భారత ఆర్థిక వ్యవస్థ 'కె' ఆకారంలో పుంజుకుంటోందనే విమర్శలను ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు తోసిపుచ్చారు. ధనవంతులు మరింత ధనవంతులు కావడం.. పేదవాళ్లు మరింత పేదరికంలో జారిపోవడాన్ని 'కె' ఆకారపు పురోగతిగా అభివర్ణిస్తారు. అయితే అలాంటి పరిస్థితులు లేవని.. ఆర్థిక అసమానతలు తగ్గేందుకు 'కొవిడ్-19' పరిణామాల సమయంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఉపయోగపడ్డాయని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు తెలిపారు. పేదవాళ్లకు సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి రూ.75,000 వరకు ప్రభుత్వం బదిలీ చేసిందని పేర్కొన్నారు.
'కొవిడ్ అనంతరం తగ్గిన ఆర్థిక అసమానతలు.. కేంద్రం తీసుకున్న చర్యల వల్లే' - భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం
ధనవంతులు మరింత ధనవంతులు కావడం.. పేదవాళ్లు మరింత పేదరికంలోకి జారిపోవడం వంటి పరిస్థితులు భారత ఆర్థిక వ్యవస్థలో కనిపించడం లేదని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు తెలిపారు. దేశంలో ఆర్థిక అసమానతలు పెరగకుండా చేయడంలో ప్రభుత్వ చర్యలు ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు.
కొవిడ్-19 పరిణామాలు చోటుచేసుకున్నాక భారత్‌లో ఆర్థిక అసమానతలు మరింత తీవ్రమవ్వొచ్చనే ఆందోళన నెలకొన్న విషయాన్ని నివేదిక ప్రస్తావించింది. దీనిని కొంత మంది 'కె' ఆకార పురోగతిగా అభిప్రాయపడ్డారని పేర్కొంది. అయితే వివిధ అధ్యయనాలు, పరిశీలన అనంతరం కొవిడ్-19 పరిణామాల సమయంలో చేసిన నగదు బదిలీ, ఆహార ధాన్యాల సరఫరా కారణంగా పేదవాళ్లకు భద్రత కలిగిందని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు విశ్లేషించారు. కొవిడ్-19 అనంతరం భారత్ బలంగా పుంజుకుందని, అయితే ఇప్పటికీ కొందరు 'కె' ఆకారపు పురోగతి అని చెబుతున్నారని పేర్కొన్నారు. అయితే ఆర్థికపరమైన ఆస్తుల విలువ బలంగా పెరగడం వల్ల 2021లో అసమానతలు పెరిగిన మాట నిజమే అని, కానీ అసమానతల్లో అటువంటి ఒడుదొడుకులు తాత్కాలికమేననే విషయం పలుమార్లు నిరూపితమైందని వివరించారు.