Life Insurance Benefits At Early Age :ఒక కుటుంబానికి ఆహారం, దుస్తులు, నివాసం ఎంత అవసరమో.. జీవిత బీమా, ఆరోగ్య బీమా కూడా అంతే అవసరం. మరీ ముఖ్యంగా కుటుంబంలో సంపాదించే వారికి జీవిత బీమా, ఆరోగ్య బీమా కచ్చితంగా ఉండి తీరాలి. అప్పుడే ఆపద సమయంలో కుటుంబానికి ఆర్థికంగా చేయూత లభిస్తుంది. గతంలో చాలా మంది జీవిత బీమా విషయంలో నిర్లక్ష్యంగా ఉండేవారు. కానీ కరోనా సంక్షోభం తరువాత అందరూ బీమా అవసరాన్ని గుర్తించారు.
యువ భారత్
నేడు భారతదేశంలో యువ జనాభా అత్యధికంగా ఉంది. ముఖ్యంగా 35 ఏళ్లలోపు యువతీయువకులు దాదాపు 66 శాతం మంది ఉన్నారు. వీరిలో చాలా మంది కొత్తగా ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టి ఉంటారు. వీరిపై ఆధారపడి ఓ కుటుంబం ఉంటుంది. అయినా సరే జీవిత బీమా తీసుకోవడానికి వీరు ఇష్టపడరు. కానీ ఇది ఏ మాత్రం మంచిది కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
చిన్న వయస్సులోనే బీమా తీసుకుంటే..
Benefits Of Buying Health Insurance At Early Age : చిన్న వయస్సులోనే జీవిత బీమా, ఆరోగ్య బీమా తీసుకుంటే.. కట్టాల్సిన ప్రీమియంలు చాలా తక్కువగా ఉంటాయి. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఈ ప్రీమియం మొత్తం క్రమంగా పెరుగుతూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే.. యుక్త వయస్సులో ఉన్నవారికి చాలా వరకు ఆరోగ్యం బాగుంటుంది. ఆకస్మిక మరణాలు కూడా తక్కువగానే ఉంటాయి. అదే వయస్సు పెరుగుతున్న కొలదీ ఆరోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి. అందుకే బీమా కంపెనీలు యుక్త వయస్సులో ఉన్నవారికి తక్కువ ప్రీమియానికే బీమా సౌకర్యాలు కల్పిస్తూ ఉంటాయి. కనుక వీలైనంత వరకు అతి చిన్న వయస్సులోనే జీవిత బీమా, ఆరోగ్య బీమా తీసుకోవడం ఉత్తమం.
ఉదా: 25 ఏళ్ల వయస్సు గల ఒక వ్యక్తి 20 ఏళ్ల కాలపరిమితితో రూ.1 కోటి విలువైన టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే, వార్షిక ప్రీమియంగా దాదాపు రూ.10,500 వరకు చెల్లించాలి. 30 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి పాలసీ తీసుకుంటే దాదాపు రూ.13,800 వరకు చెల్లించాల్సి వస్తుంది. అదే అతను 40 ఏళ్లకు పాలసీ తీసుకుంటే రూ.21,500 వరకు చెల్లించాలి. అదే 50 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఆగి పాలసీ తీసుకుంటే వార్షిక ప్రీమియం దాదాపు రూ.37,000 వరకు చెల్లించవలసి ఉంటుంది.
గ్రూప్ ఇన్సూరెన్స్
Group Insurance Benefits To Employees : కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తూ ఉంటాయి. ఇది కొంత వరకు ఆర్థిక రక్షణను కల్పిస్తుంది. అయితే, ఈ ఆర్థిక భద్రత అనేది సదరు కంపెనీలో పనిచేసే వరకు మాత్రమే ఉంటుందని మీరు గుర్తుంచుకోవాలి. మీరు ఉద్యోగం మారినప్పుడు, ఈ కవరేజ్ అనేది లేకుండా పోతుంది.