RBI interest rate 2022: నిత్యావసరాల ధరలు ఆకాశాన్నటుతూ.. ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతున్న ఈ సమయంలో సామాన్యులకు రిజర్వ్ బ్యాంక్ మరో షాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గత నెలలో రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచి 4.40 శాతానికి చేర్చిన ఆర్‌బీఐ.. మరోసారి వడ్డీ రేట్లను పెంచనున్నట్లు తెలుస్తోంది. సోమవారం ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం ప్రారంభంకాగా.. గవర్నర్ శక్తికాంత దాస్ వడ్డీరేట్లపై బుధవారం ప్రకటన చేయనున్నారు.
2020 మే 22న చివరిసారిగా వడ్డీ రేట్లలో మార్పులు చేసిన ఆర్‌బీఐ.. గత నెలలో ద్రవ్యపరపతి విధాన సమీక్ష లేకుండానే వడ్డీ రేట్లను పెంచింది. దీంతో అనేక బ్యాంకులు కీలకమైన వడ్డీ రేట్లలో మార్పులు చేశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏకంగా నెల రోజుల వ్యవధిలోనే మూడు సార్లు వడ్డీ రేట్లను పెంచింది. ఈ చర్యలతో సామాన్యుల జీవితాలతో పాటు ప్రతి రంగం పైన ప్రభావం పడుతోంది.
ఏడాది చివరకు 5.75 శాతానికి: 'ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని, రానున్న రోజుల్లో వడ్డీ రేట్లు పెంచేందుకు అవకాశం ఉంది' అని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గత సమావేశంలో పేర్కొన్నారు. దీంతో వడ్డీ రేట్ల పెంపు అనివార్యమనేది స్పష్టమవుతోంది. ఈసారి సమీక్షలో మరో 35-40 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉన్నట్లు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి వడ్డీరేటు 5.75 శాతానికి చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతోందని.. ఫలితంగా వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు.
రెండేళ్లుగా స్థిరంగా ఉన్న వడ్డీ రేట్లు ఇప్పుడు క్రమంగా పెరుగుతున్నాయి. ఫలితంగా రుణాలకు సంబంధించి నెలవారీ కిస్తీ (ఈఎంఐ) మొత్తం పెరుగుతోంది లేదా రుణం చెల్లించాల్సిన కాలం అధికమవుతోంది. దీంతో సామాన్యులకు బ్యాంకు రుణాలు, ఈఎంఐలు మరింత భారం కానున్నాయి. రెపో రేటు మరింత పెరిగే అవకాశం ఉందని మధ్యంతర సమీక్షలో ఆర్‌బీఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి జరుగుతున్న ద్రవ్య పరపతి విధాన సమీక్షపై అందరి దృష్టి నెలకొని ఉంది.