తెలంగాణ

telangana

ETV Bharat / business

Online KYC Update : బ్యాంక్​కు వెళ్లకుండానే.. ఆన్​లైన్​లో కేవైసీని అప్డేట్​ చేసుకోండిలా..

Online KYC Update in Telugu : బ్యాంకులకు సంబంధించి కేవైసీ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్​ చేసుకోవాలనే నిబంధనను తీసుకువచ్చింది రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా. ఈ ప్రక్రియను తప్పనిసరి చేస్తూ ఇప్పటికే పలు కీలక గైడ్​లైన్స్​ను కూడా విడుదల చేసింది. అయితే కేవైసీ అప్డేట్​ కోసం బ్యాంకులకు వెళ్లకుండానే ఇంట్లో కూర్చొని కూడా ఆన్​లైన్​లో అప్డేట్​ చేసుకునే వీలును కల్పించింది ఆర్​బీఐ. ఆ వివరాలు మీకోసం..

Online KYC Update Full Details Here In Telugu
Online KYC Update Full Details In Telugu

By

Published : Aug 15, 2023, 8:21 PM IST

Online KYC Update : రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా నిబంధనల ప్రకారం ప్రతి బ్యాంకు వినియోగదారుడు తమ కేవైసీ( Know Your Customer ) వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్​ చేసుకుంటూ ఉండాలి. ఇందుకోసం ఇదివరకు కచ్చితంగా బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, ఈ ఏడాది జనవరిలో ఆర్​బీఐ తెచ్చిన వెసులుబాటుతో ఇంట్లో కూర్చొని కూడా ఆన్​లైన్​లో తమ బ్యాంకు ఖాతాకు సంబంధించిన కేవైసీ డీటెయిల్స్​ను అప్డేట్​ చేసుకోవచ్చు. అయితే ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఇప్పటికే వ్యాలిడ్​ డాక్యుమెంట్లను సమర్పించిన వారు, ఇంటి చిరునామాలో ఎటువంటి మార్పులు లేని ఖాతాదారులు మాత్రమే బ్యాంకులకు వెళ్లకుండానే ఆన్​లైన్​లో తమ కేవైసీ వివరాలను అప్డేట్​ చేసుకోవచ్చు.

ఆటో-డిక్లరేషన్​తో..
ఖాతాదారు సమర్పించిన కేవైసీ వివరాల్లో ఎటువంటి మార్పులు లేకపోతే.. వినియోగదారులు తమ వ్యక్తిగత ఈ-మెయిల్​, రిజిస్టర్డ్​ మొబైల్​ నంబర్​ లేదా ఏటీఎంల ద్వారా కూడా కేవైసీని అప్డేట్​ చేయమని సదరు బ్యాంకులను కోరవచ్చు. ఇందుకు మనం ఆటో-డిక్లరేషన్​ను ఆయా శాఖలకు సమర్పించాల్సి ఉంటుంది. కాగా, కేవైసీ సమాచారంలో ఎలాంటి మార్పులు లేకపోతే కస్టమర్​ అందించే ఆటో డిక్లరేషన్​తో కేవైసీని అప్డేట్​ చేయవచ్చని బ్యాంకులకు సర్క్యూలర్​ జారీ చేసింది ఆర్​బీఐ. ఇందుకోసం రిజిస్టర్డ్​ ఈ-మెయిల్ ఐడీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఏటీఎంలు, డిజిటల్ మాధ్యమాలైన.. ఆన్‌లైన్ బ్యాంకింగ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్​ యాప్స్​ వంటి వివిధ మర్గాల ద్వారా ఖాతాదారులకు ఆటో-డిక్లరేషన్ కోసం సౌకర్యాలను కల్పించాలని బ్యాంకులకు సూచించింది.

KYC ఆన్​లైన్​ అప్డేట్​ ఇలా..

  • ముందుగా మీ బ్యాంక్ ఆన్‌లైన్ బ్యాంకింగ్ పోర్టల్​లోకి లాగిన్ అవ్వాలి.
  • KYC ట్యాబ్​పై క్లిక్​ చేయండి.
  • మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ సహా మరిన్ని వివరాలను అందించండి.
  • రెండు వైపులా స్కాన్​ చేసిన ఆధార్​, పాన్​ సహా ఇతర డాక్యుమెంట్లను అప్​లోడ్​ చేయండి.
  • చివరగా సబ్మిట్​ బటన్​ను నొక్కండి. తర్వాత మీకు ఓ సర్వీస్​ రిక్వెస్ట్​ నంబర్​ వస్తుంది. దాన్ని భద్రపరుచుకోండి.
  • కాగా, దీనికి సంబంధించి అప్డేట్​ స్టేటస్​ను బ్యాంకులు మీకు ఎప్పటికప్పుడు ఎస్​ఎంఎస్​ లేదా ఈ-మెయిల్​ ద్వారా అందిస్తాయి.

అయితే కొన్ని సందర్భాల్లో మీ కేవైసీ డాక్యుమెంట్ల వ్యాలిడిటీ అయిపోతుంటుంది. అలాంటి సందర్భాల్లో మాత్రం మీరు తప్పనిసరిగా కేవైసీ అప్డేట్​ కోసం బ్యాంకులకు వెళ్లాలి. అప్పుడు మీరు సరైన ధ్రువపత్రాలను మీ బ్యాంకులకు సమర్పించాల్సి ఉంటుంది.

కేవైసీ అప్డేట్​ చేసుకోకపోతే..?
దేశంలో ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడానికి, ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడానికి రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ఈ కేవైసీ అప్డేట్​ ప్రక్రియను తప్పనిసరి చేస్తూ పలు కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రతి భారత పౌరుడు క్రమం తప్పకుండా తమ తమ కేవైసీ వివరాలను అప్డేట్​ చేసుకోవాలి. అయితే అప్డేట్​ చేసుకోకపోతే ఏం జరుగుతుంది అనే ప్రశ్నకు సమాధానంగా ఆర్​బీఐ ఈ విధంగా బదులిచ్చింది.

కేవైసీ అనేది బ్యాంకులు తమ కస్టమర్‌ల గుర్తింపును, చిరునామాలకు సంబంధించిన వివరాలను సేకరించే నిరంతర ప్రక్రియ. ఇలా సేకరించిన సమాచారం వినియోగదారుడి గుర్తింపును నిర్ధరించడానికి ఉపయోగపడుతుంది. బ్యాంకుల పేరుతో మోసాలకు పాల్పడే కేటుగాళ్ల నుంచి రక్షించడంలో KYC ప్రక్రియ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే బ్యాంకు ఖాతా తెరిచే సమయంలో కేవైసీని అలాగే అప్డేట్ ప్రక్రియను తప్పనిసరి చేసింది ఆర్​బీఐ.

ఒకవేళ మీ KYC సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోకపోతే మీరు జరిపే లావాదేవీలపై పరిమితులను విధించడంతో పాటు బ్యాంక్ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేస్తుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో మీ అకౌంట్​ను కూడా క్లోజ్​ చేయవచ్చు. దీంతో మీరు ఇకపై ఎటువంటి ట్రాన్సాక్షన్స్​ చేయలేరు. అయితే బ్యాంకులు ఇలాంటి చర్యలు ఉపక్రమించే ముందు నిబంధనల ప్రకారం సదరు వినియోగదారుడికి సమాచారం అందిస్తాయి.

ABOUT THE AUTHOR

...view details