తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐరోపా దేశాలకు భారీగా ఔషధ ఎగుమతులు.. కలిసి రానున్న 'చైనా ప్లస్‌ వన్‌' విధానం - భారత ఫార్మా కంపెనీ వర్గాలు

ఐరోపా దేశాలకు ఔషధ ఎగుమతులు పెంచుకునే అవకాశం భారత్​కు లభించనుంది. ఇకపై చైనాపై ఆధారపడడాన్ని తగ్గించాలని ఐరోపా దేశాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఫార్మా పరిశ్రమ లాభపడనుంది.

China plus one strategy
చైనా ప్లస్ వన్

By

Published : Oct 18, 2022, 7:08 AM IST

మనదేశం నుంచి.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తర అమెరికా దేశాలకు జనరిక్‌ ఔషధాల ఎగుమతులు అధికం. ఐరోపా దేశాలది ఆ తర్వాత స్థానమే. కానీ ఇకపై ఐరోపా దేశాలకు ఔషధ ఎగుమతులు పెంచుకునే అవకాశం మనదేశానికి లభించనుంది. ఆ దేశాల్లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు దీనికి వీలుకల్పిస్తున్నట్లు ఫార్మా పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఐరోపా దేశాలు యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్‌ (ఏఐపీ) కోసం ఇంతకాలం చైనాపై అధికంగా ఆధారపడి ఉన్నాయి. అదే విధంగా జనరిక్‌ ఔషధాలు మనదేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకూ ఇదే పరిస్థితి. కానీ ఇకపై 'చైనా ప్లస్‌ వన్‌' విధానంలో భాగంగా చైనాపై ఆధారపడడాన్ని తగ్గించాలని ఐరోపా దేశాలు భావిస్తున్నాయి. అదేవిధంగా జనరిక్‌ ఔషధాలను అధికంగా కొనుగోలు చేయడం ద్వారా వైద్య వ్యయాల భారాన్ని బాగా తగ్గించుకోవాలని ఆలోచిస్తున్నాయి. ఇందుకు తగిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ మార్పులు మనదేశ ఫార్మా కంపెనీలకు కలిసి రానున్నట్లు పరిశ్రమ వర్గాల కథనం. దీనివల్ల ఐరోపా దేశాలకు ఔషధ ఎగుమతులు పెరుగుతాయని భావిస్తున్నారు.

ఏపీఐ ఔషధాల ఉత్పత్తి పెంపు: నాణ్యమైన ఔషధాలను తక్కువ ధరలో అందించడం మనదేశానికి ఉన్న ప్రత్యేకత. యూఎస్‌తో పాటు ఎన్నో దేశాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) జనరిక్‌ మందుల (ఫార్ములేషన్లు) కోసం మనదేశం నుంచి కొనుగోలు చేస్తున్నాయి. అందువల్ల ఐరోపా దేశాలు వైద్య ఖర్చులు తగ్గించుకోవాలంటే మనదేశం నుంచి అధికంగా మందులు కొనుగోలు చేయాల్సిందే. అంతేగాక తుది ఔషధాలకు తోడు, ఏపీఐ ఔషధాలను అధికంగా ఉత్పత్తి చేయడానికి ఇటీవల కాలంలో మనదేశానికి చెందిన ఫార్మా కంపెనీలు ప్రయత్నాలు చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం పీఎల్‌ఐ పథకాన్ని ఫార్మా పరిశ్రమకు వర్తింపజేయడానికి ప్రధాన కారణం ఏపీఐ ఔషధాల ఉత్పత్తిని మనదేశంలో పెంచాలనే. ఈ నేపథ్యం మనదేశం నుంచి ఐరోపాకు జనరిక్‌ ఔషధాలను అధికంగా ఎగుమతి చేయటంతో పాటు ఏపీఐ ఔషధాలకు సంబంధించి.. చైనా స్థానాన్ని మనదేశానికి చెందిన ఫార్మా కంపెనీలు భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది.

ఇదే కాకుండా ఔషధాల పరిశోధన- అభివృద్ధి(ఆర్‌ అండ్‌ డీ) కార్యకలాపాలు చేపట్టే సంస్థలకు ఎన్నో రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వటానికి ఐరోపా దేశాలు సిద్ధంగా ఉన్నాయి. గత రెండు దశాబ్దాల్లో ఐరోపాలో రీచ్‌ (రిజిస్ట్రేషన్‌, ఎవాల్యుయేషన్‌, ఆధరైజేషన్‌, రిస్ట్రిక్షన్‌ ఆఫ్‌ కెమికల్స్‌) చట్టం అమల్లోకి రావడం, కఠినమైన పర్యావరణ నిబంధనల వల్ల మందులు, రసాయనాల తయారీ, పరిశోధనలు క్షీణించాయి. నైట్రేషన్‌, ఫ్లోరినేషన్‌, బ్రోమినేషన్‌... తదితర కెమికల్‌ రియాక్షన్లు నిర్వహించడం సాధ్యం కాలేదు. మందుల తయారీకి ఈ ప్రక్రియలు ఎంతో ముఖ్యం. దీనికి ప్రత్యామ్నాయంగా గ్రీన్‌ కెమిస్ట్రీ, కంటిన్యుయస్‌ ప్రాసెస్‌ కెమిస్ట్రీ ప్రక్రియలను ఆవిష్కరించడానికి ఐరోపా దేశాలు నిధులు కేటాయిస్తున్నాయి. ఈ పరిశోధనల్లో పాలుపంచుకొని వినూత్నమైన ఔషధాలను, ప్రాసెస్‌లను ఆవిష్కరించే అవకాశం మనదేశానికి చెందిన కంపెనీలకు ఉన్నట్లు చెబుతున్నారు. తద్వారా ఐరోపా మార్కెట్లకు దగ్గర కావటంతో పాటు కొత్త ఔషధాలు తీసుకురావచ్చని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రత్యామ్నాయ మార్కెట్లపై దృష్టి..
2021-22 ఆర్థిక సంవత్సరంలో మనదేశం నుంచి 24.6 బిలియన్‌ డాలర్ల విలువైన మందులు వివిధ దేశాలకు ఎగుమతి అయ్యాయి. ఇందులో ఉత్తర అమెరికా వాటా 31.77% కాగా, ఐరోపా వాటా 17.98% మాత్రమే. ఐరోపాలో ప్రధానంగా యూకే, జర్మనీ, ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్‌, బెల్జియం దేశాలకు మందులు ఎగుమతి అవుతున్నాయి. గత కొంతకాలంగా అమెరికా మార్కెట్లో పోటీ బాగా పెరిగింది. దీంతో అమెరికా మార్కెట్‌పైనే ప్రధానంగా ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషించాల్సిన పరిస్థితి స్థానిక ఫార్మా కంపెనీలకు కనిపిస్తోంది. ఇదే సమయంలో ఐరోపా దేశాల్లో పరిణామాలు మారుతున్నాయి. ఇది మనదేశానికి కలిసి వస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నారు.

ఇవీ చదవండి:మరిన్ని ఆఫర్లతో వస్తున్న ఫ్లిప్​కార్ట్​.. త్వరలోనే 'బిగ్​ దీపావళి సేల్​'

మరో ఐదేళ్లలో ప్రపంచ మూడో ఆర్థికశక్తిగా భారత్‌: ఐఎంఎఫ్

ABOUT THE AUTHOR

...view details