Quick Bank loan : జీవిత పోరాటంలో అనేక ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. అవసరమైన సమయానికి చేతిలో డబ్బు లేకపోవడం.. చాలా కష్టంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయాల్సి వస్తుంది. కొన్ని సార్లు జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు రుణం చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు ఇల్లు కట్టుకోవడం, కొత్త కారు కొనడం లాంటివి. ఇలాంటి సమయాల్లో సాధారణంగా ప్రజలు తమ అవసరాల కోసం ప్రైవేట్ వ్యక్తుల నుంచి అధిక వడ్డీలకు రుణాలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇది మిమ్మల్ని ఆర్థికంగా బాధిస్తుంది. దీనికి బదులుగా మీరు బ్యాంకు లోన్ కోసం ప్రయత్నించడం ఉత్తమం.
త్వరగా రుణం పొందడం ఎలా?
బ్యాంకు లోన్లు రావడం చాలా కష్టమని చాలా మంది అనుకుంటూ ఉంటారు. దానిలో కొంత వరకు వాస్తవం కూడా ఉంది. కానీ సరైన విధానంలో అప్లై చేస్తే.. కచ్చితంగా బ్యాంకు రుణాలు పొందే అవకాశం ఉంది.
ఖర్చులు అదుపులో ఉంచుకోండి!
మీరు రుణం తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు.. తిరిగి చెల్లించే సామర్థ్యం గురించి కూడా స్పష్టంగా ఒక అంచనాకు రావాలి. ప్రస్తుతం మీకు వస్తున్న ఆదాయం, నిత్యవసరాల ఖర్చులు, రుణ వాయిదాల చెల్లింపులు అన్నీ చూసుకోవాలి. సాధారణంగా నికర ఆదాయంలో ఖర్చులు 40 నుంచి 50 శాతం వరకు ఉంటాయి. ఇలా ఉన్నవారికే సాధారణంగా బ్యాంకులు రుణాలు మంజూరు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రుణం కోసం దరఖాస్తు చేసే ముందు.. మీ ఖర్చులు 40 శాతానికి మించకుండా చూసుకోవాలి.
క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోండి!
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సాధారణంగా లోన్ అప్లికేషన్స్ పరిశీలించేటప్పుడు.. రుణ గ్రహీతకు సంబంధించిన క్రెడిట్ స్కోర్ నివేదిక కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాయి. ఎందుకంటే ఈ క్రెడిట్ రిపోర్టులో.. క్రెడిట్ స్కోర్, రుణం తిరిగి చెల్లింపు చరిత్ర, ఇప్పటికే కొనసాగుతున్న రుణ ఖాతాలు, పొదుపు ఖాతాల గురించిన పూర్తి సమాచారం ఉంటుంది. అందువల్ల లోన్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు.. సొంతంగా మన క్రెడిట్ స్కోర్‌ను మనమే చూసుకోవాలి.
ఇటీవలి కాలంలో చాలా సంస్థలు నెలవారీ క్రెడిట్ రిపోర్టులను ఉచితంగానే అందిస్తున్నాయి. అయితే ఎలాంటి క్రెడిట్ హిస్టరీ లేనివారు మాత్రం క్రెడిట్ కార్డ్‌ను తీసుకోవడం ద్వారా దాన్ని నిర్మించుకోవచ్చు. కనీసం రెండు నుంచి మూడేళ్ల పాటు మీరు క్రెడిట్ కార్డు బిల్లులు సక్రమంగా చెల్లిస్తే, మీరు మంచి క్రెడిట్ స్కోర్ సాధించడానికి వీలవుతుంది.