Long Term Debt Mutual Funds: దీర్ఘకాలిక డెట్ మూచ్యువల్ ఫండ్ పథకాలకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సాధారణంగా ఇన్‌కమ్ ఫండ్లు, గిల్డ్ ఫండ్లు, డైనమిక్ బాండ్ ఫండ్లను దీర్ఘకాలిక డెట్ మ్యూచువల్ ఫండ్లుగా పరిగణిస్తారు. ఈ ఫండ్ల సగటు కాల వ్యవధి (మెచ్యూరిటీ పీరియడ్) మూడేళ్ల కంటే ఎక్కువగా ఉంటోంది. ఇవి ప్రధానంగా ప్రభుత్వం జారీ చేసే బాండ్లు, ట్రెజరీ బిల్స్, కార్పొరేట్ సంస్థల బాండ్లు, బ్యాంకులు జారీ చేసే బాండ్లలో పెట్టుబడులు పెడతాయి. వడ్డీరేట్లలో వచ్చే మార్పులకు ఈ ఫండ్ల ఎన్‌ఏవీ (నెట్ అస్సెట్ వాల్యూ) ప్రభావితం అవుతుంది. వడ్డీ రేట్లు తగ్గుతుంటే దీర్ఘకాలిక డెట్ మూచ్యువల్ ఫండ్ల ఎన్‌ఏవీ పెరుగుతుంది. అదే వడ్డీ రేట్లు పెరుగుతుంటే ఎన్‌ఏవీ తగ్గుతుంది.
మనదేశంతో పాటు అంతర్జాతీయంగా వచ్చే కొంతకాలం పాటు వడ్డీరేట్లు ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో దీర్ఘకాలిక డెట్ మ్యూచువల్ ఫండ్ పథకాల ఎన్‌ఏవీలు తగ్గే అవకాశం లేకపోలేదు. అందుకే మదుపరులు ఈ ఫండ్ల విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించటం మేలు. దీర్ఘకాలిక డెట్ ఫండ్లలో కొత్తగా పెట్టుబడులు పెట్టటానికి ఇది సరైన సమయమూ కాదు. అదే సమయంలో ఇప్పటికే ఇటువంటి పథకాల్లో ఉన్న పెట్టుబడులను తొందరపడి వెనక్కి తీసుకోవటమూ సరికాదు. పరిస్థితులు ఎలా మారతాయనేది అంచనా వేస్తూ, తదనుగుణంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.