Oxfam davos report 2022: దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో ఆక్స్‌ఫామ్ ఆసక్తికర విషయాల్ని వెలుగులోకి తెచ్చింది. కొవిడ్ 19 సమయంలో ప్రతి 30 గంటలకు ఒకరు బిలియనీర్‌గా మారుతున్నారని పేర్కొంది. అదే సమయంలో ప్రతి 33 గంటలకు 10 లక్షల మంది దారిద్ర్యంలోకి వెళుతున్నట్లు నివేదిక తెలిపింది. 'ప్రాఫిటింగ్ ఫ్రమ్ పెయిన్' అనే శీర్షికతో నివేదికను ప్రచురించింది. కరోనా కాలంలో నిత్యావసర సరకుల ధరలు దశాబ్దంలోనే అత్యధిక స్థాయికి చేరుకుందన్నారు. ఆహారం, ఇంధన రంగాల్లోని బిలియనీర్లు తమ సంపదను ప్రతి రెండు రోజులకు ఒక బిలియన్ డాలర్లు పెంచుకున్నట్లు తెలిపింది. కరోనాతో వాయిదా పడిన దావోస్ సమావేశం రెండేళ్ల తర్వాత తిరిగి ఆరంభమైంది.
ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రకారం.. కరోనా కాలంలో 573 మంది బిలియనీర్ల జాబితాలో చేరారని తెలిపింది. కొవిడ్ తొలి 24 నెలల్లో వీరి సంపద 23 సంవత్సరాల గరిష్ఠానికి చేరింది. ప్రపంచంలోని బిలియనీర్ల సంపద 2000లో 4.4 శాతం ఉండగా.. ప్రస్తుతం 13.9శాతం జీడీపీకి చేరుకుంది. ఈ నివేదిక ప్రకారం ఇంధన రంగ సంస్థలైన బీపీ, షేల్, టోటల్ ఎనర్జీస్, ఎక్సాన్, చెవ్రోన్లు ప్రతి సెకన్‌కు 2,600 డాలర్ల లాభాన్ని పొందారు. ఆహార రంగంలో 62 మంది బిలియనీర్లు కొత్తగా తయారయ్యారు.