రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ దేశంలోనే కాదు, ఆసియాలోనే అత్యంత ధనవంతుడు. ఆయన ఆస్తి సుమారు రూ.7 లక్షల కోట్లపైనే ఉంటుంది. ప్రస్తుతం ముకేశ్ అంబానీ కుటుంబం ముంబయిలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో నిర్మించిన 'యాంటిలియా'లో నివాసముంటోంది. 27 అంతస్తుల ఈ భవనంలో మూడు హెలిపాడ్లు, 168 కార్ల కోసం పార్కింగ్, 50 మంది కూర్చుని చూసే సినిమా థియేటర్, 9 ఎలివేటర్లు ఇతర అధునాతన సదుపాయాలున్నాయి. అయితే అంబానీ ఇంట్లో పనిచేసే వంటమనిషి (చెఫ్) సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో చర్చనీయాంశమవుతోంది. అంబానీల ఇంట్లో పనిచేసే చెఫ్‌ల జీతం ఎంత? అనే చర్చ సాగుతోంది.
టాప్ మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగుల కన్నా, సీఏ, ఎంబీఏ చదివి పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగుల కన్నా అంబానీ ఇంట్లో పనిచేసే వంట మనుషులకే జీతం ఎక్కువని టాక్. ఓ నివేదిక ప్రకారం అంబానీ ఇంట్లో పనిచేసే చెఫ్‌లకు ఒక్కొక్కరికి నెలకు రూ.2 లక్షల జీతం అని తెలుస్తోంది. అంటే వారికి ఏడాదికి రూ.24 లక్షల ప్యాకేజ్ అన్నమాట. అయితే వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ ఎక్కువగా శాఖాహారాన్ని ఇష్టపడతారట. ఆయన ఎక్కువగా పప్పు, అన్నం, చపాతీలు తింటారట. ఉదయం అల్పాహారంలో ఒక గ్లాసు బొప్పాయి జ్యూస్, ఇడ్లీ-సాంబార్ కాంబినేషన్ ఇష్టపడతారట. దాదాపుగా 600 మంది సిబ్బంది ముకేశ్ అంబానీ ఇంట్లో పనిచేస్తున్నారని తెలుస్తోంది.