సాధారణంగా కుటుంబ సభ్యులు పొదుపు కోసం లేదా ఏదైన స్వల్పకాలిక ఆర్థిక లక్ష్య సాధన కోసం జాయింట్ బ్యాంకు అకౌంట్లను తెరుస్తారు. వ్యాపార భాగస్వాములు అయితే వ్యాపార నిర్వహణ కోసం ఉమ్మడి బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేస్తారు. ఇతర రెగ్యులర్ ఖాతాల మాదిరే ఇక్కడా పొదుపు ఖాతాతో పాటు లోన్ అకౌంట్, మార్జిగేజ్ అకౌంట్ ఇలా కొన్ని రకాల ఉమ్మడి ఖాతాలను తెరవచ్చు. ఈ ఖాతా ప్రారంభించేందుకు భాగస్వామ్యులు ఇద్దరు తప్పనిసరిగా బ్యాంకు శాఖలో హాజరు కావాల్సి ఉంటుంది. అయితే, జాయింట్ అకౌంట్‌తో ప్రయోజనాలతో పాటు ఇబ్బందులు కూడా ఉంటాయి. అవేంటి? వాటిని ఎలా పరిష్కరించుకోవాలో? ఓ సారి తెలుసుకుందాం.
తలెత్తె ఇబ్బందులు..
జాయింట్ అకౌంట్ కలిగిన వారిలో ఇద్దరిలో ఒకరికి ఎక్కువ ఖర్చు చేసే అలవాటు ఉంటే అప్పుడు సమస్యలు మొదలవుతాయి. అనేక కారణాల వల్ల.. ఇతరత్రా భావోద్వేగాల వల్ల ఎవరైనా అకౌంట్లోని డబ్బులను ఖాళీ చేయొచ్చు. అందుకే ఉమ్మడి ఖాతాను జాగ్రత్తగా నిర్వహించడం చాలా అవసరం. అయితే ఇరు వ్యక్తుల మధ్య వివాదం తలెత్తితే జాయింట్ అకౌంట్ సమస్యాత్మకంగా మారుతుంది. ఇద్దరి మధ్య నెలకొనే ఏదో ఒక వివాదం జాయింట్ ఖాతాలో నిధుల నిర్వహణను కష్టతరం చేస్తుంది. అలాంటప్పుడు ఖాతాదారులు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. పరస్పరం అంగీకరించే విధానాన్ని ఎంచుకొని పరిష్కారానికి ప్రయత్నించాలి. బ్యాంకుల్లో ఉమ్మడి ఖాతా నిధులపై వివాదం తతెత్తితే పరిస్థితిని చక్కదిద్దడానికి కింది దశలను అమలు చేయొచ్చు. అవేంటంటే?
మధ్యవర్తి సాయం..
వివాదాన్ని ఇరువురు సామరస్యంగా పరిష్కరించుకోకపోతే.. మధ్యవర్తి సాయం తీసుకోవడం మంచిది. స్నేహితుడు గానీ, కుటుంబానికి చెందిన మరో వ్యక్తి గానీ ఇక్కడ మధ్యవర్తిగా వ్యవహరించొచ్చు. ఇలా సమస్యను పరిష్కరించుకోవాలి.
న్యాయ నిపుణుల సలహా..
మధ్యవర్తిత్వం విఫలమైతే.. న్యాయ సలహా కోరడం అవసరం కావచ్చు. వివాదానికి సంబంధించి చట్టపరమైన చిక్కులను అర్థం చేసుకోవడానికి, పరిష్కరించడానికి అవకాశాలను అన్వేషించడానికి బ్యాంకింగ్, ఫైనాన్స్ చట్టాల్లో నైపుణ్యం కలిగిన న్యాయవాదిని సంప్రదించడం ఉత్తమం.