RBI Hikes UPI Transaction Limit :దేశంలో ఆస్పత్రులు, విద్యా సంస్థలకు యూపీఐ చెల్లింపుల పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- ఆర్‌బీఐ. రికరింగ్ చెల్లింపుల ఇ-మ్యాండేట్ పరిమితిని రూ.15 వేల నుంచి రూ.1 లక్షకు పెంచాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.
బుధవారం ప్రారంభమైన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా యూపీఐ లావాదేవీల పరిమితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఆస్పత్రులు, విద్యా సంస్థలకు యూపీఐ చెల్లింపుల పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచినట్లు చెప్పారు. ఈ నిర్ణయం విద్యాసంస్థలు, ఆరోగ్య పరమైన ఖర్చులకు ఆధిక మొత్తంలో చెల్లింపులు చేసేవారికి ఉపయోగపడుతుందని వివరించారు.
రికరింగ్ చెల్లింపుల కోసం ఇచ్చే ఇ-మ్యాండేట్ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.15 వేల నుంచి తాజాగా ఆర్‌బీఐ రూ.1 లక్షకు పెంచింది. ఇప్పటి వరకు ఆటో డెబిట్ లావాదేవీ విలువ రూ.15 వేలు దాటినట్లయితే అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ కింద కస్టమర్లు ప్రత్యేకంగా అనుమతి ఇవ్వాలి. తాజా నిర్ణయంతో రూ.1 లక్ష వరకు ఎలాంటి అదనపు అథెంటికేషన్ అవసరం లేదు. ఫలితంగా క్రమం తప్పకుండా చేసే మ్యూచువల్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్, బీమా ప్రీమియం, క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులకు ప్రత్యేకంగా అనుమతి ఇవ్వాల్సిన పని ఉండదు.
ఫిన్‌టెక్ రంగానికి మరింత సహకారం అందించడం కోసం ‘ఫిన్‌టెక్ రిపాజిటరీ’ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ రంగంలోని అభివృద్ధిని పర్యవేక్షించేందుకు ఇది ఉపయుక్తంగా ఉంటుందని తెలిపింది. 2024 ఏప్రిల్ లేదా అంతకంటే ముందే దీన్ని ఆర్‌బీఐ ఇన్నోవేషన్ హబ్ అందుబాటులోకి తీసుకొస్తుందని పేర్కొంది. ఈ రిపాజిటరీకి అవసరమైన సమాచారాన్ని స్వచ్ఛందంగా ఇచ్చేలా ఫిన్‌టెక్‌లను ప్రోత్సహిస్తామని చెప్పింది. దేశంలోని బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు ఫిన్‌టెక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.