తెలంగాణ

telangana

ETV Bharat / business

ఇలా చేస్తే ఉద్యోగం వీడాల్సి వచ్చినా ఆర్థికంగా సేఫ్​! - What precautions should taken regarding money

ఉద్యోగాల్లో కోత.. ఇటీవలి కాలంలో మనం అధికంగా వింటున్న వార్త ఇది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొంటుందన్న అంచనాల నేపథ్యంలో అందరిలోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఎవరైనా ఉద్యోగం మానేయాల్సి వస్తే ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకోవాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం.

precautions-to-taken-when-quitting-job
ఉద్యోగం మానేసినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు

By

Published : Jan 27, 2023, 6:07 PM IST

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొంటుందన్న అంచనాల నేపథ్యంలో అందరిలోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది. పలు సంస్థలు ఉద్యోగాల్లో కోతలకు పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగం మానేయాల్సి వచ్చినప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
క్రమంగా ఆదాయం వస్తున్నప్పుడు అన్నీ అనుకున్నట్లుగానే సాగిపోతుంటాయి. కానీ, ఒక్కసారిగా అది ఆగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు గందరగోళ పరిస్థితి ఎదురవుతుంది. ఏం చేయాలో తెలియక ఆందోళన చెందడం సహజమే. ఇలాంటి అనుకోని సంఘటనలు ఎదురవ్వాలని ఎవరూ అనుకోరు. కానీ, పరిస్థితులు ఇలాంటి తప్పనిసరి పరిస్థితులను సృష్టిస్తే ఏం చేయాలి అనే ఆలోచన కన్నా ముందు నుంచే సిద్ధంగా ఉండటం మంచిది.

ఆదాయం అందేలా..
ఉద్యోగం నుంచి తీసేసినా కొన్ని సంస్థలు రెండు నుంచి మూడు నెలల వేతనం ఇస్తున్న సంస్థలూ ఉన్నాయి. మీరు ఆర్థికంగా కాస్త కుదురుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీనికి తోడుగా మన దగ్గర కనీసం ఆరు నెలల అత్యవసర నిధి ఉండాలి. ఇందులో నుంచి నెలనెలా వేతనంలాగానే కొంత మొత్తం తీస్తుండాలి. ఒకేసారి మొత్తం డబ్బును వెనక్కి తీసుకోవద్దు. ఆదాయం వస్తున్నప్పడే ఆరు నెలల అత్యవసర నిధి జమయ్యే దాకా జీతంలో నుంచి 25 శాతం మళ్లించాలి. దీన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసుకోవచ్చు. కష్టకాలంలో ఈ డిపాజిటే కాపాడుతుంది.

కొత్త అప్పులు వద్దు..
ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకూ మీ దగ్గర ఉన్న డబ్బునే ఖర్చు చేయండి. ఒకవేళ మీరు పనిచేస్తున్న సంస్థ/రంగంలో ఉద్యోగాల కోత ప్రారంభం అయ్యింది అనిపిస్తే.. క్రెడిట్‌ కార్డులవంటి వాటిని ఉపయోగించడం మానేయండి. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి. వీలైనంత వరకూ పొదుపు చేసేందుకు ప్రయత్నించండి. క్రెడిట్‌ కార్డుకు దూరంగా ఉండండి. ఆదాయం లేనప్పుడు కార్డు బిల్లులను సకాలంలో చెల్లించలేక పోవచ్చు. ఇది మీ రుణ చరిత్రపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా వ్యక్తిగత రుణాలు, వాహన రుణం టాపప్‌ లాంటివి తీసుకోవద్దు. ఈఎంఐ చెల్లించడం కష్టం కావచ్చు.

విచక్షణతో..
పొదుపు చేయాలంటే వృథా వ్యయాలు తగ్గాలి. కొన్నింటికి ప్రత్యామ్నాయాలు తప్పకుండా ఉంటాయి. వీటిని ఉపయోగించుకునేందుకు చూడాలి. ఖరీదైన వస్తువులు, భోజనాలకు దూరంగా ఉండటం మంచిది. కొన్ని కోరికలనూ వదిలిపెట్టాలి. దీనివల్ల మిగులు మొత్తం మరింత పెరుగుతుందని గుర్తుంచుకోండి.

ధీమాగా ఉండేలా..
యాజమాన్యం అందించే బృంద ఆరోగ్య బీమా రక్షణలో ఉన్నవారు ఆలస్యం చేయకుండా సొంతంగా ఒక పాలసీ తీసుకోవాలి. ఉద్యోగం మానేసినప్పుడు బృంద బీమా రక్షణ దూరం అవుతుందని మర్చిపోవద్దు. ఉద్యోగం లేని కాలంలో ఏదైనా అనుకోని అనారోగ్యం బారిన పడితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పొదుపు మొత్తం చికిత్స కోసం కేటాయించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి, ఈ విషయంలో ఆలస్యం చేయొద్దు. కుటుంబానికి అంతటికీ వర్తించేలా కనీసం రూ.5 లక్షల ఆరోగ్య బీమా తప్పనిసరి.

వెనక్కి తీసుకోవద్దు..
ఆదాయం కోల్పోయినప్పుడు చాలామంది ఒకేసారి మొత్తం పెట్టుబడులను వెనక్కి తీసుకుంటారు. ఇది మంచిది కాదు. ముందుగా అత్యవసర నిధిని ఉపయోగించుకోవాలి. ఆదాయం లేదు అన్న సంగతిని మర్చిపోకుండా ఖర్చు చేయాలి. తప్పదు అనుకున్నప్పుడే భవిష్య నిధి, ఈక్విటీల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకోండి.

ABOUT THE AUTHOR

...view details