తెలంగాణ

telangana

ETV Bharat / business

హెల్త్​ పాలసీ తీసుకుంటున్నారా? అయితే ఇవి తప్పనిసరిగా పాటించండి - ఔట్​ పేషం

Health Insurance Policy: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి, చికిత్స తీసుకుంటేనే ఆరోగ్య బీమా పాలసీలు పరిహారం ఇచ్చేవి. మారిన వైద్య విధానంతో ఇప్పుడు ఎన్నో చికిత్సలు ఆసుపత్రిలో చేరకుండానే పూర్తవుతున్నాయి. దీంతో ఈ పాలసీలను ఎంచుకునేటప్పుడు ఔట్‌ పేషెంట్‌ డిపార్ట్‌మెంట్‌ (ఓపీడీ) చికిత్సలకూ వర్తిస్తుందా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది.

Health Insurance Policy
Health Insurance Policy

By

Published : Apr 11, 2022, 5:34 AM IST

Health Insurance Policy: ఓపీడీ ఖర్చులను భరించే పాలసీలను తీసుకోవడం వల్ల పాలసీదారులకు కష్టకాలంలో ఆర్థికంగా ఎంతో వెసులుబాటు లభిస్తుంది. ఆసుపత్రిలో చేరకుండానే వైద్య నిపుణుల నుంచి పొందిన సేవలకు అయ్యే ఖర్చులను పాలసీ భరిస్తుంది. ఇందులోనూ నగదు రహిత ఓపీడీ సేవలను అందించే పాలసీలను ఎంచుకోవడం ఉత్తమం. తీవ్ర వ్యాధులున్నవారు. ఆస్తమా, మధుమేహం, ఆర్థరైటిస్‌, థైరాయిడ్‌ సమస్యలున్నవారు తాము తీసుకున్న పాలసీలో తప్పనిసరిగా రోజువారీ చికిత్సలకూ పరిహారం అందించేలా ఉండాలి. చికిత్సతోపాటు, ఔషధ ఖర్చులనూ చెల్లించాలి.

వైద్యులను సంప్రదించినప్పుడు.. సాధారణ ఆరోగ్య బీమా పాలసీ చిన్న జబ్బులకు డాక్టర్‌ను సంప్రదిస్తే పరిహారం ఇవ్వదు. జ్వరం, జలుబు, దద్దుర్లు, దంత సమస్యలు, కంటి చూపు పరీక్ష తదితరాలకు క్లెయిం చేసుకోలేం. కానీ, ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకునేటప్పుడు 100 శాతం కవరేజీ వచ్చే పాలసీలను తీసుకున్నప్పుడు పాలసీదారులు ఇలాంటి చికిత్సలకూ పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంట్లో చిన్న పిల్లలు లేదా పెద్దలు ఉన్నప్పుడు ఈ తరహా పాలసీలు ఎంతో ఖర్చును ఆదా చేస్తాయి. దీంతోపాటు వార్షిక వైద్య పరీక్షలకు అవకాశంలాంటి అదనపు ప్రయోజనాలనూ అందిస్తాయి. ఈ ముందస్తు పరీక్షల దీనివల్ల ఏదైనా వ్యాధి వచ్చే ప్రమాదాల్ని ముందే గుర్తించేందుకు వీలవుతుంది.

ఔషధాలకూ... ఓపీడీ కవర్‌ ఉన్న పాలసీలను ఎంచుకున్నప్పుడు.. వైద్యులు సూచించిన ఔషధాలకయ్యే ఖర్చునూ తిరిగి పొందవచ్చు. సాధారణ ఆరోగ్య బీమా పాలసీలు ఇలా రోజువారీ చికిత్సల సమయంలో మందుల ఖర్చును అంగీకరించవు. వ్యాధిని గుర్తించే దశలో భాగంగా చేయించుకునే రక్త పరీక్షలు, సీటీ స్కానింగ్‌, ఎక్స్‌-రే, సోనోగ్రఫీ, ఎంఆర్‌ఐలాంటి వాటికి అయ్యే ఖర్చును ఓపీడీ నిబంధనల మేరకు తిరిగి పొందవచ్చు. వ్యాధిని గుర్తించారా లేదా అనేదానితో దీనికి సంబంధం లేదు. వైద్యులు ఈ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారా లేదా అనేదే ఇక్కడ ప్రధానం. పాలసీలో ఎంత మేరకు ఈ ఖర్చులు చెల్లించాలనేది ముందుగానే నిర్ణయిస్తారు. దాన్ని బట్టే పరిహారం అందుతుంది. ఓపీడీ రక్షణ అందించే పాలసీలను ఎంచుకునేటప్పుడు తగిన మొత్తానికి బీమా విలువ ఉండేలా చూసుకోవాలి. వేచి ఉండే వ్యవధి వీలైనంత తక్కువగా ఉండాలి. ఇప్పటికే ఆరోగ్య బీమా పాలసీ ఉన్నవారు.. అది రోజువారీ చికిత్సలకు వర్తిస్తుందా లేదా అనేది సమీక్షించుకోండి. కొత్తగా తీసుకునేవారు పాలసీ క్లెయిం చెల్లింపుల చరిత్ర అధికంగా ఉన్న సంస్థలను ఎంచుకోవడం ఉత్తమం.

ఇదీ చదవండి: బీమా పాలసీ తీసుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి

ABOUT THE AUTHOR

...view details