తెలంగాణ

telangana

ETV Bharat / business

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ vs బ్యాంక్‌ ఎఫ్‌డీ.. రెండింట్లో ఏది బెటర్‌..? - బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌

సాధారణంగా మహిళలు, చిన్నారుల పేరున ఎక్కువగా పొదుపు చేస్తుంటారు. అటువంటి వారికోసం రకరకాల పొదుపు మార్గాలు, పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీరికోసం కేంద్ర ప్రభుత్వం అనేక ప్రత్యేక పొదుపు పథకాలను అందుబాటులోనికి తెచ్చింది. తాజాగా మరో కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్రం. 2023-24 బడ్జెట్​లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మహిళలు, బాలికల కోసం ప్రత్యేక పొదుపు పథకాన్ని తీసుకువచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్​లో పొదుపు చేస్తే ఎక్కువ వడ్డీ వస్తుందో.. బ్యాంక్​లు అందిస్తున్న ఫిక్సిడ్​ డిపాజిట్​ల్లో పొదుపు చేస్తే ఎక్కువ వడ్డీ వస్తుందో తెలుసుకుందామా మరి..!

mahila Samman Saving Certificate Scheme
mahila Samman Saving Certificate Scheme

By

Published : Feb 8, 2023, 10:10 PM IST

'ఆజాదీకా అమృత్‌ మహోత్సవం'లో భాగంగా మహిళలు, బాలికల కోసం ప్రత్యేకంగా కొత్త చిన్న మొత్తాల పొదుపు పథకాన్ని2023-24 బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. 'మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్' పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకం 2023 ఏప్రిల్‌ నుంచి 2025 మార్చి వరకు రెండేళ్లపాటు అందుబాటులో ఉండనుంది. ఈ నేపథ్యంలో పథకానికి సంబంధించిన ఫీచర్లతో పాటు, మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సరిఫికేట్లు, బ్యాంకు ఎఫ్‌డీ.. ఈ రెండింటిలో ఎందులో మదుపు చేయడం ద్వారా ఎక్కువ ప్రయోజనం లభిస్తుందో చూద్దాం..

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఫీచర్లు..
అర్హత:మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్లను మహిళలు లేదా బాలికల పేరుపై మాత్రమే తీసుకునే వీలుంది.

డిపాజిట్‌ పరిమితులు:ఈ పథకంలో గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్‌ చేయవచ్చు. కనీస మొత్తం పేర్కొనలేదు.

కాలపరిమితి:ఈ పథకానికి రెండేళ్ల కాలపరిమితి ఉంటుంది. ఈ పథకం రెండేళ్లపాటు అంటే 2023 ఏప్రిల్‌ నుంచి 2025 మార్చి వరకు అందుబాటులో ఉంటుంది.

వడ్డీ రేటు:ఈ పథకానికి 7.50% స్థిర వడ్డీ రేటును ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం చిన్న మొత్తాల పొదుపు పథకాలలో బాలికల కోసం ఉద్దేశించిన సుకన్య సమృద్ధి యోజన పథకానికి 7.60%, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ కోసం 8% వడ్డీ రేటు లభిస్తోంది. ఈ రెండు పథకాల తర్వాత అధిక వడ్డీ రేటు ఇస్తున్న పథకం ఇదే కావడం విశేషం.

ప్రీ-మెచ్యూర్‌ విత్‌డ్రా:పథకంలో పాక్షిక ఉపసంహరణలను ప్రభుత్వం అనుమతించింది. అయితే, ఏ విధంగా వర్తిస్తాయనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.

పన్ను ప్రయోజనాలు:సాధారణంగా బాలికల కోసం అందించే సుకన్య సమృద్ధి యోజన వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలకు సెక్షన్‌ 80సి కింద మినహాయింపు లభిస్తుంది. కానీ, ఈ పథకానికి పన్ను మినహాయింపు గురించిన వివరాలు పేర్కొనలేదు.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఎలా తెరవాలి?

