కొత్త ఏడాదిలో స్టాక్ మార్కెట్‌పై నిపుణుల అంచనాలు
గత ఏడాదిలో (2022) స్టాక్ మార్కెట్ తీవ్రమైన హెచ్చుతగ్గులతో మదుపరులను ఇబ్బంది పెట్టింది. డిఫెన్స్, బ్యాంకింగ్ రంగాలకు చెందిన కంపెనీల షేర్లు ఆకర్షణీయమైన ప్రతిఫలాన్ని ఇవ్వగా, ఐటీ, ఫార్మా రంగాలకు చెందిన షేర్లు చుక్కలు చూపించాయి. అదే సమయంలో స్మాల్, మిడ్‌క్యాప్ తరగతికి చెందిన షేర్లలో 'కరెక్షన్' ఎంతో అధికంగా కనిపించింది. ఎఫ్‌ఐఐలు, దేశీయ సంస్థాగత మదుపరుల మద్దతుతో సూచీలు మాత్రం గౌరవప్రదమైన స్థాయిలోనే నిలిచాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 18,105 పాయింట్లు, బీఎస్‌ఈ సెన్సెక్స్ 60,840 పాయింట్ల వద్ద ముగిశాయి. ద్రవ్యోల్బణం, ముడి చమురు ధర, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, రూపాయి బలహీనత, ద్రవ్య లోటు... ప్రధాన సవాళ్లుగా నిలిచాయి. కానీ కొత్త ఏడాదిపై మాత్రం స్టాక్ మార్కెట్ నిపుణులు ఆశాభావంతో ఉన్నారు. చైనా కష్టాల్లో ఉన్నందున ఆ మేరకు మనదేశానికి అవకాశాలు అందివస్తాయనేది ఒక అభిప్రాయం కాగా, ద్రవ్యోల్బణం- వడ్డీరేట్లు దిగవస్తాయని, అదే సమయంలో దేశీయ వినియోగం ఎంతో ఆకర్షణీయంగా ఉన్నందున ఆ మేరకు స్టాక్ మార్కెట్ పెట్టుబడులు లాభాలు పండిస్తాయని అంచనా వేస్తున్నారు.
ఐటీ, ఫార్మా రంగాలు ఆకర్షణీయం..
"కొత్త సంవత్సరంలో ఎన్నో ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఏమిటంటే..
ద్రవ్యోల్బణం దాదాపుగా గరిష్ఠ స్థాయికి చేరింది. ఇక్కడి నుంచి ద్రవ్యోల్బణం తగ్గటమే కానీ పెరిగే అవకాశం లేదు. ఇది స్టాక్‌మార్కెట్‌కు అనుకూలం.
ముడి చమురు బ్యారెల్ ధర 90- 100 డాలర్ల శ్రేణిలో ఉండిపోతుంది.
- చైనా ఆర్థికంగా ఇంకా కుంగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. చైనా ఆర్థిక వ్యవస్థ మందగించడం అంటే, భారత ఆర్థిక వ్యవస్థకు మేలు జరిగినట్లే.
- ప్రస్తుతం యూఎస్ ఆర్థిక వ్యవస్థ ఒత్తిడికి గురవుతున్నప్పటికీ, త్వరలోనే తేరుకుంటుంది. 2022 కంటే అధిక వృద్ధిని నమోదు చేస్తుంది.
- డాలర్- రూపాయి మారకం విలువ రూ.80 వద్ద స్ధిరపడుతుంది.
ఈ పరిస్థితుల్లో అత్యున్నతమైన ప్రమాణాలు పాటించే కంపెనీలపై పెట్టుబడి మంచి ప్రతిఫలాన్ని ఇస్తుంది. ముఖ్యంగా 2022లో బాగా 'కరెక్షన్'కు గురైన ఐటీ, ఫార్మా రంగాలకు చెందిన షేర్లు కొత్త ఏడాదిలో అధిక ప్రతిఫలాన్ని ఇచ్చే అవకాశం ఉంది."
--సునీల్ దమానియా, ఛీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, మార్కెట్స్‌మోజో.
కొత్త ఏడాది 'థీమ్- 3 సి'.
"స్వల్పకాలంలో ప్రపంచవ్యాప్త పరిణామాల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై ఉంటుంది. దీనివల్ల హెచ్చుతగ్గులు అనివార్యం. కాకపోతే 2-3 ఏళ్ల కాలానికి నాణ్యమైన పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో నిర్మించుకోదలచిన వారికి ప్రస్తుతం ఎంతో మెరుగైన అవకాశం ఉంది. తద్వారా దీర్ఘకాలిక సంపద సృష్టించవచ్చు. కొత్త ఏడాదికి ప్రధానంగా '3 సి' థీమ్- క్రెడిట్, కేపెక్స్, కన్జమ్షన్... మేలైనది. దీనికి అనుగుణంగా బ్యాంకులు- ఆర్థిక సంస్థలు, ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్- బిల్డింగ్ మెటీరియల్స్, వాహన- వాహన విడి భాగాలు.. తదితర విభాగాలకు చెందిన కంపెనీలు ఆకర్షణీయమైన ప్రతిఫలాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా వడ్డీరేట్లు దాదాపుగా గరిష్ఠ స్థాయికి చేరిన ప్రస్తుత పరిస్థితుల్లో డెట్ ఫండ్లు కూడా పెట్టుబడికి అనుకూలంగా కనిపిస్తున్నాయి."
--సంజీవ్ హోతా, హెడ్- రీసెర్చ్, షేర్‌ఖాన్.
పసిడికి గిరాకీ కొనసాగొచ్చు
అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితుల ప్రభావం పూర్తిగా తొలగిపోనందున.. 2023లోనూ పసిడి ముందుకే వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సురక్షిత పెట్టుబడి సాధనాల వైపు మదుపర్లు మొగ్గు చూపే అవకాశం ఉండటంతో పసిడికి గిరాకీ కొనసాగొచ్చని చెబుతున్నారు. భారత విపణుల్లో 10 గ్రాముల పసిడి రూ.60,000ను తాకొచ్చని అంచనా వేస్తున్నారు.
కొన్ని ఇతర రంగాలపై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ అంచనాలు ఇలా..
- స్వల్ప, మధ్యకాలిక వ్యవధిలో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగం పనితీరు బాగుంటుందనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రైవేటు బ్యాంకుల ఫలితాలు ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది.
- గత రెండు త్రైమాసికాలను పరిశీలిస్తే.. రుణాలకు గిరాకీ పెరుగుతోంది. ఇది వచ్చే ఆర్థిక సంవత్సరమూ కొనసాగుతుంది. రిటైల్ క్రెడిట్ ఇప్పటికే బలంగా ఉండటం, హోల్‌సేల్ క్రెడిట్ పెరగడం ప్రారంభం అవుతుందని పరిశ్రమ ఆశిస్తోంది. దీనివల్ల బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు వృద్ధి సాధిస్తాయి.
- డిపాజిట్లపై వడ్డీ రేటు పెరుగుతుండటం వల్ల బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్లపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. 2023లో రుణాలను అధికంగా ఇచ్చే సంస్థలు నిఫ్టీ సూచీని నడిపిస్తాయి.
- బీమా రంగంలోనూ స్థిరమైన వృద్ధికి అవకాశాలు కనిపిస్తున్నాయి.