గృహరుణం 15, 20 ఏళ్లు కొనసాగే ఒక దీర్ఘకాలిక అప్పు. ఈ వ్యవధిలో ఎన్నోసార్లు వడ్డీ రేట్లు పెరుగుతుంటాయి. తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు పెరుగుతున్న వడ్డీ రేట్లతో కొత్తగా రుణం తీసుకునే వారికి ఈఎంఐ భారం అవుతుంది. ఇప్పటికే రుణం తీసుకున్న వారికి వాయిదా మొత్తంలో మార్పు ఉండదు. వ్యవధి మాత్రం ఏళ్లకు ఏళ్లు పెరుగుతుంది. ఇలా గడువు అధికం కావడం వల్ల రుణవిముక్తులు కావడం అంత తేలిక కాదు. కాబట్టి, నిర్ణయించుకున్న వ్యవధిలోపే ఈ రుణాన్ని తీర్చేందుకు ప్రయత్నించాలి.
అవసరం ఉన్నంతే..
గృహరుణం తీసుకున్నప్పుడు చాలామంది తాము ఎంత ఈఎంఐ చెల్లించగలం అన్నది నిర్ణయించుకొని, ఆ మేరకు అప్పు తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కొన్నిసార్లు కాస్త అధిక రుణం కోసమూ చూస్తుంటారు. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు దీనివల్ల ఇబ్బందేమీ లేదు. అధిక వడ్డీ రేట్ల మార్కెట్లో రుణ మొత్తం నిర్ణయించుకునేటప్పుడు కాస్త ఆచితూచి అడుగులు వేయాలి. వాస్తవానికి ఎంత రుణం అవసరం అన్నది చూసుకోండి. మీ దగ్గర చేతిలో ఉన్న డబ్బు, తక్కువ వడ్డీ ఆర్జించే పెట్టుబడి పథకాల్లో ఉన్న మొత్తం, ఇతరులకు ఇచ్చిన చేబదుళ్లు ఇలా అందుబాటులో ఉన్న డబ్బును ఇంటి కొనుగోలుకు ఉపయోగించాలి. ఆ తర్వాత మిగిలిన మొత్తానికే రుణం తీసుకోవాలి.
వాయిదా పెంచండి..
గృహరుణం తీసుకున్నప్పటి ఆదాయంతో పోలిస్తే.. ఇప్పుడు అధికంగా ఆర్జిస్తూ ఉండొచ్చు. దీనికి అనుగుణంగా మీ ఈఎంఐని పెంచుకునేందుకు ప్రయత్నించండి. దీనివల్ల వడ్డీ భారాన్ని కొంత మేరకు తగ్గించుకునే వీలుంది. ఏడాదికి కనీసం 5 శాతం చొప్పున ఈఎంఐని పెంచుకుంటూ వెళ్లడం వల్ల తొందరగా రుణం తీరేందుకు అవకాశం ఉంటుంది.
అసలును చెల్లిస్తూ..
వడ్డీ పెరిగినప్పుడల్లా.. మీ రుణ వ్యవధి పెరగకుండా చూసుకునేందుకు మరో మార్గాన్నీ అనుసరించవచ్చు. ఈఎంఐని పెంచుకోకుండా సందర్భానుసారంగా అసలులో కొంత మొత్తం చెల్లిస్తూ ఉండాలి. ముఖ్యంగా బోనస్‌లాంటివి వచ్చినప్పుడు, ఇతర అనుకోని ఆదాయాలు లభించినప్పుడు వాటిని ఇంటి అప్పు తీర్చేందుకు వాడుకోవచ్చు. ప్రస్తుతం గృహరుణాలన్నీ దాదాపు 8-9 శాతం దగ్గరకు వచ్చాయి. డిపాజిట్లపై రాబడి ఈ స్థాయిలో రావడం లేదు. కాబట్టి, తక్కువ వడ్డీకి డిపాజిట్ చేసే బదులు ఆ మొత్తాలను రుణానికి చెల్లించడమే ఉత్తమమని చెప్పొచ్చు. ఉదాహరణకు.. మీ గృహరుణంపై వార్షిక వడ్డీ 8.55 శాతం అనుకుందాం. బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7 శాతం రాబడి వస్తుందనుకుందాం. 20 శాతం పన్ను శ్లాబులో ఉంటే నికర వార్షిక రాబడి 5.6 శాతం మాత్రమే. అందువల్ల గృహరుణానికి ఆ డబ్బును చెల్లించడమే లాభం. ఏడాదికి కనీసం 4 ఈఎంఐలు అదనంగా లేదా అసలులో 5-10 శాతం చెల్లించేందుకు ప్రయత్నించండి.