తెలంగాణ

telangana

ETV Bharat / business

రుణగ్రహీతలను వేధించొద్దు.. రికవరీ ఏజెంట్లపై కొరడా.. ఆర్​బీఐ కొత్త రూల్స్! - ఆర్​బీఐ రికవరీ ఏజెంట్ రూల్స్

RBI loan recovery rules: రుణ వసూళ్ల విషయంలో రికవరీ ఏజెంట్ల దారుణాలను అరికట్టేందుకు ఆర్‌బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. రికవరీ ఏజెంట్లను నియంత్రించాలని స్పష్టం చేసింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల లోపే రుణ రికవరీ ఏజెంట్లు, రుణగ్రహీతలకు ఫోన్‌ చేయాలని పేర్కొంది.

BUSINESS LOAN
BUSINESS LOAN

By

Published : Aug 13, 2022, 6:31 AM IST

RBI loan recovery rules: రుణ వసూలులో రికవరీ ఏజెంట్లు చేస్తున్న దారుణాలను అరికట్టేందుకు ఆర్‌బీఐ మరిన్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. శుక్రవారం విడుదల చేసిన తాజా నోటిఫికేషన్‌లో 'షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ)' ఈ నిబంధనలను తమ రుణ రికవరీ ఏజెంట్లు కచ్చితంగా పాటించేలా చూడాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల లోపే రుణ రికవరీ ఏజెంట్లు, రుణగ్రహీతలకు ఫోన్‌ చేయాలని పేర్కొంది. అర్ధరాత్రిళ్లు, వేకువజామున కూడా ఏజెంట్లు వేధిస్తున్నారని ఫిర్యాదులు అధికమైన నేపథ్యంలో, ఈ ఆదేశాలిచ్చింది.

RBI guidelines for loan recovery agents
మాటలు, చేతలు జాగ్రత్త:'రికవరీ ఏజెంట్లు రుణ వసూలులో భాగంగా మాటల రూపంలో అయినా, భౌతికంగా అయినా రుణగ్రహీతలను ఎట్టి పరిస్థితుల్లోనూ వేధించకూడదు. ఈ విషయాన్ని బ్యాంకులు తమ ఏజెంట్లకు స్పష్టంగా తెలియజేయాలి. రుణగ్రహీతల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే ఎలాంటి చర్యలకూ పాల్పడకూడదు. అప్పు తీసుకున్న వ్యక్తి కుటుంబ సభ్యులకూ, రిఫరెన్సుగా పేర్కొన్న వారికీ, స్నేహితులకు మొబైల్‌ లేదా సామాజిక వేదికల ద్వారా సందేశాలు పంపించకూడదు. వారిని భయపెట్టేందుకు ప్రయత్నించకూడదు. రుణగ్రహీత గురించి ఎలాంటి తప్పుడు ఆరోపణలు చేయొద్దు' అని ఆర్‌బీఐ తాజా నోటిఫికేషన్‌లో ఆదేశించింది.

బ్యాంకులు, ఆర్థిక సంస్థలదే బాధ్యత: రుణ రికవరీ విధులను ఔట్‌సోర్సింగ్‌ ద్వారా వేరే సంస్థలకు ఇచ్చినా, సంబంధిత రికవరీ ఏజెంట్ల చర్యలకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆర్‌బీఐ హెచ్చరించింది. శుక్రవారం జారీ చేసిన మార్గదర్శకాలు.. అన్ని వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, గృహరుణ సంస్థలు, కో-ఆపరేటివ్‌ బ్యాంకులు, అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీలకూ వర్తిస్తుందని స్పష్టం చేసింది. సూక్ష్మ రుణాలకు ఈ సర్క్యులర్‌ వర్తించదని తెలిపింది.

రుణ యాప్‌ల కేసులో రూ.370 కోట్ల జప్తు: ఈడీ
చైనాకు చెందిన ఇద్దరు వ్యక్తులు బెంగళూరులో ఏర్పాటు చేసిన డొల్ల(షెల్‌) కంపెనీకి చెందిన రూ.370 కోట్ల విలువైన బ్యాంకు డిపాజిట్లు, క్రిప్టో ఆస్తులు, తదితరాలను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తెలిపింది. యెల్లో ట్యూన్‌ టెన్నాలజీస్‌ ప్రాంగణాలలో ఆగస్టు 8 నుంచి 3 రోజుల పాటు సోదాలు నిర్వహించాక వీటిని జప్తు చేసింది. కొన్ని మోసపూరిత స్మార్ట్‌ఫోన్‌ ఆధారిత రుణ యాప్‌లపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఈ చర్యలు తీసుకుంది.

ఈ యాప్‌లకు చైనా సంస్థల నుంచి నిధుల మద్దతు ఉందని.. ఇవి మన దేశంలో కార్యాలయాలు మూసివేశాక, తమ లాభాలను విదేశాలకు మళ్లించాయని ఈడీ ఆరోపించింది. 'ప్రాథమిక దర్యాప్తు అనంతరం 23 కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు, వాటి ఫిన్‌టెక్‌ కంపెనీలు) కలిసి యెల్లో ట్యూన్‌ టెక్నాలజీస్‌కి చెందిన వాలెట్లలో డిపాజిట్‌ చేసిన రూ.370 కోట్లను కనుగొన్నట్లు' శుక్రవారం ఈడీ పేర్కొంది. 'క్రిప్టో కరెన్సీని గుర్తు తెలియని పలు విదేశీ వాలెట్లకు బదిలీ చేశారు. అయితే కంపెనీ ప్రమోటర్లు ఎవరో తెలియడం లేదు. ఈ షెల్‌ కంపెనీని చైనా దేశీయులైన అలెక్స్‌, కైదీ ఏర్పాటు చేశారని పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details