RBI MASTER CARD: మాస్టర్ కార్డ్ వ్యాపార పరిమితులపై విధించిన ఆంక్షలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎత్తివేసింది. పేమెంట్స్‌కు సంబంధించిన డేటాను భద్రపరచడంలో విఫలమైన కారణంగా గతేడాది జులై 14న విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ఆర్‌బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. "డేటా స్టోరేజీ నిబంధనలు పాటించని కారణంగా మాస్టర్ కార్డ్‌పై గతేడాది విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నాం. మాస్టర్ కార్డ్ వివరణ సంతృప్తికరంగా అనిపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇకపై తన డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ నెట్‌వర్క్‌లోకి కొత్త వినియోగదారులను చేర్చుకోవచ్చు" అని ఆర్‌బీఐ తన ప్రకటనలో పేర్కొంది.
కాగా.. పేమెంట్స్‌కు సంబంధించిన డేటాను దేశీయంగానే భద్రపరచాలని 2018 ఏప్రిల్ 6న ఆర్‌బీఐ ఆదేశించింది. ఇందుకోసం ఆరు నెలల గడువు ఇచ్చింది. గడువు పూర్తైనా నిబంధనలు పాటించడంలో మాస్టర్ కార్డ్ విఫలమయ్యింది. దీంతో పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం 2007 (పీఎస్‌ఎస్ చట్టం) ప్రకారం ఆర్‌బీఐ చర్యలు తీసుకుంది. దీంతో కొత్త కార్డులు జారీ చేయకుండా నిషేధం విధించింది. తాజాగా ఈ నిబంధనలు ఎత్తివేస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించడంతో వినియోగదారుల కోసం మాస్టర్ కార్డ్ త్వరలో కొత్త కార్డులను జారీ చేయనుంది.