Pet Insurance Benefits : మనలో చాలా మంది కుక్క, పిల్లి లాంటి పెంపుడు జంతువులను పెంచుకుంటూ ఉంటారు. వాటితో ఆడుకుంటా చాలా ఆనందంగా గడుపుతారు. అవి లేకుండా జీవించలేని పరిస్థితికి చేరుకుంటారు. ఒక వేళ వాటికి ఏమైనా అయితే, ఇక తట్టుకోవడం వారి వల్ల కాదు. అందుకే ఇలాంటి వారి కోసం పలు బీమా సంస్థలు 'పెట్ ఇన్సూరెన్స్'ను అందుబాటులోకి తెచ్చాయి.
పెట్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
కుక్క, పిల్లి లాంటి పెంపుడు జంతువుల ఆరోగ్యం, సంక్షేమం కోసం ఏర్పాటు చేసినవే పెట్ ఇన్సూరెన్స్ పాలసీలు. మనం హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకుంటామో, అలానే మనం పెంచుకునే జంతువుల కోసం కూడా ఈ పెట్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవచ్చు.
ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే!
నేటి కాలంలో పెంపుడు జంతువులను పెంచడం చాలా ఖర్చులతో కూడుకున్న వ్యవహారంగా మారింది. వ్యాక్సినేషన్, ట్రీట్మెంట్, గ్రూమింగ్ లాంటి వాటికి ఏడాదికి ఎంత లేదనుకున్నా రూ.10,000 నుంచి రూ.1 లక్ష వరకు ఖర్చు అవుతుంది. వీటితోపాటు వెట్ ఫీజు, వైద్య ఖర్చులు కలుపుకుంటే, ఆర్థిక భారం మరింత పెరుగుతుంది. అందుకే మన పెంపుడు కుక్కలకు అనుకోకుండా ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు లేదా యాక్సిడెంట్ జరిగినప్పుడు, అత్యుత్తమ వైద్యాన్ని అందించడానికి పెట్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎంతైనా అవసరం.
పెట్ ఇన్సూరెన్స్ ఉపయోగాలు
Benefits Of Pet Insurance :
- మన పెంపుడు జంతువుల కోసం ఇన్సూరెన్స్పాలసీ తీసుకోవడం వల్ల, వాటికి అయ్యే వైద్య, చికిత్స ఖర్చులు లభిస్తాయి.
- చిన్న మొత్తంలో ప్రీమియం కడితే చాలు, మీ పెంపుడు జంతువులకు ప్రమాదం జరిగినా, మరణించినా, లేక ఎవరైనా దొంగిలించినా మీకు పరిహారం లభిస్తుంది.
- పెట్ ఇన్సూరెన్స్ అనేది థర్డ్ పార్టీ డ్యామేజీలకు కూడా పరిహారం అందిస్తుంది.
- పెంపుడు జంతువులను ఇతర దేశాలకు తీసుకువెళ్లేటప్పుడు జరిగిన నష్టానికి కూడా బీమా సంస్థలు పరిహారం అందిస్తాయి.
పెట్ ఇన్సూరెన్స్ రకాలు
Types Of Pet Insurance Policies : మన దేశంలోని బీమా సంస్థలు పశువుల బీమాను ఎప్పటి నుంచో అందిస్తూ ఉన్నాయి. అయితే భారత్‌లో చాలా మంది కుక్కలు, పిల్లులు లాంటి పెంపుడు జంతువుల కోసం మాత్రమే ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. అయితే ఆయా పెట్ ఇన్సూరెన్స్ పథకాలను అనుసరించి, మీరు చెల్లించే ప్రీమియంను అనుసరించి, బీమా కవరేజ్‌లో వ్యత్యాసాలు ఉంటాయి.