పేటీఎం అంతర్జాతీయంగా లిస్ట్ అయిన తొలి ఏడాదిలో అత్యంత అధ్వాన పనితీరు ప్రదర్శించిన ఐపీఓల్లో స్పెయిన్‌కు చెందిన బ్యాంకియా తర్వాతి స్థానంలో నిలిచిందని బ్లూమ్‌బర్గ్ విశ్లేషించింది. టెక్ అంకుర సంస్థలు ఐపీఓ విపణిలో ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో వచ్చిన పేటీఎం కూడా అదే తీరును ప్రదర్శిస్తుందని అంతా అనుకున్నారు. అయితే అలా జరగలేదు.
పేటీఎం అధ్వాన ప్రదర్శన
By
Published : Nov 25, 2022, 6:39 AM IST
Paytm Shares: సామాన్య మదుపర్లు తాము కష్టపడి దాచిన సొమ్మును పబ్లిక్ ఇష్యూల్లో పెట్టి, కాసింత లాభం కళ్లజూద్దామని అనుకుంటుంటారు. అయితే సరైన సంస్థ, షేరుకు పెట్టిన ధర అంశాల్లో అప్రమత్తంగా లేకపోతే, పెట్టిన డబ్బులకే దిక్కుండదు. అలాంటి ఐపీఓనే పేటీఎం. అంతర్జాతీయంగా లిస్ట్ అయిన తొలి ఏడాదిలో, అత్యంత అధ్వాన పనితీరు ప్రదర్శించిన అతిపెద్ద ఐపీఓల్లో స్పెయిన్‌కు చెందిన బ్యాంకియా తర్వాతి స్థానంలో పేటీఎం నిలిచిందని బ్లూమ్‌బర్గ్ విశ్లేషించింది.
ఆశించిన దానికి భిన్నంగా: పేటీఎం మాతృ సంస్థ ఒన్-97 కమ్యూనికేషన్స్ పబ్లిక్ ఇష్యూ 2021 నవంబరు 8-10 తేదీల్లో జరగ్గా, అదేనెల 18న స్టాక్‌ఎక్స్ఛేంజీల్లో నమోదైంది. రూపాయి ముఖ విలువ కలిగిన షేరుకు ఇష్యూ ధర రూ.2150. ప్రస్తుతం ఈ షేరు విలువ 79 శాతం తక్కువగా రూ.441 వద్ద చలిస్తోంది. లిస్టింగ్ అయిన ఏడాది కాలాన్ని పరిగణనలోకి తీసుకున్నా, షేరు ధరలో 75 శాతం తుడిచిపెట్టుకుపోయింది.
2.4 బి. డాలర్లు (రూ.18,300 కోట్లు) సమీకరించిన ఈ కంపెనీ ఇష్యూ, దశాబ్దకాలంలోనే మదుపర్లకు అత్యంత బాధను మిగిల్చినదిగా మారింది. 2012లో స్పెయిన్‌కు చెందిన బ్యాంకియా ఎస్‌ఏ లిస్టింగ్ అయిన తొలి ఏడాదిలో 82 శాతం నష్టం తీసుకురాగా, అంతకంటే కాస్త మెరుగ్గా మాత్రమే పేటీఎం ఉంది. టెక్ అంకుర సంస్థలు ఐపీఓ విపణిలో ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో వచ్చిన పేటీఎం కూడా అదే తీరును ప్రదర్శిస్తుందని అనుకున్నారు. అయితే అలా జరగలేదు.
ఈనెలలోనే 30 శాతం పతనం: పేటీఎం పెట్టుబడిదారు అయిన జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్, లాక్ ఇన్ గడువు ముగియడంతో, గత వారం పేటీఎంలో తన షేర్లను కొంతమేర విక్రయించడంతో మూడు రోజుల పాటు నష్టాల బాటలో పయనించిందీ షేరు. నవంబరు నెలలో ఇప్పటిదాకా షేరు విలువ 30 శాతం క్షీణించింది.
ఒక్కో సారి ఒక్కో రంగం.. ప్రపంచవ్యాప్తంగానూ టెక్ షేర్ల నుంచి మదుపర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. స్థూల ఆర్థిక వాతావరణం మందగమనం పాలు అవుతున్నందున, వీటికి ఆదరణ తగ్గుతోంది. దేశీయంగా పేటీఎం, పాలసీబజార్, జొమాటో, డెలివరీ, నైకా సంస్థల మార్కెట్ విలువలను పరిశీలిస్తే, గత 16 నెలల్లో 18 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.44 లక్షల కోట్లు)మేర మదుపర్ల జేబుకు చిల్లుపెడింది. ‘ప్రతి ర్యాలీలో మార్కెట్ ఏదో ఒక రంగంపై అమితాసక్తి ప్రదర్శిస్తుంటుంది. 2006-08లో నిర్మాణ, యంత్ర పరికరాల కంపెనీలపై; 2013-14లో మిడ్‌క్యాప్; 2017-19లో బ్యాంకింగేతర; 2020-22లో టెక్నాలజీ రంగంపై అలా జరిగింది. వీటిలో మంచి వ్యాపార నమూనా కలిగిన కంపెనీలు లేకపోలేద’ని విశ్లేషకులు అంటున్నారు.
ఇపుడేం చేయాలి? షేరు విలువ బాగా తగ్గింది కదా అని కొత్త మదుపర్లు ఇటువంటి షేర్లలో పెట్టుబడులు పెట్టేందుకు దూకుడుగా వ్యవహరించొద్దని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఆయా కంపెనీల లాభదాయకతకు సరైన మార్గం కనిపించే వరకు వేచిచూడాల్సిందేనని అంటున్నారు. కంపెనీ మూలాలు, బ్యాలెన్స్ షీట్లు బలోపేతం అయినపుడే, షేరు కొనుగోలుకు పరిశీలించాలని చెబుతున్నారు.
అంతర్జాతీయంగా అధ్వాన ఐపీఓలివే.. (కంపెనీ తొలి ఏడాది నష్టం) (సమీకరణ మొత్తం(బి.డా.) నమోదిత దేశం