New Financial Rules From October 1st 2023 :కొత్తగా మారిన పన్ను నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్‌కు నామినీ లింక్; చిన్న పొదుపు ఖాతాలకు ఆధార్, పాన్ లింక్; బర్త్ సర్టిఫికేట్ రూల్స్ అన్నీ ఇవాల్టి (అక్టోబర్ 1) నుంచి అమల్లోకి వచ్చాయి. మరోవైపు రూ.2000 నోట్ల మార్పిడి/ డిపాజిట్ గడువు అక్టోబర్ 7 వరకు పొడిగించడం జరిగింది. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రభుత్వ ఉద్యోగానికి బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి!
Birth Certificate mandatory for Government Jobs : అక్టోబర్ 1 నుంచి ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలన్నా, ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలన్నా బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి. అలాగే స్కూల్ అడ్మిషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డ్, మ్యారేజ్ రిజిస్ట్రేషన్లకు కూడా బర్త్ సర్టిఫికేట్ కచ్చితంగా ఉండి తీరాలి. జనన, మరణాల నమోదు (సవరణ) చట్టం ప్రకారం, ఈ రూల్ 2023 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.
పన్ను భారం పెరిగింది!
TCS Rules From October 2023 : ఇటీవలే తీసుకొచ్చిన ట్యాక్స్ రూల్స్ అక్టోబర్ 1 నుంచి అమల్లో వచ్చాయి. దీని ప్రకారం ఓవర్సీస్లో మీ క్రెడిట్ కార్డు వినియోగ పరిమితి రూ.7 లక్షలకు మించితే 20 శాతం ట్యాక్స్‌ను వసూలు చేస్తారు. అయితే వైద్యం సహా విద్యకు సంబంధించి ఖర్చులు ఉంటే గనుక 5 శాతం పన్నును మాత్రమే విధిస్తారు. అలాగే విదేశీ విద్య కోసం రూ.7 లక్షల కంటే ఎక్కువ రుణాలు తీసుకునే విద్యార్థులకు నిబంధనల ప్రకారం 0.5 శాతం ట్యాక్స్‌ను విధిస్తారు.
సేవింగ్స్ ఖాతాలకూ ఆధార్!
Aadhar Link To Savings Account : పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై), పోస్టాఫీసు డిపాజిట్లు సహా ఇతర చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టిన వారు సెప్టెబర్ 30లోగా తమ ఆధార్, పాన్ వివరాలను పోస్టాఫీసు లేదా బ్యాంకు శాఖకు సమర్పించి ఉండాలి. ఇలా చేయనివారి ఖాతాలు అక్టోబర్ 1 నుంచి స్తంభించిపోతాయి. అంటే సదరు ఖాతాదారులు తమ అకౌంట్ ద్వారా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు పూర్తి చేయలేరు. ఎప్పుడైతే తమ ఖాతాలకు ఆధార్, పాన్ లింక్ చేస్తారో.. అప్పుడే మళ్లీ అవి యాక్టివేట్ అవుతాయి.