ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్.. భారత్‌లో బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ ఛార్జీలను వెల్లడించింది. ఆ సంస్థల మాతృసంస్థ 'మెటా' బుధవారం ఈ వివరాలను ప్రకటించింది. మొబైల్ యాప్‌లకు, డెస్క్‌టాప్ బ్రౌజర్లకు వేర్వేరుగా ధరలు నిర్ణయించింది. మొబైల్ యాప్ ద్వారా ఫేస్బుక్ వాడితే.. నెలకు రూ. 1450 చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. డెస్క్‌టాప్ బ్రౌజర్ల వినియోగదారులు నెలకు రూ. 1,099 చెల్లించాలని వెల్లడించింది.
ప్రస్తుతం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ స్టేట్స్‌లో మాత్రమే ఈ బ్లూటిక్ సౌకర్యం అందుబాటులో ఉంది. ప్రస్తుతం మెటా వెరిఫైడ్ సబ్స్క్రిప్షన్ కోసం వెయిటింగ్ లిస్ట్‌లో చేరేందుకు.. భారతీయ వినియోగదారులకు ఫేస్బుక్ అనుమతినిచ్చింది. బ్లూటిక్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఆ యూజర్లను సంస్థ గుర్తిస్తుందని తెలిపింది. వినియోగదారులు తమ ఖాతాల రక్షణ కోసం బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌ను వినియోగించుకోవాలని మెటా కోరింది. ఇప్పటికే ట్విట్టర్ బ్లూటిక్ కోసం చార్జీలు వసూలు చేస్తుండగా.. ఇప్పుడు అదే తరహాలో అడుగులు వేసిన మెటా.. బ్లూటిక్ తీసుకువచ్చి, చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది.
విదేశాల్లో బ్లూటిక్ చార్జీలు..
ఆపిల్ ఫోన్ వినియోగదారులు నెలకు రూ.991 (11.99 అమెరికన్ డాలర్లు), ఆండ్రాయిడ్ వినియోగదారులు రూ.1,239 (14.99 అమెరికన్ డాలర్లు) చెల్లించి వెరిఫైడ్ ఖాతాల కింద బ్లూటిక్‌ను పొందాలని గతంలో మెటా తెలిపింది. అంతకుముందు మెటా బ్లూటిక్ కోసం ఎటువంటి ఛార్జీలు వసూలు చేసేది కాదు. ఉచితంగానే ప్రముఖులు, వ్యాపారుల ఖాతాలకు వెరిఫైడ్ బ్లూటిక్ ఇచ్చేది. ఈ కొత్త ఫీచర్‌ను మెటా అందించే సేవల్లో కచ్చితత్వం, భద్రతను పెంచేందుకే తీసుకొస్తున్నామని సంస్థ తెలిపింది. గతంలో వెరిఫైడ్ అయిన ప్రముఖులు బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ తీసుకోనవసరం లేదని తెలిపింది. కాగా మెటా దాదాపు మొత్తం ఆదాయాన్ని ప్రకటనల ద్వారానే పొందుతుంది. అయితే కొవిడ్ అనంతరం ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ప్రకటనలు తగ్గాయి. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, ఉక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల మెటా సంస్థ వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది. అందుకే సంస్థను లాభాల్లో నడిపించేందుకు కొత్త నిర్ణయాలతో ముందుకొస్తుంది.
ట్విట్టర్ బ్లూ టిక్..
2022లో ట్విట్టర్ కూడా బ్లూటిక్ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ కోసం నెలకు 8 డాలర్లు వసూలు చేయనున్నట్లు తెలిపింది. ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసినప్పటి నుంచి అనుహ్య నిర్ణయాలతో సంస్థలో కీలక మార్చులు తీసుకువచ్చారు. భారీ స్థాయిలో ఉద్యోగులను సైతం తొలగించారు.