  • ఈ పథకం 2023 ఏప్రిల్‌ 1 నుంచి అందుబాటులోకి వస్తుంది.
  • మీ సమీపంలోని బ్యాంక్‌ లేదా పోస్టాఫీసును సందర్శించి మహిళా సమ్మాన్‌ బచత్‌ పత్ర యోజన ఫారంను తీసుకోవాలి.
  • వ్యక్తిగత, ఆర్థిక, నామినేషన్‌ వివరాలను అందించి దరఖాస్తు పూర్తి చేయాలి.
  • గుర్తింపు, చిరునామా రుజువు కోసం అవసరమైన పత్రాలను దరఖాస్తు ఫారంతో పాటు సమర్పించాలి.
  • డిపాజిట్‌ మొత్తాన్ని ఎంచుకుని, నగదు లేదా చెక్కు ద్వారా డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.
  • పెట్టుబడికి రుజువుగా సర్టిఫికెట్‌ను ఇస్తారు. దీన్ని తీసుకోవాలి.

ఎంత వడ్డీ వస్తుంది?
రెండేళ్ల పాటు ఈ పథకం గరిష్ఠ పరిమితి రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెడితే.. ఏడాదికి 7.50% వడ్డీ చొప్పున మొదటి సంవత్సరంలో రూ.15,000, రెండో సంవత్సరంలో రూ.16,125.. మొత్తంగా రూ.31,125 వడ్డీ పొందొచ్చు.

సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ vs బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌..
వడ్డీ రేట్లు:భారతీయ అతిపెద్ద బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఇండియా ప్రస్తుతం రెండేళ్ల కాలపరిమితి గల ఎఫ్‌డీలపై 6.75% వడ్డీ ఇస్తోంది. అలాగే, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కోటక్‌ మహీంద్రా వంటి కొన్ని బ్యాంకులు ఇదే కాలపరిమితి గల డిపాజిట్లపై 7% వరకు వడ్డీని ఆఫర్‌ చేస్తున్నాయి. అంటే, కొన్ని పెద్ద బ్యాంకులు ఎఫ్‌డీపై అందించే వడ్డీ రేటు కంటే మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ 0.50% నుంచి 1% ఎక్కువ వడ్డీనే అందిస్తోంది.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ వంటి కొన్ని బ్యాంకులు రెండేళ్ల కాలపరిమితి గల డిపాజిట్లపై 7.50% వడ్డీ ఆఫర్‌ చేస్తుండగా.. కొన్ని స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు 8% వడ్డీని కూడా ఆఫర్‌ చేస్తున్నాయి.

డిపాజిట్‌ పరిమితి:మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ డిపాజిట్లకు రూ.2 లక్షల గరిష్ఠ పరిమితి ఉంది. అందువల్ల అంత మొత్తం మాత్రమే డిపాజిట్‌ చేయగలం. బ్యాంకు ఎఫ్‌డీల్లో ఎంతైనా డిపాజిట్‌ చేయవచ్చు.

రిస్క్‌ ఉండదు:మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ అనేది ప్రభుత్వ మద్దతు ఉన్న పొదుపు పథకం. కాబట్టి, అసలు, వడ్డీ మొత్తాలకు భద్రత ఉంటుంది. ఎటువంటి నష్టభయం ఉండదు. అయితే, బ్యాంకు ఎఫ్‌డీలకు కొద్దిపాటి రిస్క్‌ ఉంటుంది. అయితే, ఆర్‌బీఐ డిపాజిట్‌ ఇన్సురెన్స్‌ ప్లాన్‌ వర్తించే బ్యాంకుల్లో రూ.5 లక్షల వరకు బీమా సదుపాయం ఉంటుంది. ఇటువంటి బ్యాంకులను ఎంచుకుంటే రిస్క్‌ తగ్గించుకోవచ్చు.

ABOUT THE AUTHOR

...view details