తెలంగాణ

telangana

ETV Bharat / business

'మోదీ సర్కారు నుంచి ఒత్తిడి'.. ట్విట్టర్ మాజీ సీఈఓ సంచలన ఆరోపణలు.. కేంద్ర మంత్రి ఫైర్

Jack Dorsey On Indian Government : భారత ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు ట్విట్టర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే. సాగు చట్టాలపై ఆందోళనల జరిగిన సమయంలో భారత ప్రభుత్వం నుంచి తమకు ఒత్తిడి ఎదురైందని ఆరోపించారు. ఈ ఆరోపణలను కేంద్ర సాంకేతిక, సమాచార శాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ కొట్టిపారేశారు.

Jack Dorsey On Indian Government
Jack Dorsey On Indian Government

By

Published : Jun 13, 2023, 11:07 AM IST

Updated : Jun 13, 2023, 12:23 PM IST

Jack Dorsey On Indian Government : సాగు చట్టాలపై ఆందోళనల జరిగిన సమయంలో భారత ప్రభుత్వం నుంచి తమకు ఒత్తిడి ఎదురైందంటూ ట్విట్టర్‌ మాజీ సీఈఓ జాక్‌ డోర్సే చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. డోర్సే చెబుతున్న విషయాలు పచ్చి అబద్ధాలని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ కొట్టిపారేశారు. ట్విట్టర్ చరిత్ర నుంచి చాలా సందేహాస్పద కాలాన్ని తొలగించే ప్రయత్నంలో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజీవ్‌ ట్వీట్ చేశారు. భారత సార్వభౌమాధికారాన్ని అంగీకరించలేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

జాక్​ డోర్సే ఏమన్నారంటే?
ఓ టీవీ ఛానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు ట్విట్టర్​ మాజీ సీఈఓ జాక్​ డోర్సే. ఏ ప్రభుత్వం నుంచైనా మీకు ఒత్తిళ్లు ఎదురయ్యాయా అని వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఆయన భారత్‌ను ఉదహరణగా చెప్పారు. భారత్​లో సాగు చట్టాలపై రైతు ఆందోళనలు జరుగుతున్న క్రమంలో మోదీ సర్కారు నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నామని వెల్లడించారు. రైతులు, జర్నలిస్టుల అకౌంట్ల కంటెంట్​ను తొలగించాలంటూ అనేక అభ్యంతరాలు పెట్టారని వివరించారు. ఒక దశలో ట్విట్టర్‌ను భారత్‌లో మూసేస్తామని కూడా బెదిరించినట్లు ఆయన ఆరోపించారు. అలాగే ట్విట్టర్‌ ఉద్యోగుల ఇళ్లలో తనిఖీలు చేస్తామని కూడా అన్నారని చెప్పుకొచ్చారు. అయితే, ఇలాంటి బెదిరింపులు ఎవరి నుంచి వచ్చాయనే దానిపై మాత్రం డోర్సే ఎలాంటి ఆధారాలను బయటపెట్టలేదు.

Rajeev Chandrasekhar Twitter : ఈ నేపథ్యంలో జాక్‌ డోర్సే ఆరోపణలను రాజీవ్‌ చంద్రశేఖర్‌ తీవ్రంగా ఖండించారు. డోర్సే ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పారు. ఆయన హయాంలో ట్విట్టర్‌.. భారత చట్టాలను అనేకసార్లు ఉల్లంఘించిందని స్పష్టం చేశారు. 2020- 2022 మధ్య పదే పదే నిబంధనలను అతిక్రమించారని వెల్లడించారు. జూన్‌ 2022 తర్వాతే ట్విట్టర్‌ భారత నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవడం ప్రారంభించిందని చెప్పారు. డోర్సే ఆరోపించినట్లుగా ఎవరిపైనా తనిఖీలు చేయలేదని.. ట్విట్టర్‌ను మూసివేయనూ లేదని స్పష్టం చేశారు. భారత సార్వభౌమత్వాన్ని అంగీకరించడానికి డోర్సే హయాంలోని ట్విట్టర్‌ విముఖత వ్యక్తం చేసిందని తెలిపారు.

"దేశీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలన్నీ ఇక్కడి చట్టాలను అమలు చేసేలా చూసే హక్కు ఓ సార్వభౌమ దేశంగా భారత్‌కు ఉంది. 2021 జనవరిలో జరిగిన రైతుల ఆందోళన సమయంలో అనేక దుష్ప్రచారాలు చక్కర్లు కొట్టాయి. వాటిలో నరమేధంలాంటి తీవ్రమైన అసత్య ప్రచారాలు కూడా ఉన్నాయి. అలాంటి తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా భారత ప్రభుత్వం బాధ్యత తీసుకొంది. లేదంటే పరిస్థితులు మరింత దిగజారి ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలు ఉండేవి. ఇలాంటి ఘటనలే అమెరికాలో జరిగినప్పుడు మాత్రం తప్పుడు సమాచారాన్ని ట్విట్టర్‌ వెంటనే తొలగించింది. కానీ, భారత్‌కు వచ్చే సరికి మాత్రం వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి. డోర్సే హయాంలో ట్విట్టర్‌ అనుసరించిన పక్షపాత వైఖరికి ఇది నిదర్శనం. ట్విట్టర్‌ ఉద్యోగుల ఇళ్లపై తనిఖీలు జరగలేదు. ఎవరినీ జైలుకు కూడా పంపలేదు."
--రాజీవ్‌ చంద్రశేఖర్‌, కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి

డోర్సే హయాంలో ట్విట్టర్‌ కేవలం భారత చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 19లను సైతం విస్మరించిందని రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఆరోపించారు. అలాగే పక్షపాత వైఖరితో వ్యవహరిస్తూ అసత్య ప్రచారాలను తొలగించడానికి నిరాకరించిందని చెప్పారు. తద్వారా తప్పుడు సమాచారం ఆయుధాలుగా మారేందుకు దోహదం చేసిందని పేర్కొన్నారు.

మండిపడ్డ కాంగ్రెస్​
జాక్ డోర్సే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ మండిపడింది. ప్రజాస్వామ్యానికి తల్లి లాంటి భారతదేశంలో దానిని ఎలా హత్య చేస్తున్నారో అన్న విషయం ఇప్పుడు బయట పడిందని ఆరోపించింది. దిల్లీ సరిహద్దులో వర్షాలు, ఎండలు, చలికి తట్టుకుని రైతులు ఆందోళన చేస్తుంటే.. ప్రభుత్వం వారిని ఖలిస్థానీ, పాకిస్థానీ ఉగ్రవాదులుగా చిత్రీకరించిందని గుర్తుచేస్తూ విమర్శించింది.

ఇప్పుడు అర్థమైంది : టికాయత్​
మరోవైపు జాక్ డోర్సే వ్యాఖ్యలపై రైతు నేత రాకేశ్ టికాయత్​ సైతం మండిపడ్డారు. "రైతు ఆందోళనల సమయంలో ట్విట్టర్, ఫేస్​బుక్​ నుంచి సరైన స్పందన రావట్లేదని మాకు సమాచారం ఉంది. దీనిపై ఇప్పుడు స్పష్టత వచ్చింది. ప్రభుత్వ పెద్దలు వారి స్థాయిలో ఈ ఆందోళనల గురించి సోషల్ మీడియాలో సమాచారం వ్యాప్తి కాకుండా చూశారు. కానీ ఇప్పుడు ఆ సంస్థ మాజీ సీఈఓ క్లారిటీ ఇచ్చారు. ట్విట్టర్ లాంటి సంస్థలు ఎవరి ఒత్తిడిలకు తలొగ్గవు. భారత ప్రభుత్వమే అలాంటి (ఒత్తిడి) ప్రయత్నాలు చేసి ఉంటుంది" అని ఆయన చెప్పారు.

ఇవీ చదవండి :ట్విట్టర్ సీఈఓగా​ బాధ్యతలు స్వీకరించిన లిండా.. మరో వ్యక్తికి కీలక బాధ్యతలు

కంటెంట్​ క్రియేటర్స్​కు పండగే.. త్వరలో ట్విట్టర్​లో డబ్బులే డబ్బులు!

Last Updated : Jun 13, 2023, 12:23 PM IST

ABOUT THE AUTHOR

...view details