మనదేశంలో ఫార్మాస్యూటికల్ మార్కెట్ ఇప్పుడున్న 44 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 130 బిలియన్ డాలర్లకు చేరుకోనుందని, దీనివల్ల దేశీయంగా కాంట్రాక్టు పరిశోధనా సేవలకు (సీఆర్‌ఓ) గిరాకీ ఎంతగానో పెరుగుతుందని పరాక్సెల్ ఇంటర్నేషనల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ వ్యాస్ అన్నారు. దీనికి అనుగుణంగా ఇక్కడ తమ కార్యకలాపాలను విస్తరించబోతున్నామని 'ఈనాడు' కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. యూఎస్‌కు చెందిన పరాక్సెల్ కాంట్రాక్టు పరిశోధన రంగంలో ప్రపంచంలోని తొలి మూడు సంస్థల్లో ఒకటిగా ఉంది. దీన్ని గత ఏడాది నవంబరులో గోల్డ్‌మ్యాన్ శాక్స్, ఈ-క్యూటీ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు 8.5 బిలియన్ డాలర్ల విలువకు కొనుగోలు చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా 120 కి పైగా ఉన్న పరాక్సెల్ కార్యాలయాల్లో 20,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో మనదేశంలో 6,000 మంది ఉన్నారు. ఔషధ మార్కెట్ తీరుతెన్నులు, పరిశోధనలు, భవిష్యత్తు అంచనాలపై ఆయన మాట్లాడారు. ఇంటర్వ్యూ విశేషాలు..
కాంట్రాక్టు పరిశోధన సేవల విభాగంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి?
ప్రపంచ వ్యాప్తంగా కాంట్రాక్టు పరిశోధనా సేవలకు 50 బిలియన్ డాలర్ల మార్కెట్ ఉంది. ఈ విభాగంలో భారతదేశం ఎంతో క్రియాశీలకమైన పాత్ర పోషించబోతోంది. వాస్తవానికి దశాబ్దకాలం క్రితం వరకూ ఇక్కడ క్లినికల్ పరీక్షలు, ఔషధ పరిశోధనలు పెద్దఎత్తున జరిగాయి. తదుపరి నిబంధనల్లో వచ్చిన మార్పులతో పరిశోధనా కార్యకలాపాలు మందగించాయి. కానీ కొవిడ్-19 తర్వాత కాంట్రాక్టు పరిశోధనలను పెద్దఎత్తున నిర్వహించేందుకు వీలుకల్పిస్తూ, యూఎస్‌ఎఫ్‌డీఏ, యూకేఎంసీఏ నిబంధనలను అనుసరించాలని భారత ఔషధ నియంత్రణ వర్గాలు నిర్ణయించాయి. దీనివల్ల మళ్లీ ఇక్కడ కాంట్రాక్టు పరిశోధనలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 100కు పైగా మాలిక్యూల్స్‌పై ప్రయోగాలు జరుగుతున్నాయి. సమీప భవిష్యత్తులో దాదాపు 300- 400 మాలిక్యూల్స్‌పై ప్రయోగాలు- పరీక్షలు నిర్వహించే స్థాయికి భారతదేశంలో కాంట్రాక్టు పరిశోధనా సేవల మార్కెట్ విస్తరించవచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా ఎటువంటి వ్యాధులకు సంబంధించి ఔషధ పరిశోధనలు అధికంగా జరుగుతున్నాయి?
గత రెండేళ్లలో కొవిడ్-19 టీకాలు, ఔషధాలపై పరీక్షలు అధికంగా జరిగాయి. ఇది కాకుండా ఆంకాలజీ, హీమటాలజీ, ఇమ్యూనోమాడ్యులార్ విభాగాల్లో కొత్త మాలిక్యూల్స్‌ను ఆవిష్కరించటంపై ఫార్మా కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. అందువల్ల ఈ విభాగాలకు సంబంధించిన మాలిక్యూల్స్‌పై ప్రయోగాలు అధికంగా జరుగుతున్నాయి. ఇంకా సెల్‌జీన్ థెరపీ, పర్సనలైజ్డ్ మెడిసిన్ విభాగాల్లోనూ పెద్దఎత్తున ప్రయోగాలు జరుగుతున్నాయి.
భారత ఔషధ మార్కెట్‌పై మీ అంచనాలు ఏమిటి?