Indian Railway Super App :ట్రైన్ టికెట్ బుకింగ్, ట్రాకింగ్, ఫుడ్ డెలివరీ లాంటి సేవలన్నింటినీ ఒకేచోట అందించేందుకు ఇండియన్ రైల్వే సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఓ సూపర్ యాప్‌ను రూపొందించే పనిలో ఉంది.
రైల్వే సూపర్ యాప్
ప్రస్తుతం రైలు టికెట్ బుకింగ్ కోసం ఒక యాప్, ఫిర్యాదుల కోసం ఒక యాప్, జనరల్ టికెట్లు తీసుకోవడానికి ఇంకో యాప్ ఉన్నాయి. ఇవి కాకుండా పీఎన్ఆర్ స్టేటస్, ట్రైన్ రన్నింగ్ స్టేటస్‌లను తెలుసుకోవడానికి మరికొన్ని యాప్లు ఉన్నాయి. దీని వల్ల రైలు ప్రయాణికులకు తీవ్రమైన ఇబ్బంది కలుగుతోంది. అందుకే ఈ రైల్వే సేవలు అన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు భారతీయ రైల్వే (Indian Railways) సిద్ధమవుతోంది. అందులో భాగంగా ఓ సూపర్ యాప్‌ను రూపొందిస్తోంది.
ఒక్క యాప్ కోసం రూ.90 కోట్లు ఖర్చు
ఇండియన్ రైల్వేకు సంబంధించిన అన్ని రకాల సేవలను ఒకే చోట అందించడం ఈ సూపర్ యాప్ ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం రైల్వే శాఖ ఏకంగా రూ.90 కోట్లు వరకు వెచ్చించనున్నట్లు ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (CRIS) ఈ సూపర్ యాప్‌ను డెవలప్ చేస్తున్నట్లు తెలిసింది.