microsoft paying in bribes: విదేశాల్లో ఒప్పందాల ఖరారుకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీ ఎత్తున లంచాలు ఇస్తోందని మాజీ ఉద్యోగి యాసర్ ఎలాబ్ ఆరోపించారు. ముడుపులు, లంచాల కోసం ఏటా 200 మిలియన్ డాలర్లు (₹1.5 వేల కోట్లు) కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రజావేగుల వేదికగా మారిన లయనెస్ వెబ్‌సైట్‌లో ఓ వ్యాసం రాశారు. ఘనా, నైజీరియా, జింబాబ్వే, కతార్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో ఒప్పందాలకు భారీ ఎత్తున లంచాలు ఇచ్చినట్లు ఎలాబ్ ఆరోపించారు. 1998లో సంస్థలో చేరిన తాను మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాల్లో సంస్థ ఉత్పత్తులను ప్రమోట్ చేయడంపై పనిచేశానన్నారు. ఈ క్రమంలో తన పనితీరును మెచ్చి కంపెనీలో పలు పదోన్నతులు పొందినట్లు పేర్కొన్నారు.
కొంతకాలం గడిచిన తర్వాత సంస్థలో కొంత వింత పోకడను గమనించానని ఎలాబ్ తెలిపారు. తన కంటే కింది హోదాలో అనేక మంది ఉద్యోగులు విలాసవంతమైన కార్లు, విల్లాలు కొనుక్కొని జీవితం గడుపుతున్నట్లు గమనించానన్నారు. తాను మాత్రం ఎన్ని ప్రమోషన్లు వచ్చినా ఇల్లు కొనడానికే కష్టపడ్డానని తెలిపారు. 2016లో 40 వేల డాలర్ల మంజూరుకు తనకు ఓ అభ్యర్థన వచ్చిందని తెలిపారు. ఓ ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ఈ మొత్తం కావాలని కోరినట్లు తెలిపారు. కానీ, కస్టమర్‌కు సంబంధించిన వివరాలు కంపెనీ 'పొటెన్షియల్ క్లయింట్స్' డేటాబేస్‌లో లేవని తెలిపారు. తీరా చూస్తే ఆ క్లయింట్ కంపెనీలో పనిచేసిన మాజీ ఉద్యోగేనని తేలిందన్నారు. నాలుగు నెలల క్రితమే అతణ్ని సంస్థ బయటకు పంపిందని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం.. కంపెనీ నుంచి బయటకు వెళ్లిన ఉద్యోగులు సంస్థతో ఆరు నెలల వరకు ఎలాంటి భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి వీల్లేదని పేర్కొన్నారు.