2079 సంవత్‌ను మార్కెట్లు సోమవారం ఘనంగా ప్రారంభించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికా మార్కెట్లు శుక్రవారం రాణించడం ఇందుకు నేపథ్యం. రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ యునిలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లకు నిఫ్టీ-50లో 25.5 శాతం వెయిటేజీ ఉంది. ఇవి గత వారం మార్కెట్లు ముగిసిన అనంతరం ఫలితాలు ప్రకటించాయి. వీటి ప్రభావమూ ఉంటుంది. సోమవారం మూరత్ ట్రేడింగ్ మాత్రమే జరగనుండడం; దీవాలీ బలిప్రతిపద సందర్భంగా బుధవారం సెలవు కావడం వల్ల, ఈ వారంలో సాధారణ ట్రేడింగ్ మూడు రోజులే జరగనుంది. అక్టోబరు డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనున్నందున, ఒడుదొడుకులు చోటుచేసుకోవచ్చు. రూపాయి-డాలర్ కదలికలు, విదేశీ మదుపర్ల పెట్టుబడుల ధోరణీ ప్రభావం చూపుతాయి. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..
- వృద్ధిపై అనిశ్చితి కారణంగా సిమెంటు కంపెనీల షేర్లు ఊగిసలాటకు గురికావొచ్చు. అల్ట్రాటెక్, ఏసీసీ, శ్రీ సిమెంట్ ఫలితాల నేపథ్యంలో, ఈ రంగ షేర్ల తాజా కొనుగోళ్ల విషయంలో మదుపర్లు జాగ్రత్త వహిస్తారు.
- అంతర్జాతీయ స్థూల ఆర్థిక అంశాల ఆధారంగా ఐటీ షేర్లు కదలాడొచ్చు. అమెరికాలో అక్టోబరు నెల తయారీ, సేవల గణాంకాలు; జులై-సెప్టెంబరు జీడీపీ అంచనాలు ఈ వారం వెలువడనున్నాయి.
- చాలా వరకు బ్యాంకులు బలమైన ఫలితాలను ప్రకటించినందున, బ్యాంకింగ్ షేర్లు సానుకూల ధోరణితో ట్రేడవవచ్చు. నిఫ్టీ బ్యాంక్ సూచీకి 41,000 వద్ద మద్దతు లభించొచ్చు. సానుకూల వార్తలొస్తే 41,250 వరకు వెళ్లొచ్చు. 42,000 వద్ద నిరోధం ఎదురుకావొచ్చు.
- యంత్ర పరికరాల షేర్లు సానుకూల ధోరణితో, అధిక శ్రేణిలో చలించొచ్చు. 31న విడుదలయ్యే ఎల్ అండ్ టీ ఫలితాలు దిశానిర్దశం చేయొచ్చు. భెల్, సీమెన్స్ ఫలితాలూ కీలకమే.
- ఎంపిక చేసిన టెలికాం షేర్లలో కదలికలుంటాయి. జియో సెప్టెంబరు త్రైమాసికంలో రాణించడం కలిసొచ్చే అంశం. 5జీ సేవలు, టారిఫ్ సవరణలు, సగటు వినియోగదారు ఆదాయ (ఆర్పు) ధోరణి వంటివి గమనించాలి.
- ఇప్పటివరకు వెలువడిన ఔషధ కంపెనీల ఫలితాలు నిరుత్సాహపరిచినందున, ఈ రంగ షేర్లు ఒత్తిడికి లోను కావొచ్చు. వ్యయాలు పెరుగుతుండడం, అమెరికా జనరిక్స్‌లో ధరలు తగ్గడం సవాలే.
- అనిశ్చితులు, కమొడిటీ ధరల క్షీణత కారణంగా లోహ కంపెనీల షేర్ల ధరలు పుంజుకోకపోవచ్చు. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక గణాంకాలు బలహీనంగా ఉన్నందున, ప్రాథమిక లోహ ట్రేడర్లు నష్టభయాన్ని ఎదుర్కోవచ్చు.
- మెరుగైన ఫలితాల నేపథ్యంలో వాహన కంపెనీల షేర్లు రాణించొచ్చు. సెమీకండక్టర్ల సరఫరా పెరగడం, తక్కువ కమొడిటీ వ్యయాలు ఈ సంస్థలకు కలిసి రావచ్చు.
- రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాలు అంచనాలను చేరనందున, ఆ ప్రభావం చమురు షేర్లపై పడొచ్చు. అప్‌స్ట్రీమ్ కంపెనీలు ముడి చమురు ధరల ఆధారంగా ట్రేడవవచ్చు. మాంద్యం భయాల వల్ల చమురు ధరలు పెరిగే అవకాశాలు పరిమితంగా ఉన్నాయి.
- బలమైన సెప్టెంబరు త్రైమాసిక ఫలితాల కారణంగా ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు రాణించొచ్చని అంచనా. బుధవారం వెలువడే డాబర్ ఇండియా ఫలితాలను గమనించాలి.
నేడు మూరత్ ట్రేడింగ్..
దీపావళి సందర్భంగా స్టాక్ ఎక్స్ఛేంజీలు సోమవారం గంట పాటు ప్రత్యేక 'మూరత్ ట్రేడింగ్' మాత్రమే నిర్వహించనున్నాయి.
సాయంత్రం 6.15 గంటలకు ప్రారంభమై 7.15 గంటలకు ఈ ట్రేడింగ్ ముగియనుంది.