Credit score myths and facts : బ్యాంకులు లేదా రుణ సంస్థలు.. వ్యక్తుల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు, వారి క్రెడిట్ స్కోర్‌ని పరిశీలిస్తాయి. ముఖ్యంగా వక్తుల ఆదాయం ఎంత ఉంది? తీసుకున్న రుణాలకు సకాలంలో వాయిదాలు చెల్లిస్తున్నారా? లేదా? మొదలైన విషయాలను చాలా కచ్చితంగా చూస్తాయి. అందుకే రుణ వాయిదాలు, క్రెడిట్ కార్డు బిల్లులు సకాలంలో చెల్లించాలి. కానీ చాలా మంది ఈ విషయాల్లో చాలా ఉదాసీనంగా ఉంటారు. ముఖ్యంగా వారు క్రెడిట్ స్కోర్ పట్ల చాలా సందేహాలు, అపోహలు కలిగి ఉంటారు. అందులో క్రెడిట్ స్కోర్ గురించి వాస్తవాలు ఏమిటో తెలుసుకుందాం!
క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే రుణాలు ఇస్తారా?
Factors that affect credit score : క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేసే అంశాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా ఒక వ్యక్తికి రుణం ఇవ్వాలా? లేదా? అని నిర్ణయించేందుకు బ్యాంకులు కచ్చితంగా క్రెడిట్ స్కోర్‌ను చూస్తాయి. సాధారణంగా బ్యాంకులు లేదా రుణ సంస్థలు.. లోన్ తీసుకున్నవారి పూర్తి సమాచారాన్ని క్రెడిట్ బ్యూరోలకు ఇస్తుంటాయి. అప్పటి నుంచి క్రెడిట్ బ్యూరోలు.. రుణ గ్రహీత సకాలంలో లోన్ వాయిదాలు, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లిస్తున్నాడా? లేదా? అనే విషయాలను.. అతని క్రెడిట్ హిస్టరీలో నమోదు చేస్తూ ఉంటాయి. సకాలంలో చెల్లిస్తూ ఉంటే, అతని క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది.. లేదంటే తగ్గుతుంది. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నవారికి బ్యాంకులు రుణాలు మంజూరు చేయవు.
తరచూ తనిఖీ చేస్తుంటే.. క్రెడిట్ స్కోర్ తగ్గుతుందా?
వాస్తవానికి మీరు మీ క్రెడిట్ స్కోర్‌ను తరచూ తనిఖీ చేసుకోవచ్చు. దీని వల్ల మీ క్రెడిట్ స్కోర్‌పై, రుణ చరిత్రపై ఎలాంటి ప్రభావం పడదు. వాస్తవానికి సిబిల్ లాంటి క్రెడిట్ బ్యూరోల నుంచి సంవత్సరానికి ఒకసారి పూర్తి ఉచితంగా బేసిక్ క్రెడిట్ స్కోర్‌ను పొందవచ్చు. అలాగే ఇప్పుడు చాలా ఆన్లైన్ వేదికల్లో కూడా ఉచితంగా క్రెడిట్ స్కోర్ నివేదికలు పొందే అవకాశం లభిస్తోంది. వాస్తవానికి ఇలా తరచుగా క్రెడిట్ స్కోర్ తనిఖీ చేసుకోవడం వల్ల మీ రుణ చరిత్రపై ఎలాంటి ప్రభావం ఉండదు. కానీ, రుణదాతలు మీ క్రెడిట్ స్కోర్‌ను అధికారికంగా తనిఖీ చేసినప్పుడు మాత్రం మీ స్కోర్ స్వల్పంగా తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, మీరు ఒక సారి రుణం కోసం దరఖాస్తు చేస్తే, బ్యాంకులు దానిపై ఎంక్వైరీ చేస్తాయి. అదే మీరు చాలా బ్యాంకుల్లో, చాలా సార్లు రుణాల కోసం దరఖాస్తు చేస్తే, అప్పుడు మీ క్రెడిట్ స్కోర్ బాగా తగ్గిపోతుంది. అందువల్ల ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఆదాయం తక్కువగా ఉంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుందా?
Does your income affect your credit score : క్రెడిట్ స్కోర్‌కు, ఆదాయానికి అసలు ఏమాత్రం సంబంధం ఉండదు. అందువల్ల మీ ఆదాయం అనేది మీ క్రెడిట్ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం చూపించదు. వాస్తవానికి బ్యాంకులు లేదా రుణసంస్థలు.. మీరు తీసుకున్న రుణంపై.. సకాలంలో వాయిదాలు చెల్లిస్తున్నారా? లేదా? అనేది మాత్రమే చూస్తాయి. మీకు ఎంత ఆదాయం వస్తోందన్న అంశాన్ని అవి పట్టించుకోవు. సకాలంలో వాయిదాలు చెల్లిస్తూ ఉంటే, మీ క్రెడిట్ స్కోర్ కచ్చితంగా పెరుగుతుంది.