తెలంగాణ

telangana

ETV Bharat / business

Mutual Funds Investment Guide For Beginners : మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్వెస్ట్​ చేయాలా?.. ఈ 5 సూత్రాలు కచ్చితంగా పాటించండి!

Mutual Funds Investment Guide For Beginners : కొత్తగా ఇన్వెస్ట్​మెంట్​ ప్రారంభించేవారికి మ్యూచువల్ ఫండ్ ఒక​​​ మంచి ఎంపిక అవుతుంది. చిన్న మొత్తాల్లో పొదుపు చేస్తూ, దీర్ఘకాలంలో మంచి రాబడిని పొందడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. అందుకే మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్వెస్ట్​ చేసేముందు పాటించాల్సిన ముఖ్యమైన సూత్రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

mutual-funds-investment-guide-beginners-and-mutual-funds-sip-investment-plan
కొత్త పెట్టుబడిదారులకు సిప్ పెట్టుబడి గైడ్

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2023, 4:24 PM IST

Mutual Funds Investment Guide For Beginners :మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడమనేది దీర్ఘకాలంలో గొప్ప సంపదను సృష్టించేందుకు ఒక మంచి మార్గంగా చెప్పవచ్చు. వాస్తవానికి మదుపు చేయాలనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. కానీ, పెద్ద మొత్తంలో డబ్బు తమ దగ్గర లేకపోవడం వల్ల వెనకడుగు వేస్తుంటారు. అందుకే తక్కువ మొత్తంతో ఇన్వెస్ట్​మెంట్​ చేయాలనుకునే వారికీ మ్యూచువల్​ ఫండ్స్​ ఎంతో అనుకూలంగా ఉంటాయి. మీరు కూడా మ్యూచువల్​ ఫండ్స్​లో.. క్రమానుగత పెట్టుబడి విధానం(SIP)లో పెట్టుబడులను పెట్టాలనుకుంటే.. కచ్చితంగా 5 ముఖ్యమైన సూత్రాలు పాటించాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మ్యూచువల్ ఫండ్స్​
వాస్తవానికి మ్యూచువల్‌ ఫండ్లలో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు కూడా వీలు ఉంటుంది. అలా వీలుకానప్పుడు.. క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) ద్వారా నెలకు కొంత మొత్తం చొప్పున మదుపు చేయవచ్చు. అలాగే కొద్ది మొత్తంతో ప్రారంభించి.. కాలం గడుస్తున్న కొద్దీ ఇన్వెస్ట్​మెంట్​ మొత్తాన్ని కూడా పెంచుకోవచ్చు. అందుకే తక్కువ నష్టభయంతో, దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తం ధనాన్ని కూడబెట్టేందుకు మ్యూచువల్​ ఫండ్స్​ మంచి సాధనం అవుతాయని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. మీ ఆదాయం, ఆర్థిక లక్ష్యాలను అనుసరించి, మీరు అనుకున్నంత కాలంపాటు.. ప్రతీ వారం, నెల, 3 లేదా 6 నెలలకోసారి నిర్ణీత మొత్తాన్ని మదుపు చేయవచ్చు. రూ.500 కనీస పెట్టుబడి మొత్తంతో సిప్​ ప్రారంభించవచ్చు.

పెట్టుబడి లక్ష్యాలను గుర్తించండి..
మ్యూచువల్ ఫండ్స్​లో పెట్టుబడి పెట్టేముందు.. దీర్ఘకాలిక లక్ష్యంతో ఇన్వెస్ట్​ చేస్తున్నారా? లేదా స్వల్పకాలిక లక్ష్యంతో ఇన్వెస్ట్​ చేస్తున్నారా? అనే విషయంలో మీకో స్పష్టత ఉండాలి. అప్పుడే పెట్టుబడి పెట్టాల్సిన మొత్తం, కాల వ్యవధి, భవిష్యత్​లో లభించే నిధి మొదలైన కీలకమైన అంశాలపై మీకో అవగాహన ఏర్పడుతుంది.

కోరికలు నెరవేరాలంటే..
మానవులు అందరికీ అనేక రకాల కోరికలు ఉంటాయి. ఇల్లు కట్టుకోవడం, కారు కొనడం, పిల్లల చదువులు, పెళ్లి ఇలా రకరకాల ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి. వాస్తవానికి వాటిని సాధించేందుకు ఒక్క మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్​మెంట్​ మాత్రమే సరిపోకపోవచ్చు. అందువల్ల మీ ఆర్థిక లక్ష్యానికి అనుగుణంగా ఇతర పెట్టుబడి మార్గాలను కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది.

పథకం ఎంపికలో..
ఎన్నో మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. డెట్‌, ఈక్విటీ, హైబ్రిడ్‌ మొదలైన రకరకాల మ్యూచువల్ ఫండ్స్​ ఉన్నాయి. అయితే రాబడి అంచనాలు, ఆర్థిక లక్ష్యాలు, కాల వ్యవధి ఇలా పలు అంశాలను పరిశీలించాకే తగిన మ్యూచువల్‌ ఫండ్‌ను మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. మ్యూచువల్​ ఫండ్స్ అనేవి స్టాక్​ మార్కెట్ పెట్టుబడుల్లో భాగంగానే ఉంటాయి. కనుక కొంత మేరకు నష్టభయం కూడా ఉంటుంది. కనుక ఇలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టేముందు.. నష్టాన్ని భరించే శక్తి, సామర్థ్యాలను కూడా మీరు స్వయంగా అంచనా వేసుకోవాలి. ​ ఉదాహరణకు నష్టం వచ్చినా ఇబ్బంది లేదు కానీ.. అధిక రాబడి రావాలని ఆశిస్తే.. దీర్ఘకాలిక వ్యవధితో ఈక్విటీ పెట్టుబడులను ఎంపిక చేసుకోవచ్చు. తక్కువ నష్టభయం ఉండాలనుకుంటే డెట్‌ పథకాలను ఎంచుకోవాలి. నష్టభయం కాస్త మధ్యస్థంగా ఉండాలని భావిస్తే హైబ్రిడ్‌ ఫండ్స్​ను ఎంచుకోవాలి.

