Microsoft Cyber Attack : జూన్ నెల మొదట్లో మైక్రోసాఫ్ట్ ఔట్ లుక్, ఈ-మెయిల్, క్లౌడ్ సేవల్లో కలిగిన అంతరాయాలు.. సైబర్ దాడులు వల్లేనని ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ధ్రువీకరించింది. సర్వర్ డౌన్లకు తొలుత కారణాన్ని వెల్లడించడానికి వెనకాడిన మైక్రోసాఫ్ట్.. ఇది హ్యాకర్ల పనేనని తేల్చిచెప్పింది. గుర్తు తెలియని హ్యాకర్లు ఈ సైబర్ దాడికి పాల్పడ్డారని తెలిపింది. అయితే ఎంత మంది వినియోగదారులు..సైబర్ దాడికి గురయ్యారన్న విషయంపై మాత్రం మైక్రోసాఫ్ట్ స్పష్టతనివ్వలేదు.
డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆప్ సర్వీస్(DDoS) దాడులకు హ్యాకర్లు పాల్పడ్డారని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఆ దాడుల వల్ల కొన్ని సేవలు తాత్కాలికంగా ప్రభావితమయ్యాయని చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్వర్లపై సైబర్ దాడి చేసేందుకు హ్యాకర్లు యత్నించారని పేర్కొంది. అందుకు గాను VPNలను ఉపయోగించవచ్చని తెలిపింది. DDoS దాడులు ఒకేసారి అనేక కంప్యూటర్‌ల నుంచి ఒకేసారి పంపే డేటాతో నెట్‌వర్క్ ట్రాఫిక్‌ను పెంచుతాయి.
రష్యా హ్యాకర్ల పనేనా?
Microsoft Cyber Attack 2023 : సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్‌లో Anonymous Sudan పేరుతో ఉన్న గ్రూప్.. ఈ సైబర్ దాడులకు బాధ్యత వహించింది. మైక్రోసాఫ్ట్ సైట్లలో జంక్ ట్రాఫిక్‌ను పంపి సేవలకు అంతరాయం కలిగించామని పేర్కొంది. మైక్రోసాఫ్ట్‌పై సైబర్ దాడి చేసిన హ్యాకర్లు.. రష్యాకు చెందినవారుగా సెక్యూరిటీ నిపుణులు అనుమానిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ వంటి సాఫ్ట్వేర్ దిగ్గజంపై సైబర్ దాడి జరిగితే.. దాని ప్రభావం మిలియన్ల మందిపై పడుతుందని భద్రతా నిపుణులు అంటున్నారు.
మైక్రోసాఫ్ట్ తగిన సమాచారం ఇవ్వకపోతే..
"మైక్రోసాఫ్ట్ తగిన సమాచారం ఇవ్వకపోతే.. ఈ సైబర్ దాడి ప్రభావం ఎంత ఉందో చెప్పడానికి మాకు ఎలాంటి మార్గం లేదు. ఔట్‌లుక్ ప్లాట్‌ఫామ్ ఇంతలా దాడికి గురి కావడం గతంలో నేను ఎప్పుడూ చూడలేదు. సరైన సమాచారం ఇవ్వకపోవడం.. ఈ సైబర్ దాడి ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది" అని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు, అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జేక్ విలియమ్స్ అన్నారు.
జూన్ 5వ తేదీన సర్వీసులకు బ్రేక్..
Microsoft Server Down : జూన్ 5వ తేదీన మైక్రోసాఫ్ట్‌కు చెందిన మైక్రోసాఫ్ట్ 365 సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆ సమయంలో సుమారు 15 వేల మంది యూజర్లకు మైక్రోసాఫ్ట్‌కు చెందిన వర్డ్, ఎక్సెల్‌తోపాటు ఇతర సేవలు పనిచేయడం లేదని ఫిర్యాదు చేసినట్లు డౌన్ డిటెక్టర్ అనే వెబ్‌సైట్ పేర్కొంది. భారత్‌లో కూడా ఈ సేవలకు అంతరాయం కలిగినట్లు కొందరు యూజర్లు ట్వీట్ చేశారు. డౌన్‌డిటెక్టర్ వెల్లడించిన సమాచారం ప్రకారం ఔట్‌లుక్ పనిచేయడం లేదని 91 శాతం మంది, మైక్రోసాఫ్ట్ ఎక్స్చేంజ్ సేవలకు అంతరాయం కలిగిందని ఏడు శాతం మంది, షేర్‌పాయింట్ సరిగా పనిచేయడం లేదని రెండు శాతం ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది జనవరిలో కూడా భారత్ సహా పలు దేశాల్లో అవుట్‌లుక్, ఎంఎస్ టీమ్స్, అజ్యూర్, మైక్రోసాఫ్ట్ 365 వంటి సేవలకు అంతరాయం కలిగింది.