేర్వేరుగా షేర్లు కేటాయిస్తారు. ఒక్కో వర్గానికి కొంత మొత్తం షేర్లు రిజర్వు చేసి పెడతారు. అందుకే ఒక్కో కేటగిరీకి ఉన్న షేర్ల కంటే ఎక్కువవాటికి దరఖాస్తులు వస్తే.. అప్పుడు దాన్ని ఓవర్‌సబ్‌స్క్రిప్షన్‌ అంటారు. అలాంటప్పుడు కంప్యూటరైజ్డ్‌ లాటరీ సిస్టమ్‌ ద్వారా షేర్లను కేటాయిస్తారు. అందుబాటులో ఉన్న షేర్ల కంటే అధిక షేర్లకు బిడ్లు అందినందున.. దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరికీ షేర్లను కేటాయించడం కుదరదు.

దరఖాస్తులో తప్పులు..
వచ్చిన ప్రతి దరఖాస్తు పత్రాన్ని రిజిస్ట్రార్‌ క్షుణ్నంగా పరిశీలిస్తారు. అసంపూర్ణంగా ఉన్నా.. ఏమైనా తప్పుడు సమాచారం ఇచ్చినా దరఖాస్తును తిరస్కరించారు.

తక్కువ బిడ్‌ ధర..
ఐపీఓ ధరల శ్రేణి కంటే తక్కువకు బిడ్‌ చేసినట్లయితే షేర్లను కేటాయించరు. అలాగే ఎక్కువ మంది పేర్కొన్న గరిష్ఠ ధరనే షేర్ల అలాట్‌కు ఆధారంగా తీసుకుంటారు. దాని కంటే తక్కువ ధరను కోట్‌ చేసినవారికి షేర్లను కేటాయించరు. సాధారణంగా చాలా మంది ఐపీఓ గరిష్ఠ ధర వద్దే బిడ్లను దాఖలు చేస్తుంటారు.

షేర్ల కేటాయింపు అవకాశాన్ని మెరుగుపర్చుకోండిలా..

  • దరఖాస్తు సరిగ్గా: బిడ్లు దాఖలు చేసే సమయంలోనే దరఖాస్తు ఫారాన్ని ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాలి. ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి.
  • పెద్ద దరఖాస్తులు వద్దు: చాలా మంది ఎక్కువ మొత్తం షేర్లకు బిడ్లు దాఖలు చేయడం వల్ల అలాట్‌కు అవకాశం మెరుగవుతుందని భావిస్తారు. కానీ, అది నిజం కాదు. అన్ని దరఖాస్తులను ఒకే తరహాలో పరిగణించాలని సెబీ స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.
  • వివిధ డీమ్యాట్‌ల ద్వారా:ఒకే డీమ్యాట్‌ ద్వారా ఎక్కువ మొత్తం షేర్లకు దరఖాస్తు చేసుకోవడానికి బదులు.. పలు డీమ్యాట్‌ ఖాతాల ద్వారా బిడ్లు దాఖలు చేయడం మేలు. అప్పుడు ఏదో ఒకదానికి షేర్లు అలాట్‌ అయ్యే అవకాశం ఉంటుంది.
  • చివరి నిమిషంలో వద్దు: చివరి నిమిషంలో హడావుడిగా దరఖాస్తు చేస్తే తప్పులు దొర్లే అవకాశం ఉంది. అందుకే ఐపీఓలో పాల్గొనాలని నిర్ణయించుకున్న తర్వాత సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభమైన రోజే దరఖాస్తు చేసుకుంటే మేలు.
  • మాతృసంస్థ షేర్లు ఉంటే మేలు: ఏదైనా సంస్థ ఐపీఓకి దరఖాస్తు చేసుకుంటున్నారంటే.. దాని మాతృసంస్థ షేర్లు ముందే మీ ఖాతాలో ఉండేలా చూసుకోండి. అలాంటప్పుడు వాటాదారుల కేటగిరీ కింద షేర్లు కేటాయించే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఏదైనా ఐపీఓకి దరఖాస్తు చేసుకునే ముందు ఆ కంపెనీ గురించి పూర్తిగా అధ్యయనం చేయాలి. సెబీకి సమర్పించిన ముసాయిదా పత్రాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. దాన్ని పూర్తిగా పరిశీలించాలి. లేదంటే ఆర్థిక నిపుణులు సాయం తీసుకోవడం మేలు.

ఇదీ చదవండి:ప్లే స్టోర్​లో గూగుల్​ 'మాయ'.. రూ.936కోట్లు ఫైన్ వేసిన భారత్

మానసిక రుగ్మతలకూ బీమా.. మినహాయింపులు లేకుండానే పరిహారం!

ABOUT THE AUTHOR

...view details