PPF Deposit Date for Full Month Interest: ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్).. పెట్టుబడి, రాబడికి ప్రభుత్వ హామీ ఉండే.. ఈ పథకం ఎంతోమందిని ఆకర్షిస్తుంది. దీర్ఘకాలిక లక్ష్యాల సాధనలో ఇది ఎంతో కీలకం. ఒకేసారి లేదా నెలనెలా ఇందులో జమ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. ఈ ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1,50,000 వరకూ జమ చేసేందుకు అవకాశం ఉంది. పెట్టిన మొత్తానికి సెక్షన్ 80సీ నిబంధనల మేరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ పథకం వ్యవధి 15 ఏళ్లు. ఆ తర్వాత అయిదేళ్ల చొప్పున రెండుసార్లు పొడిగించుకునే వీలూ ఉంది. అంటే మొత్తం 25 ఏళ్ల పాటు పెట్టుబడిని కొనసాగించవచ్చు. వచ్చిన వడ్డీపై ఎలాంటి పన్ను భారం ఉండదు.
ఇన్ని ప్రయోజనాలున్న ఈ ఖాతాలో చాలామంది ఆర్థిక సంవత్సరం చివరకు వచ్చాక.. పన్ను మినహాయింపు కోసం మదుపు చేస్తుండటం చూస్తూనే ఉంటాం. కానీ, ఇది సరైన పద్ధతి కాదు. ఒకేసారి పీపీఎఫ్ ఖాతాలో జమ చేయాలనుకున్న వారు.. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే అంటే.. ఏప్రిల్ 1 నుంచి 4 మధ్య పెట్టుబడి పెట్టాలి. నెలనెలా జమ చేసేవారూ 5వ తేదీకి ముందే ఆ పని పూర్తి చేయాలి.