సరైన ఫండ్​ ఎంచుకోవాలి!
ప్రస్తుతం మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలు మార్కెట్లో విభిన్నమైన పెట్టుబడి పథకాలను అందిస్తున్నాయి. అన్ని ఫథకాలకూ ఆకర్షణీయమైన రాబడిని అందించే సామర్థ్యం ఉండకపోవచ్చు. కనుక కంపెనీ చరిత్ర, పెట్టుబడి వ్యయం, గతంలో పథకం పనితీరు, ఫండ్‌ మేనేజర్‌ సామర్థ్యం మొదలైన అనేక అంశాల ఆధారంగా సరైన మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీని ఎంచుకోవాల్సి ఉంటుంది.

వైవిధ్యంగా ఉండేలా..
పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండేలా చూసుకోవడం అనేది ఎప్పుడూ మంచి మదుపు వ్యూహంగా భావించవచ్చు. ముందే చెప్పినట్లు నష్టాన్ని భరించే సామర్థ్యం, రాబడి అంచనాల ప్రకారం పలు రకాల పథకాలను ఎంపిక చేసుకోవాలి. వయస్సు, ఆర్థిక బాధ్యతలు, పెట్టుబడి వ్యవధి, ఆదాయం తదితర అంశాలు పెట్టుబడిదారుడి నష్టభయాన్ని ప్రభావితం చేస్తాయి. నష్టాలను తగ్గించడంలో వైవిధ్యమైన పెట్టుబడులు సహాయం చేస్తాయి. ఈ వైవిధ్యం సాధించేందుకు రకరకాల పథకాలు, ఫండ్‌ కంపెనీలలో మీ పెట్టుబడులు ఉండేలా జాగ్రత్తపడాలి. అదే సమయంలో మితి మీరిన వైవిధ్యం పెట్టుబడులపై రాబడిని తగ్గిస్తాయని గుర్తించుకోవాలి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా..
పెట్టుబడి పెట్టే సమయంలో ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. సిప్‌ను ఎంచుకునేటప్పుడు ఇప్పటికే ఉన్న ద్రవ్యోల్బణాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. భవిష్యత్తులో ఇన్​ఫ్లేషన్​ ఏ మేరకు ఉంటుందో పరిశీలించుకోవాలి. మీ లక్ష్యాలు భవిష్యత్‌లో మారిపోవచ్చు. మీ అవసరాలను తీర్చేందుకు ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరం కావచ్చు. అనేక మంది చాలా పెట్టుబడి పథకాల్లో మదుపు చేస్తుంటారు. కానీ, లక్ష్య సాధనకు కావాల్సిన మొత్తం వారికి అందకపోవచ్చు. పెట్టుబడి మొదలుపెట్టేటప్పుడు ద్రవ్యోల్బణాన్ని అంచనా వేయకపోవడం వల్లే ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కనుక, ఇలాంటి పొరపాటు మీరు చేయకూడదు. అందుకే ఆర్థిక లక్ష్యానికి అనుగుణంగా సిప్‌ మొత్తాన్ని నిర్ణయించుకోవాలి.

సమీక్షిస్తూ ఉండండి..
వాస్తవానికిి మ్యూచువల్​ ఫండ్స్​లో మీ డబ్బును మదుపు చేసి మర్చిపోవడమనేది పెట్టుబడి అనిపించుకోదు. మీ పెట్టుబడి పనితీరును క్రమం తప్పకుండా సమీక్షిస్తూ ఉండాలి. ఒక్కోసారి మీ పెట్టుబడి.. ఆశించిన స్థాయిలో రాబడులను ఇవ్వకపోవచ్చు. ఇలాంటి పరిస్థితి.. మ్యూచువల్ ఫండ్​ ఎంపికలో పొరపాటు వల్ల, లేదంటే మార్కెట్‌ పరిస్థితుల వల్ల ఏర్పడవచ్చు. అందుకే పెట్టుబడులను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుండాలి. అప్పుడే ఈ విషయాన్ని కనిపెట్టేందుకు ఒక అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా పనితీరు బాగాలేని పథకాల నుంచి పెట్టుబడిని వెనక్కి తీసుకోవడానికి వీలవుతుంది. అలాగే మీ పెట్టుబడులను, మెరుగైన రాబడిని అందించే పథకాల్లోకి మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. వాస్తవానికి మీరు ఎంత ఎక్కువ కాలం మార్కెట్లో కొనసాగితే అంత ఎక్కువ లాభాన్ని అందుకునేందుకు వీలుంటుంది. దీనికి ప్రధాన కారణం కాంపౌండింగ్​ ఎఫెక్ట్​. సహనం, ఆర్థిక క్రమశిక్షణతో పెట్టుబడి పెడితే.. మంచి రాబడి కచ్చితంగా లభిస్తుంది.

Rules Before Investing in Stock Markets: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.. లేదంటే అంతే సంగతి..!

Mukesh Ambani Employees Salary : అంబానీ ఇంట్లో పనిచేసే వారికి అంత జీతమా..!

ABOUT THE AUTHOR

...view details